Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ చరిత్ర ఏ సిరాతో…. ఈరోజుకూ అంతే… ఈ చరిత్ర ఏ రంగు సిరాతో…

March 16, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……… ఈ చరిత్ర ఏ సిరాతో ! ఇప్పుడయితే ఏ రంగు సిరాతో అని పెట్టవలసి ఉంటుందేమో ! ఎర్ర రంగా లేక బులుగు రంగా లేక కాషాయ రంగా లేక మరి ఇంకేదయినా రంగా ? ఈ సినిమాలో కూడా ఒక సీనులో ఇలాంటి ప్రస్తావన ఉంటుంది .

విలనేశ్వరుడి భజింత్రీ కవి అంటాడు . విలన్ కొడుకు పుట్టాకనే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని వ్రాస్తాను అంటాడు . చరిత్రదేముంది ; మనం వ్రాసిందే చరిత్ర . చూస్తున్నాం కదా ! ఈమధ్య ఒక పెద్ద సినిమా స్టార్ 2014 తర్వాతనే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ప్రకటించింది .

Ads

మరో పెద్దాయన అయోధ్యలో రామ మందిరం కట్టాకనే స్వాతంత్య్రం వచ్చిందని ఉవాచించారు . ఇలా ఎవరికి ఏ సిరాతో కావాలనుకుంటే ఆ సిరాతో వ్రాసుకోవచ్చు , వ్రాసుకుంటున్నారు కూడా . తిరగ వ్రాస్తున్నారు .

ఆరోజులకే కాదు ; ఈరోజుకి కూడా బ్రహ్మాండంగా సూటయ్యే విధంగా కధను వ్రాసారు పరుచూరి గోపాలకృష్ణ . అందుకు తగ్గట్లుగానే తూటాల్లాంటి మాటల్నీ వ్రాసారు . ఇలాంటి సినిమాలకు చిరునామా అయిన వేజెళ్ళ సత్యనారాయణ సినిమాను తన స్క్రీన్ ప్లే , దర్శకత్వాలతో స్పీడుగానే నడిపిస్తాడు . మనకు నిజ జీవితంలో కనిపించే ఎన్నో సంఘటనలను తెర మీద చూపారు .

నిత్య కల్యాణంలాగా మన దేశాన్ని వదలని లంచగొండితనం , ఆశ్రిత పక్షపాతం , రాజకీయుల నిస్సిగ్గు మోసాలు , వాళ్ళ భజంత్రీ రచయితలు , జర్నలిస్టులు , మీడియాలు , మేధావులు , వగైరా సమస్యలు విరాజిల్లుతూనే ఉన్నాయి .

ఈ సినిమాలో నూతన్ ప్రసాద్ ధరించిన కానిస్టేబుల్ పాత్ర “అంతా ప్రశాంతంగానే ఉంది” అంటూ లంచం పుచ్చుకుని తప్పుకుంటూ ఉంటాడు . ఇప్పుడు ఆ పోలీసు శాఖ అన్నీ విసర్జించి ఎంత దూరం పోయిందో చూస్తూనే ఉన్నాం . ఇలా ఎన్నో అంశాలు .

ఓ ముగ్గురు కుర్రాళ్ళు కాలేజిలో డిగ్రీలు పూర్తి చేసుకుని , సరయిన ఉద్యోగం రాక , చివరకు రోడ్ సైడ్ హోటల్ పెట్టుకుంటే దాన్ని కూడా కూల్చే మునిసిపల్ అధికారులు , ఆఖరికి బిచ్చగాళ్ళుగా మారటం టూకీగా ఈ సినిమా .

ఈ ముగ్గురు కుర్రాళ్ళగా రాజేంద్రప్రసాద్ , సాయిచంద్ , శేషుబాబు నటించారు . ఈ శేషు బాబు నా ఆప్తమిత్రుడు , గుంటూరులో ప్రముఖ చార్టర్డ్ ఎకౌంటెంట్ గోపీకృష్ణ తమ్ముడు మరియు మా TJPS కాలేజీలో మా M Com విద్యార్థి కూడా .

ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ సుందర వదనా డైలాగ్ ఇప్పటికీ వీర పాపులరే . ఫైర్ బ్రాండ్ ఎర్ర హీరోగా సుభాష్ చంద్ర బోస్ పేరుతో శివకృష్ణ తాండవం చేస్తారు . సామాజిక , ఆర్ధిక రుగ్మతలను ఎండకడుతూ బాధ్యత కల యువకుడిగా బాగా నటించారు . వీళ్ళందరికీ లెక్చరరుగా , విద్యార్ధులకు పాఠాలతో పాటు జీవితాన్ని , విలువలను కూడా బోధించాలని తాపత్రయ పడే పాత్రలో రంగనాధ్ చాలా బాగా నటించారు .

క్లైమాక్స్ సీనులో డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి తలంటి పోసే సీన్లో ఇంకా బాగా నటించారు . వీళ్ళకు తోడుగా ఉండే హీరోయిన్ల పాత్రల్లో జ్యోతి , అనుపమ చక్కగా నటించారు . జ్యోతి నటన చాలా బాగుంటుంది . ఇందులో అనుపమ అనే పేరుతో కనిపించిన నటి తర్వాత మరో పేరుతో నటించిందని గుర్తు . Subject to correction .

ఈ సినిమాలో మరో రెండు కీలక పాత్రలు . గోకిన రామారావు నటించిన వ్యవస్థారావు . పరుచూరి వారు వ్యవస్థకు సింబాలిక్ గా వ్యవస్థారావు అనే పేరుని పెట్టారు . ఆయన భజింత్రీ కవిగా పి యల్ నారాయణ . క్లైమాక్సులో ఆయనదే కీలక పాత్ర .

ఇతర పాత్రల్లో గుమ్మడి , వల్లం నరసింహారావు , డా. శివప్రసాద్ , రాజేశ్వరి ప్రభృతులు నటించారు . చిన్న పాత్రల్లో వేజెళ్ళ టీం నటించింది . శివాజీ రాజా సంగీత దర్శకుడు . కోపెల్ల శివరాం , డా నూలెట్ల పాటల్ని వ్రాసారు . కన్నుల ముందే కదులుతున్నది సస్యశ్యామల దేశమన్నది , ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది సస్యశ్యామల దేశమన్నది , కాలేజి చిన్నది కౌగిట్లో ఉన్నది , చదివినోళ్ళని మాకు పేరండి జనులారా , జీవితం కలవంటిది , నేడే దేశానికి స్వాతంత్ర్య దినం పాటలు ఉత్తేజాన్ని , ఆవేశాన్ని కలుగచేస్తాయి . శ్రావ్యంగా ఉంటాయి .

వెరశి మంచి సినిమా . ముఖ్యంగా పాలకులకు , పెట్టుబడిదారులకు అమ్ముడుపోయిన రచయితలు , జర్నలిస్టులు , మీడియా సంస్థలు , రంగురంగుల మేధావులు తప్పక చూడవలసిన సినిమా . పుట్టుకతోనే వృధ్ధులయిపోయిన నేటి యువకులు ఈ సినిమానే కాదు ఇలాంటి పాత సినిమాలను అప్పుడప్పుడు చూడాలి .

లేకపోతే ఇరవై ఏళ్ళకే వందేళ్ళ వృధ్ధులు అయిపోతారు . In conclusion , a watchable message oriented socio-economic critique . 1982 స్వాతంత్ర్య దినోత్సవం ముందు రోజు విడుదల అయిన ఈ సినిమా యూట్యూబులో ఉంది .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions