.
Why not HINDI (త్రిభాషా విధానం.. కొన్ని వాస్తవాలు) NOTE: IMPORTANT Points tobe Noted.
త్రిభాషా విధానం మీద రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ విషయంపై కొన్ని వాస్తవాలు తెలుసుకోవడం అవసరం.
Ads
* జాతీయ విద్యా విధానం-2020లోని త్రిభాషా విధానం విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని పేర్కొంది. అందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలన్నది తప్ప, హిందీ తప్పకుండా ఉండాలన్న నిబంధన లేదు. మూడోది ఏదైనా అంతర్జాతీయ భాష కావచ్చని చెప్పింది.
* భారతదేశానికి ఎటువంటి జాతీయ భాష (National Language) లేదు. ఉన్నవి అధికారిక భాషలు మాత్రమే! హిందీ జాతీయ భాష అనుకునేవారిని చూసి అమాయకులు అనుకోవాలి. మిగిలిన అన్ని అధికారిక భాషలతోపాటు అది కూడా ఒక భాష.
* హిందీ చాలా గొప్ప భాష అని చాలామంది ‘సైనికులు’ ఊహల్లో ఉన్నారు. ఆ ఉహల్లో నుంచి బయటకు రండి. భారతదేశంలో మొదట సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడం, ఒరియా భాషలకు ప్రాచీన హోదా కల్పించారు.
ఆ తర్వాత 2024లో కేంద్ర ప్రభుత్వం మరాఠీ, పాలీ, ప్రాకృత, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదాను కల్పించేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో హిందీ ఊసే లేదని గుర్తించాలి. హిందీ లిపి అనేది మరో పెద్ద సబ్జెక్టు.
* 2004లో తమిళ భాషకు ప్రాచీన హోదా కల్పించిన తర్వాత 2005లో సంస్కృతానికి ప్రాచీన హోదా కల్పించారు. ఆ లెక్కన భారతదేశంలో సంస్కృతం కంటే తమిళం ప్రాధాన్యమైనదని చెప్పకనే చెప్పారు.
* 1500-2000 సంవత్సరాల చరిత్ర, ఆ కాలంనాటి గ్రంథాలు లభ్యమయ్యే భాషలకే ప్రాచీన భాష హోదా ఇస్తారు. అంటే హిందీకి అవేవీ లేవని ఒప్పుకున్నట్టే!
* కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలకు హిందీతోపాటు ఇంగ్లీషు భాషను వాడాలని భారత ప్రభుత్వం నిర్దేశించింది. కాబట్టి హిందీకి అక్కడేమీ ఏకఛత్రాధిపత్యం లేదు.
* విద్యార్థులకు మూడు భాషలు నేర్పించే విధానాన్ని మొదటి విద్యా కమిషన్ (1964-66) ప్రతిపాదించింది. దీన్నే కొఠారి కమిషన్ అంటారు. దీన్ని 1968 జాతీయ విద్యా విధానంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అధికారికంగా స్వీకరించారు. అంటే త్రిభాషా విధానాన్ని తెరపైకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.
* చట్టాలు చేసే క్రమంలో మన దేశంలో మూడు జాబితాలు ఉంటాయి. కేంద్ర జాబితా (Central List), రాష్ట్ర జాబితా (State List), ఉమ్మడి జాబితా (Concurrent List). ఇందులో కేంద్ర జాబితాలోని అంశాలపై కేవలం కేంద్రమే చట్టాలు చేస్తుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రమే చట్టాలు చేస్తుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రం, రాష్ట్రం చట్టాలు చేస్తాయి. ‘విద్య’ గతంలో రాష్ట్ర జాబితాలో ఉండేది. ఆ తర్వాత ఉమ్మడి జాబితాలోకి మారింది.
* ‘తమిళనాడులో హిందీ నేర్పితే ఏం పోయింది?’ అని వాదిస్తున్న తెలుగువారికి ఓ చిన్న సమాచారం. తమిళనాడులో హిందీ మాట్లాడేవారి సంఖ్య 2 నుంచి 3 శాతం. అదే తెలుగు మాట్లాడేవారి సంఖ్య 5 నుంచి 6 శాతం (సుమారు 42 లక్షలమంది). అంటే త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని అనుకుంటే మరో భాషగా అక్కడ పెట్టాల్సింది హిందీ కాదు, తెలుగు.
* తమిళనాడులో హిందీ ద్వేషం అంటూ ఏమీ లేదు. అది కొందరు రాజకీయ నాయకుల ప్రచారమే తప్ప, అక్కడ కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో హిందీ ఒక భాషగా ఉంటుంది. స్వాతంత్రానికి ముందు నుంచే చెన్నైలో హిందీ ప్రచార సభ నడుస్తోంది. ఎంతోమంది అందులో చేరి హిందీ నేర్చుకున్నారు.
* ‘హిందీ బలవంతంగా రుద్దడం సహించం’ అని ఇవాళ అంటున్న తమిళ ప్రభుత్వం 2010 నుంచి ఇప్పటిదాకా తమిళనాడులో అనేక బడుల్లో తెలుగును తీసేయించింది. తెలుగు బడులు మూసే పరిస్థితి తెచ్చింది. మరో భాష వాళ్ల మీద రుద్దొద్దు కానీ, మరో భాషను వాళ్లు హాయిగా దూరం చేస్తారు. ఇదేం పద్ధతి..?
* తమిళనాడు ముఖ్యమంత్రిగా సి.ఎన్. అన్నాదురై (డీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు) ఉన్న సమయంలో(1967-69) తమిళనాడులో హిందీ నేర్చుకునే అవకాశాన్ని తిరస్కరించారు. ఇది జరిగి 56 ఏళ్లు దాటింది. ప్రస్తుతం జనాలు ఏమనుకుంటున్నారో తెలియాలి కదా!
వాళ్లకు హిందీ నేర్చుకోవాలని ఉంటే, విద్యావిధానంలో కావాలని అనుకుంటే తప్పకుండా అమలు చేయాలి. అంతేకానీ, నాయకులే మొండిగా దూసుకుపోవడం కరెక్ట్ కాదుగా! ఎమ్మెల్యేలు, ఎంపీల మాట కాదు, ఈ విషయంలో జనం మాటేమిటో తెలియాలి…. – విశీ (వి.సాయివంశీ)
Share this Article