.
…. ( పార్థసారథి పొట్లూరి ) …. హఫీజ్ సయిద్ చనిపోయాడు! ఎవరు అతను అనుకుంటున్నారా..?
26/11 ముంబై మారణకాండ మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్… గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పులలో మరణించాడు! గుర్తుతెలియని వ్యక్తులు అనేకమంది భారత వ్యతిరేక శక్తులను ఖతం చేస్తున్నారు తెలుసు కదా కొన్నాళ్లుగా…
Ads
నిన్న అంటే శనివారం రోజున అబు కతల్ ( Abu Qatal) ను జీలం జిల్లాలోని దిన అనే ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. అబు కతల్ హఫీజ్ సయీద్ మేనల్లుడు!
అబు కతల్ కారులో అనుచరులతో కాన్వాయ్ తో ప్రయాణస్తుండగా సాయంత్రం 7 గంటల సమయంలో ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు కనీసం నలుగురు ఉండవచ్చు బుల్లెట్ల వర్షం కురిపించారు.
అబు కతల్ ప్రయాణస్తున్న కారులో ఎవరు ఎవరు ఉన్నారో తెలియదు కానీ అబు కతల్ పేరు మాత్రమే బయటికి వచ్చింది. ఆ దాడిలో అబు కతల్ తో పాటు అతని బాడీ గార్డు సంఘటన స్థలంలోనే మరణించగా, రెండో బాడీ గార్డ్ తీవ్రంగా గాయపడడంతో హాస్పిటల్ లో చేర్పించారు, కానీ ఈ రోజు అతను కూడా మరణించినట్లుగా తెలుస్తున్నది!
ఇంతవరకు ఓకే. కానీ కొద్ది గంటల క్రితమే లష్కరే తోయిబా టెర్రరిస్ట్ 26/11 ముంబై దాడుల మాస్టర్ మైండ్ అయిన హఫీజ్ సయిద్ మరణించినట్లుగా ధ్రువీకరించని వార్త బయటికి వచ్చింది!
అఫ్కోర్స్! దావూద్ ఇబ్రహీం చనిపోయి రెండేళ్లు అవుతున్నా పాకిస్తాన్ ఇంతవరకూ ధ్రువీకరించలేదు! ఎందుకంటే దావూద్ ఐక్యరాజ్యాసమితి గుర్తించిన టెర్రరిస్ట్ జాబితాలో ఉన్నాడు కనుక దావూద్ మరణ వార్తని ధ్రువీకరిస్తే పాకిస్తాన్ మీద ఆంక్షలు విధించే అవకాశం ఉంది!
హఫీజ్ సయీద్ గృహ నిర్భంధంలో ఉంచామని పాకిస్తాన్ ప్రకటించినా అతను పాకిస్తాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని అందరికి తెలుసు! కారులో ప్రయాణస్తుండగా కాల్పులలో గాయపడి మరణిస్తే హఫీజ్ గృహ నిర్భంధంలో లేడని తేలిపోతుంది కాబట్టి హఫీజ్ సయీద్ పేరు బయటికి రాకుండా జాగ్రత్త పడిఉండవచ్చు!
నిత్యం ISI పడగ నీడలో సంచరించే హఫీజ్ సయీద్ అతని మేనల్లుడు అబు కతల్ ప్రయాణ సమాచారం బయటికి ఎలా వచ్చింది?
ప్రతీ 5 కిలోమీటర్లకి ఒకరు ఉండి అతను క్లియరెన్స్ ఇస్తేనే కానీ కాన్వాయ్ ముందుకు వెళ్ళదు. ఇది ప్రయాణం మొదలయిన దగ్గరి నుండి గమ్యం చేరేవరకూ కొనసాగుతుంది! ISI కి పనిచేసేవాళ్ళు ఈ నెట్వర్క్ లో ఉంటారు!
హఫీజ్ సయీద్, అబు కతల్ RAW హిట్ లిస్ట్ లో ఉన్నారని ISI కి తెలుసు. కాబట్టి గత పదేళ్లుగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నది! హఫీజ్ ప్రయాణించే మార్గంలో ప్రతీ రెండు కిలోమీటర్లకి ఒక సేఫ్ షెల్టర్ ని ఏర్పాటు చేసి, ముందు ఉన్న వాళ్ళ దగ్గరి నుండి క్లియరెన్స్ రాకపోతే వెంటనే దగ్గరలో ఉన్న సేఫ్ షెల్టర్ కి తరలిస్తుంది కాన్వాయ్ ని.
అలాంటిది నలుగురికి పైగా ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు సెమీ ఆటోమాటిక్ గన్స్ తో గుళ్ల వర్షం కురిపించారు అంటే ISI కి పనిచేస్తున్న వాళ్లలో ఎవరో డబ్బుకి అమ్ముడుపోయి ఉండవచ్చు!
హఫీజ్ సయిద్ మరణ వార్తే ముఖ్యమైనది!
గత కొంత కాలంగా హఫీజ్ సయీద్ తన అనుచరులని ఎవరిని నమ్మడం లేదని తన మేనల్లుడు అయిన అబు కతల్ తోనే ఎక్కువగా ఉంటున్నాడని, అబు కతల్ అనుచరులలో ఒకరి మొబైల్ ఫోన్ నే అప్పుడప్పుడు వాడుతున్నాడని వార్త! RAW ఎక్కడ తన మొబైల్ సంభాషణలు వింటుందో అనే భయమే హఫీజ్ మొబైల్ ఫోన్ వాడకుండా చేసింది!
హఫీజ్ సయీద్ తో పాటు అబు కతల్ కూడా హిట్ లిస్టులో ఉన్నాడు! అబు కతల్ కి అయిదు మారుపేర్లు ఉన్నాయి అవి..అలీ, హబీబుల్లా, నౌమాన్, మొహమ్మద్ కాసీం. హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా కి చీఫ్ అయినా తన మేనల్లుడు అయిన అబు కతల్ ని చీఫ్ ఆపరేషనల్ కమాండర్ గా నియమించాడు. ప్లాన్ హఫీజ్ వేస్తే దానిని అమలు చేసేది అబు కతల్.
అబు కతల్ మీద NIA వద్ద మోపబడ్డ అభియోగాలు ఇలా ఉన్నాయి…
1. జనవరి 1,2023 న రాజోరి జిల్లాలోని దంగ్రీ అనే గ్రామంలో నలుగురు ఉగ్రవాదులు ప్రవేశించి కాల్పులు జరిగిన ఘటనలో నలుగురు గ్రామస్తులు మరణించారు. ఉగ్రవాదులు పారిపోతూ గ్రామంలో IED ( Improvised Explosive Device) ని అమర్చి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఇద్దరు చిన్న పిల్లలు IED పేలుడులో మరణించారు. భద్రతా దళాలు గాలించి నలుగురు తీవ్రవాదులని మట్టు పెట్టాయి. వాళ్ళ దగ్గర దొరికిన డాక్యుమెంట్ లో అబు కతల్ పేరు బయటపడింది.
2.జూన్ 9,2024 న రైసీ జిల్లాలో శివకోరి గుహలో ఉన్న శివాలాయాన్ని దర్శించుకోవడానికి భక్తులతో వెళుతున్న బస్సు ని ఉగ్రవాది హఠాత్తుగా బస్సుకి అడ్డం వచ్చి కాల్పులు జరిపిన ఘటనలో బస్సు రోడ్డు పక్కనే ఉన్న పెద్ద గుంటలో పడి 9 మంది భక్తులు చనిపోగా 41 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ఘటనకి కూడా అబు కతల్ బాధ్యుడు!
జమ్మూకాశ్మీర్ సరిహద్దు గ్రామాలలో యువకులకి డబ్బు ఆశ చూపి లష్కరే తోయిబాలోకి రిక్రూట్ చేస్తున్నాడు అబు కతల్! అందుకే వీళ్ళకి ISI రక్షణ ఉంటుంది కానీ ISI నిన్న రక్షించలేకపోయింది!
ఇక లష్కరే తోయిబాకి ఎవరు నాయకుడిగా వచ్చినా వెంటనే పోతారు హమాస్ నాయకులలాగా!
గుర్తు తెలియని వ్యక్తులకి ధన్యవాదములు!
ఇంతకీ టాప్ 10 స్పై ఏజెన్సీలలో ISI కి ఎన్నో స్థానం ఇస్తారు? తలుపులు కోట లోపలి నుండి తెరవబడ్డ రోజుల్లో ప్రతీ వెధవ హీరో అయ్యాడు! ఇప్పుడు శత్రువుల కోటలో లోపల నుండి తలుపులు తీయబడుతున్నాయి!
Share this Article