.
చిరంజీవి ఆల్రెడీ లండన్ బయల్దేరి ఉంటాడేమో… 19న బ్రిటన్‌లో సన్మానం కదా… మొన్న ఆ వార్త చదివాక కొన్ని సందేహాలు… అందరూ ఏమని రాశారంటే..?
‘‘అగ్రహీరో చిరంజీవి కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది… యూకే పార్లమెంటులో గౌరవ పురస్కారం అందుకోనున్నాడు… ఇదొక అంతర్జాతీయ అవార్డు… ఇన్ని దశాబ్దాలుగా కళారంగం ద్వారా, సామాజికంగా సేవలు అందిస్తున్నందుకు అరుదైన గుర్తింపు, ప్రశంస…’’
Ads
ఒకరిద్దరయితే బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించిందని రాసేశారు… పనిలోపనిగా తను గిన్నీస్ రికార్డును కూడా ప్రస్తావిస్తున్నారు… ‘‘ఆయన 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 నృత్య కదలికలు చేసినందుకు ఈ రికార్డు దక్కింది…’’
ఇది చదవగానే ఒక్క క్షణం బ్రిటన్ రాజు అందించే అరుదైన గౌరవపురస్కారమేమో అనిపించింది… మొన్నామధ్య చార్లెస్-3 ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలకు గాను 1200 మందిని గౌరవ పురస్కారాలకు ఎంపిక చేస్తే, అందులో 30 మంది భారత సంతతి వారు… ప్రతి ఏటా ఇలా ప్రకటిస్తుంటారు కూడా…
ఐనా యూకే విదేశీయులకు గౌరవ పురస్కారం ఇవ్వడం అత్యంత అరుదు… అసలు ఇన్ని దేశాల్లో నిస్వార్థంగా, జనం కోసం పలు రంగాల్లో విశిష్ట సేవల్ని అందించేవాళ్లను ఎంపిక చేయడం కూడా టాస్కే… మరి చిరంజీవికి ప్రకటించబడిన ఆ పురస్కారం ఏమిటబ్బా అని వెతికితే…
అది బ్రిటన్ ప్రభుత్వ పురస్కారం కాదు… పార్లమెంటు సన్మానం కాదు… not by parliament (house of commons) it will be at parliament… అంటే పార్లమెంటులో… కానీ పార్లమెంటు చేసేది కాదు… అదీ క్లారిటీ… స్కోచ్ అవార్డులు గుర్తొస్తున్నాయా..?
అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ, తన మిత్రులైన మరో ఇద్దరు ఎంపీలతో కలిసి సన్మానిస్తారు… ఈ సందర్భంగా బ్రిడ్జ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ చిరంజీవికి లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డును ఇస్తుంది… ఈ కార్యక్రమానికీ, ఈ పురస్కారాలకూ, ఈ సన్మానాలకూ బ్రిటన్ ప్రభుత్వానికీ ఏ సంబంధమూ లేదు…
నిజానికి చిరంజీవికి ఈ దేశం రెండవ అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ ఇచ్చింది… దానికి కారణాలు, సమీకరణాలు, కారకుల మీద ఏ విశ్లేషణలు వినిపించినా సరే… ఇంత పెద్ద పురస్కారం ముందు మిగతా ఏ పురస్కారాలైనా దిగదుడుపే… అదే తన కీర్తికిరీటంలో కలికితురాయి అని చెప్పదగింది, రాయదగింది… అంతే…
Share this Article