.
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ పేరును తొలగించి, సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టే విషయంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థించుకుంటున్న తీరు విస్మయకరంగా, తప్పుడు పద్ధతిలో ఉంది… రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన వివరణ కూడా అభ్యంతరకరంగా ఉంది…
ఎస్, తను చెప్పినట్గుగానే… ‘‘రాజకీయాలు కలుషితమయ్యాయో… నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదు…’’ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయి…
Ads
‘‘పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా చూడటం లేదు, వారి ప్రాణత్యాగాన్ని గుర్తించి అందరూ స్మరించుకోవాలి, పరిపాలనలో భాగంగా కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్నాం… రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లు పెట్టుకున్నాం…
రాష్ట్ర పునర్విభజన తరువాత గత పదేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది… కొన్ని వర్గాలకు కొందరు అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు… కేంద్ర పదవుల్లో ఉన్నవారు కూడా ఇలా చేయడం సమంజసం కాదు… ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నాం… ఇది ఎన్టీఆర్ ను అగౌరవపరిచినట్టు కాదు…
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నాం… వైఎస్ పేరుతో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం… వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరును పెట్టుకున్నాం… ఇందులో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్నాం…
ఏపీలో ఆ పాత పేర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలకు తెలంగాణలో పేర్లు మార్చుకున్నాం… ఒకే పేరుతో రెండు యూనివర్సిటీలు ఉంటే పరిపాలనలో గందరగోళం ఉంటుంది… అందుకే తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు, సంస్థలకు తెలంగాణ పేర్లు పెట్టుకుంటున్నాం… అంతే కానీ వ్యక్తులను అగౌరవపరిచేందుకు కాదు…
విశాల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు… బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు కులాన్ని ఆపాదిస్తున్నారు… కుల, మత ప్రాతిపదికన విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటే అది తప్పు
చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందాం… చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలి… బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్ కు రోశయ్య గారి పేరు పెట్టుకుందాం… రోశయ్య గారి సేవలను గౌరవిద్దాం…’’
……… ఇదీ రేవంత్ రెడ్డి విఫల సమర్థన… కొన్ని ప్రశ్నలు… పొట్టి శ్రీరాములు పేరును పీకిపడేశారు సరే, కానీ సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ఏర్పాటు కోసం ఏం కృషి చేశాడు మహాశయా..? ఆయన ఎప్పుడు మరణించాడో తెలుసా ఈ ప్రభుత్వానికి..? గొప్పవాడే కావచ్చుగాక, కానీ తెలంగాణ ఏర్పాటుకు ప్రయత్నించాడనే కొత్త చరిత్ర దేనికి..? పైగా ఈ పేర్ల మార్పిడి తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం అట..!!
పరిపాలన కారణాలు అంటారా…? మరి జేఎన్‌టీయూ కాకినాడ, జేఎన్‌టీయూ హైదరాబాద్ అని ఉన్నాయి కదా… జేఎన్‌టీయూ పేరు మార్చి జయశంకర్ పేరు పెడదామా..? నెహ్రూ పేరు తీసేసే దమ్ముందా ఈ సర్కారుకు..? (తెలంగాణను ఆంధ్రాతో కలిపేసిన మొట్ట మొదటి తెలంగాణ వ్యతిరేకి తనే కదా…)
వోకే, ఒకే యూనివర్శిటీకి రెండు రాష్ట్రాల్లో ఒకే పేరు ఉంటే పాలనపరమైన సమస్యలు వస్తాయంటున్నారు కదా… సరే, ఆ పేరు పీకేశారు సరే… కానీ సురవరం ప్రతాపరెడ్డి పేరే ఎందుకు..? నిజంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వాళ్లు ఎందరు లేరు..? Why Only Suravaram Pratap Reddy Name..?
నిజంగా తెలంగాణ సాహితీ సమాజం ఎప్పుడూ స్మరించుకోవాల్సిన సురవరం పేరును ఉస్మానియా యూనివర్శిటీకి పెడితే ఇంకా బాగుండేది కదా….. పెట్టలేరు..? ఏదో భయం… జంకు…
పొట్టి శ్రీరాములు పేరు తీసేసి, ఇప్పుడు… అబ్బే, రోశయ్య పేరును నేచర్ క్యూర్ హాస్పిటల్‌కు పెడతా అంటున్నారు… తనూ ఆంధ్రుడే కదా, మరి ఆయన పేరు దేనికట..? కంటితుడుపు ప్రకటన, మభ్యపెట్టే శుష్క ప్రకటన… ఇక్కడ పొట్టి శ్రీరాములు పేరు పీకేసిందేమో తను, ఇప్పుడేమో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ఆయన పేరు పెడదాం అంటాడు.., బీజేపీ వాళ్లు కేంద్రం నుంచి అనుమతి తీసుకురావాలట… ఉత్త డొల్ల డైవర్షన్… కాస్త మెరుగైన, నాణ్యమైన రాజకీయం ప్రదర్శించవచ్చు కదా మాస్టారూ..?
పోనీ, తమ విధానాలతో తెలంగాణను తీవ్రంగా నష్టపరిచిన సమైక్య పాలకులు, ఆంధ్రావాళ్ల విగ్రహాల్ని ట్యాంకు బండు నుంచి, అన్ని చోట్ల నుంచి తీసేయగలదా ఈ ప్రభుత్వం..? ప్రత్యేకించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డ ప్రతి నాయకుడి విగ్రహాన్ని… Can CM Revanth Reddy do it..?
పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసింది మద్రాస్ నుంచి ఆంధ్రను విముక్తం చేయడం కోసమే… తెలంగాణకూ ఆయనకూ సంబంధం ఏమీ లేదు… తెలంగాణ వైశ్య సమాజానికి ఆ ఎరుక ఉంది… కానీ తమ సామాజికవర్గానికి చెందిన మహనీయుల్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని, గౌరవించాలని భావిస్తుంది… దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భంగపరిచి, ఒక సామాజిక వర్గం మనోభావాల్ని దెబ్బతీసింది..!! చివరగా…. పొట్టి శ్రీరాములు గాంధీని మించిన గాంధేయవాది..!
Share this Article