.
సాధారణంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వంటకాల్లో వేస్తుంటాం కదా… కానీ అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలుగా లేదా తరుగుగా అలాగే వేసి ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేసేవాళ్లూ ఉంటారు… పెసరట్టు మీద పచ్చి అల్లం తరుగు అలాగే పైన జల్లి దాన్ని ఇష్టపడే వాళ్లు కూడా తెలుసు కదా…
ఐతే చాలామందికి వెల్లుల్లి పచ్చిగా ఉంటే ఆ ఘాటు వాసన పడదు… కొందరికేమో అదే ఇష్టం… సరే, ఈమధ్య హైదరాబాద్, ఇతర తెలుగు నగరాల్లోని చాలా రెస్టారెంట్లలో గార్లిక్ నాన్ సర్వ్ చేస్తున్నారు… బటర్ వేసి మరీ… దాంట్లో కొద్దిగా కాలి, కొద్దిగా పచ్చిపచ్చిగా అలాగే ఉండి, అదొక ఫ్లేవర్… ఇప్పుడు వాటి ఆర్డర్లు పెరుగుతున్నాయి…
Ads
అఫ్‌కోర్స్, నాన్ కాల్చడంలో దక్షిణాదికీ, ఉత్తరాదికీ కొంత తేడా ఉండొచ్చుగాక… ప్రసిద్ధ ఆహార ర్యాంకింగ్ వెబ్‌సైట్ టేస్ట్ అట్లాస్ తెలుసు కదా… బ్రెడ్ అనే కేటగిరీలో తాజాగా ర్యాంకింగ్స్ ఇచ్చాడు… ఈ గార్లిక్ నాన్ ఫస్ట్ ర్యాంకు… వాడంతే… బ్రెడ్ అంటే మన రొట్టెలు కూడా చేర్చేస్తాడు జాబితాలో…
మనకేమో బ్రెడ్ అంటే డబల్ రొట్టె, బన్ను, చోటా పావ్ ఎట్సెట్రా… వాడికి బ్రెడ్ అన్నిరకాల రొట్టెలు, బన్నులు… హఠాత్తుగా వాడికి మన గార్లిక్ నాన్ మీద ప్రేమ కుదిరింది… సరే, మిగతా ఇండియన్ రొట్టెల విషయానికొస్తే… సౌత్ ఇండియన్ పరోటాకు ఆరో ప్లేసు ఇచ్చాడు… నిజానికి పరోటా అంటే నార్తరన్ స్టేట్స్‌లోనే అదరగొడతారు మరి…
మామూలు నాన్‌కు ఎనిమిదో ర్యాంకు ఇచ్చాడు… పరాటాకు 18వ ప్లేసు… అవునూ, పరోటాకు పరాటాకు తేడా ఎంత..? సేమ్ కదా… కాకపోతే పరోటా సౌత్, పరాటా నార్త్… పరాటాలో కొన్నిసార్లు స్టఫ్ ఉంటుంది… తయారీలో కూడా ప్రాంతాలను బట్టి స్వల్ప వ్యత్యాసం, అంతే… రెండూ పొరల రొట్టెలే కదా…
26 వ ర్యాంకులో బతూరా… తెలుసు కదా, పేరుకు పంజాబీ పూరీలు… కాస్త పెద్దవిగా… అందులోకి ఆధరువులు రకరకాల కూరలు… ఎక్కువగా రాజ్‌మా, శనగల కూరతో తింటారు, సో, దాన్ని పంజాబీ వంటకం అని రాసేశాడు… పూరీల్ని కూడా వాడు బ్రెడ్ కేటగిరీలో కలిపేశాడు… అంతే మరి, అవీ రొట్టెలే, కాకపోతే నూనెలో ఫ్రై చేసిన రొట్టెలు అనుకోవాలన్నమాట…
28వ ప్లేసులో ఆలూ నాన్ పేర్కొన్నాడు… ఏముంది..? కాస్త చిదిమిన ఆలూ స్టఫ్ చేయడమే కదా… అదొక వెరయిటీ… మామూలు రోటీకి 35 వ ర్యాంకు… సౌత్ కాదు గానీ, నార్త్‌లో ప్రధాన ఆహారమే కదా… ఉన్నయ్, ఇంకా ఉన్నయ్… అలూ స్టఫ్‌డ్ పరోటాకు 71వ ప్లేసు ఇచ్చాడు…
నార్త్ ఇండియాలో లచ్చా పరాటా అని మరో వెరయిటీ… ఇది 75వ ర్యాంకు… రుమాలీ రోటీ చాలా పెళ్లిళ్లలో చూస్తున్నదే కదా… పతలా చపాతీ… తినీ తినీ అందరికీ బోర్ వచ్చేసింది… దానికి 84వ ర్యాంకు… అన్నట్టు బతూరాకు 26వ ర్యాంకు ఇచ్చాడు కదా… మళ్లీ పూరీకి 99వ ర్యాంకు…
అన్నట్టు చెప్పడం మరిచేపోయా… ఇదే బటర్ గార్లిక్ నాన్‌కు గత ఏడాది జూలైలో ఏడవ ర్యాంకు ఇచ్చాడు… నిజానికి బతూరాకూ, పూరీకి నడుమ అంత తేడా ఉంటుందా..? ఏమో… పూరీని వదిలేస్తే పరోటా, పరాటా, నాన్, రోటీ, రుమాలీ రోటీ ఏవైనా కాస్త తయారీ తేడాలతో ఒకటే టైపు కదా…!! అసలు బేకబడే బ్రెడ్డులు, కాల్చబడే రోటీలు, వేగించే పూరీలు… అన్నీ ఒకే కేటగిరీ అంటాడు వాడు…! సరే, మరో కేటగిరీ మరో కథనంలో…
Share this Article