.
తులసి గబ్బార్డ్… అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్… మోడీని కలిసింది… తరువాత ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘కష్ట సమయాల్లో భగవద్గీతలోని శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన బోధనలు తనకు బలాన్ని, శాంతిని, స్ఫూర్తిని ఇస్తాయి… క్లిష్ట సమయంలో సవాళ్లు ఎదుర్కొంటున్నా, ఎప్పుడు కష్టాలు చుట్టుముట్టినా, అర్జునుడికి కృష్ణుడు బోధించిన పాఠాలను వింటాను… ఇవే నాలో బలాన్ని, శాంతిని పెంచుతాయి” అని పేర్కొంది…
భారతీయ సంస్కృతి పట్ల తనకున్న గౌరవాన్ని కూడా ఆమె వ్యక్తం చేసింది, భారత్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుందని చెప్పింది. భారతీయ ఆహారం తనకు చాలా ఇష్టమని చెప్పింది. ముఖ్యంగా “దాల్ మఖానీ” (Daal Makhani), తాజా “పనీర్” (Paneer) తో చేసిన ఏదైనా వంటకం తనకు అద్భుతంగా ఉంటుందని పేర్కొంది… ఆమె భారత సంస్కృతి, భారతీయ ఆహారం పట్ల తనకున్న ఇష్టాన్ని బహిరంగంగా చెప్పడం ద్వారా భారతీయులతో తన అనుబంధాన్ని మరింత బలపరిచింది…
.
Ads
ఐతే చాలామంది జర్నలిస్టులు కూడా పొరబడుతున్నట్టు… ఆమెకు ఇండియన్ రూట్స్ ఏమీ లేవు… ఆమెవి యూరోపియన్, అమెరికన్ మూలాలే… తులసి అనే పేరును బట్టి చాలా మంది సోషల్ మీడియాలో కూడా ఇండియన్ రూట్స్ ఉన్న మహిళ అని రాస్తున్నారు… కానీ అది కరెక్టు కాదు…
పుట్టింది అమెరికాకు దూరంగా… సముద్రంలో విసిరేసినట్టుగా ఉండే లెలోలోవా ద్వీపంలో… (అమెరికన్ సమోవా దీవులు)… తల్లి కరోల్ గబార్డ్, తండ్రి మైక్ గబార్డ్… ఈయనవి యూరోపియన్ రూట్స్… తులసి పుట్టాక రెండేళ్లకు ఈ కుటుంబం హవాయికి తరలిపోయింది… రాజకీయ కుటుంబమే…
మరి తులసి పేరు ఏమిటీ అంటారా..? తులసి తల్లి హిందూ మతాన్ని స్వీకరించింది… తండ్రి క్రైస్తవాన్ని ఆచరిస్తాడు… తన ఐదుగురు పిల్లలకు ఆమె హిందూ పేర్లే పెట్టుకుంది… భక్తి, జై, ఆర్యన్, తులసి, బృందావన్… ఇవీ పిల్లల పేర్లు… (ఇంట్లో దీపావళిని ఎంత ఘనంగా జరుపుకుంటారో క్రిస్టమస్‌ను కూడా అలాగే జరుపుకుంటారు)…
తులసి నేషనల్ ఆర్మీలో పనిచేస్తూ పలు దేశాలు తిరిగింది… ఇరాక్ యుద్ధంలోనూ పాల్గొంది… లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి ఆమెది… హిందూ మతాన్ని ఆచరిస్తుంది… పొద్దున్నే యోగ, ధ్యానం, గీతాపఠనం తప్పనిసరి… శాకాహారి… వైష్ణవం ఆచరణ… యూఎస్ హౌజ్‌కు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేసిందామె…
భగవద్గీతనే తన మార్గదర్శిగా చెబుతుంది… హౌజ్‌కు ఎన్నికైన తొలి హిందూ మహిళ ఆమె… ఒక దశలో అమెరికా అధ్యక్ష అభ్యర్థి కావాలనీ ప్రయత్నించింది… మొదట్లో ట్రంప్ ప్రత్యర్థి పార్టీ… ఇప్పుడు ట్రంప్ పార్టీ…
ఇదీ ఆమె నేపథ్యం… కర్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తుంది… ఇస్కాన్‌తో సత్సంబంధాలున్నాయి… 2002లో ఎడ్వర్డోను పెళ్లి చేసుకుంది కానీ నాలుగేళ్లకే విడాకులయ్యాయి… 2015లో తిరిగి అబ్రహాం విలియమ్స్‌ను పెళ్లి చేసుకుంది… సో, ఇలా ఏ కోణం నుంచి చూసినా ఆమెకు ఇండియాతో ఏ ప్రత్యక్ష కనెక్షనూ లేదు…
2014లో మోడీ, ఆమె కలిసినప్పుడు చేతులు జోడించి నమస్కారం చేసి, భగవద్గీతను ప్రజెంట్ చేసింది… ఇప్పుడు మళ్లీ ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి… అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బలంగా సపోర్ట్ చేసింది… బంగ్లాదేశ్‌లో హిందువుల మీద సాగుతున్న దాడుల మీద రీసెంటుగా ఆందోళన వ్యక్తం చేసింది ఆమె…
తాజాగా ఇండియా పర్యటనకు వచ్చిన ఆమె మొదట రాజనాథ్ సింగ్‌ను కలిసి, తరువాత ప్రధాని మోడీని కూడా కలిసింది… ఆమె హిందూ విశ్వాసి కాబట్టి ఆమెకు మహాకుంభమేళా బాపతు పవిత్ర జలాన్ని ఇచ్చాడు… ఆమె మోడీకి తులసిమాలను కానుకగా ఇచ్చింది…
హిందూ మూలాలున్న సునీత విలియమ్స్… పేరును వదల్లేదు, గీతనూ వదల్లేదు, మతాన్నీ వదల్లేదు… అంతరిక్షం వెళ్లినా సరే..! హిందూ మూలాలేవీ లేకపోయినా సరే, తులసి గబార్డ్… తల్లి పెట్టిన పేరు వదల్లేదు, గీతను వదల్లేదు… మతాన్నీ వదల్లేదు…! ఒకరు అంతరిక్షం నుంచి భూమ్మీదకు తిరిగి వస్తుంటే, మరొకరు అమెరికా నుంచి ఇండియా పర్యటనకు వచ్చింది… భగవద్గీత కామన్ పాయింట్..!
Share this Article