.
Subramanyam Dogiparthi ….. యన్టీఆర్ కృష్ణావతారం కాదిది . కృష్ణ కృష్ణావతారం . బుద్ధిమంతుడు వంటి బ్లాక్ బస్టర్ని నిర్మించిన చిత్రకల్పన బేనర్లో సెప్టెంబర్ 1982లో బాపు దర్శకత్వంలో వచ్చింది ఈ కృష్ణావతారం . బాపు ఆత్మమిత్రుడయిన ముళ్ళపూడి వెంకట రమణ ఈ సినిమాకు నిర్మాత కూడా . ఆయన , శ్రీరమణ కలిసి ఈ సినిమా స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు . బహుశా అందరికీ వాటాలు ఉన్నాయేమో !
మూలకధ కె యన్ టైలర్ అని టైటిల్సులో చెప్పారు . ఈ టైలర్ తుళు భాషలో పాపులర్ కధా రచయిత , రంగస్థల నటుడు , సినిమాలలో కూడా నటుడు . ఆయన మూలకధకు మెరుగులు దిద్దుకుని ముళ్ళపూడి , శ్రీరమణ ఈ సినిమా కధను తయారు చేసుకుని బాపుకు దర్శకత్వం అప్పచెప్పి ఉండాలి .
Ads
ఈ సినిమా చూస్తుంటే మాయదారి మల్లిగాడు సినిమా గుర్తుకొస్తుంది . కధలు వేర్వేరు . కృష్ణ చలాకీగా , స్వఛ్ఛ మనసుతో పదిమందికీ ఉపయోగ పడే వ్యక్తిగా , నవ్వుతూ బతికాలిరా అనే మనిషిగా నటించారు రెండు సినిమాలలోని పాత్రల్లో . అలా ఆ సినిమా గుర్తుకొస్తుంది .
కృష్ణకు జోడీగా అతిలోకసుందరి . జోడీ చాలా అందంగా ఉంటుంది . నిజాయితీపరుడైన తన మామ కొరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వెంటనే ఉండే పాత్రలో శ్రీదేవి బాగా నటించింది . బహుశా బాపు దర్శకత్వంలో ఆమె ఈ ఒక్క సినిమాలోనే నటించిందేమో !
కృష్ణది దొంగల్లుడు పాత్ర . ఓ డబ్బున్న మారాజుకి ఓ కంత్రీ లాయర్ అల్లుడు ఉంటాడు . ఆ లాయర్ కస్టమర్ చిల్లర దొంగ కృష్ణ . సినిమాలో పేరే కందుల కృష్ణావతారం . కంత్రీ లాయర్ దుర్మార్గంగా మరదలిని గర్భవతిని చేస్తాడు . పరువు కాపాడుకోవటానికి ఓ దొంగల్లుడు అవసరం అవుతాడు . హీరో గారిని దింపుతాడు కంత్రీ లాయర్ .
ప్రసవం అయిపోయాక హీరోని లేపేయటానికి ఇంట్లో అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు . హీరో మాత్రం మోసపోయిన చిన్న కూతురికి రక్షణగా ఉంటాడు . క్లైమాక్సులో కంత్రీ లాయర్ హీరోని షూట్ చేయబోయి , మరదల్ని షూట్ చేస్తాడు .
చనిపోయే ముందు తనను గర్భవతిని చేసిందీ , అన్ని విలన్ కార్యక్రమాలు కంత్రీ బావయ్యే అని చెప్పి ప్రాణాలను వదులుతుంది . ఆమె ప్రసవించిన బిడ్డను తీసుకుని హీరోహీరోయిన్లు నిష్క్రమిస్తారు . టూకీగా ఇదీ కధ .
కధ డిఫరెంటుగానే ఉంటుంది . బాపు శుభ్రంగానే తీసారు . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాపు మార్కులో శ్రావ్యంగానే ఉంటాయి . కృష్ణ , శ్రీదేవి జోడీ అందంగా , చలాకీగా ఉంటుంది . అయితే ఆ లెవెల్లో అడినట్లుగా లేదు సినిమా . కృష్ణ సినిమా కాబట్టి భారీ ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి ముళ్ళపూడి వారు నష్టాలు లేకుండా లాభాలతోనే బయటపడి ఉండాలి . యాభై రోజుల పోస్టర్ పడింది .
కంత్రీ లాయరుగా శ్రీధర్ , మరదలుగా అప్పుడప్పుడే పైకొస్తున్న విజయశాంతి , భార్యగా కె విజయ , డబ్బున్న మామగా రమణమూర్తి , అత్తగా పి ఆర్ వరలక్ష్మి నటించారు . ఇతర పాత్రల్లో వల్లం నరసింహారావు , అల్లు రామలింగయ్య , కాంతారావు , రాళ్ళపల్లి ప్రభృతులు నటించారు .
బాపు మార్క్ తోటలో పాటలు ఉన్నాయి . మేలుకోరాదా కృష్ణా మేలుకోరాదా , ఇంట్లో ఈగల మోత , కొండ గోగు చెట్టు , సిన్నారి నవ్వు , హాయి హాయి హాయి ఆపదలు గాయి , ఓ కంట కన్నీరు మురిసేను సూడు పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . జైల్లో స్వాగతం గురూ అనే పాట మాయదారి మల్లిగాడు సినిమాలోని నవ్వుతూ బతకాలిరా పాటను గుర్తుకు తెస్తుంది .
పాటల్ని సి నారాయణరెడ్డి , ఇంద్రగంటి శర్మలు వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , శైలజలు బాగా పాడారు . బాబా ఆజ్మీ తన ఫోటోగ్రఫీలో సినిమాను , ముఖ్యంగా కృష్ణని అందంగా చూపారు . ఆజ్మీ బాపుకి ఇష్టమైన , నమ్మకమైన ఫోటోగ్రఫీ నిపుణుడు కదా ! ఎవరి టీం వారిది సినిమా రంగంలో .
వెరశి మంచి , శుభ్రమైన , అసభ్యత లేని సంస్కారవంతమైన సినిమా . A feel good , sentimental , emotional , family entertainer . కృష్ణ అభిమానులు , అతిలోకసుందరి అందాభిమానులు , బాపు అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే చూడండి . చూడబులే . యూట్యూబులో ఉంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article