Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సోషల్ మీడియా తీసికట్టు కాదు… మెయిన్ మీడియా పత్తిత్తూ కాదు…

March 24, 2025 by M S R

.

మీడియా పాతివ్రత్యం… మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మీడియా పాతివ్రత్యం ఎప్పటికప్పుడు చర్చనీయాంశమే కదా… పాఠకజనం ఎంత చీదరించుకున్నా సరే మీడియా మారడం లేదు సరికదా కొత్త లోతుల్లోకి దిగజారిపోతోంది…

2018లో… అప్పట్లో ఏదో సందర్భాన్ని బట్టి సీనియర్ జర్నలిస్టు Murali Buddha  రాసిన ఓ పోస్టు ఇది… ఇప్పటికీ ఆప్ట్… బహుశా ఎప్పటికీ ఆప్ట్… చదవండి…

Ads



పాతివ్రత్య మీడియా!
‘‘నిన్ను దించేయడమే.. అంటూ అతను పదే పదే అంటున్నాడు.. అంత మొనగాడా?’’
‘‘ఎంతో మంది పీఎంలను, సీఎంలను అతను పైకి తీసుకు వెళ్లాడు, కిందికి తీసుకువచ్చాడు.’’
‘‘నిజమా?’’
‘‘ఇందులో అబద్ధం ఏముంది? పైకి తీసుకువెళ్లడం, కిందికి తీసుకు రావడమే అతని డ్యూటీ. అతను లిఫ్ట్ బాయ్..’’

‘‘సర్లే.. నేను రాగానే ఏదో చదువుతూ పగలబడి నవ్వుతున్నావ్.. ఏంటి సంగతి? ’’
‘‘శాంతిభద్రతలు సరిగా లేవని దావూద్, బ్యాంకులు పనితీరు మెరుగు పరుచుకోవాలని నీరవ్ మోదీ, విజయ మాల్యా అంటే ఏమనిపిస్తుంది? సినిమా రంగం వారసులతో నిండిపోయిందని జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు చెబితే, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ అవును నిజమే అనంటే ఎలా ఉంటుంది? ’’

‘‘ఎందుకలా పడిపడి నవ్వుతున్నావని అడిగితే- ఏదేదో చెబుతావేం? శాంతిభద్రతలు సరిగా లేకపోతే దావూద్ ఐతేనేం, బిన్ లాడెన్ అయితేనేం అదే చెబుతారు కదా?’’
‘‘చెప్పొద్దని అనడం లేదు. నీకేమనిస్తుంది అని అడుగుతున్నాను?’’
‘‘ఎందుకలా పడి పడి నవ్వుతున్నావో చెప్పు ముందు’’
‘‘యాచకునికి యాచకుడే శత్రువు అనే మాట గుర్తుకు వచ్చి…’’

‘‘అక్కడేదో సీరియస్ విషయం మీద వ్యాసం ఉంటే అది చూపిస్తూ పగలబడి నవ్వడమే కాకుండా పొంతన లేని సామెతలు చెబుతున్నావు’’
‘‘టీవీ చానళ్లలో ప్రవచనాలు చెబుతుంటారు విన్నావా? అదృష్ట వశాత్తూ మన తెలుగు వారెవరూ ఆ స్థాయికి వెళ్లలేదు కానీ ఆమధ్య దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను మూటగట్టుకున్న స్వామీజీలు కొందరు చిల్లర వ్యవహారాల కేసుల్లో అరెస్టయ్యారు గుర్తుందా? అలాంటి స్వాముల ప్రవచనాలు వింటుంటే ఏమనిపిస్తుంది?’’

‘‘ముందు అసలు విషయం చెప్పు’’
‘‘అక్కడికే వస్తున్నాను. ఈ మధ్య సామాజిక మాధ్యమాల హవా పెరిగిపోయింది కదా? ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల్లో అబద్ధాల జోరుకు హద్దే లేకుండా పోయిందట!’’
‘‘నిజమే కదా? పిచ్చి పిచ్చి పుకార్లు సామాజిక మాధ్యమాల్లో ఎంతగా వ్యాపింపజేస్తున్నారో నీకేమన్నా తెలుసా?

ఆరు తోకలు, పన్నెండు మూతుల పాము అని ఒకడు. అదేదో దేశంలో పుట్టగానే పిల్లలు మాట్లాడేస్తున్నారని మరొకడు ప్రచారం చేస్తున్నాడు. ఇత్తడి రేకు మీద తెలుగులో ఏదో రాసున్న ఫోటో కనిపించగానే శ్రీవేంకటేశ్వరస్వామి తన వివాహానికి కుబేరుని వద్ద తీసుకున్న అప్పుకు రాసిచ్చిన ప్రామిసరీ నోటు అని సామాజిక మాధ్యమాల్లో తెగ ప్రచారం చేస్తున్నారు.

ఇదిగో ప్రామిసరీ నోటు అని ఒకడు పోస్ట్ చేస్తే, శ్రీవేంకటేశ్వర స్వామి రాసిచ్చిన ఆ నోటుకు సాక్షి సంతకం అన్నగారే పెట్టారు తెలుసా? అని మరో బుడంకాయ తాను దగ్గరుండి చూసినట్టు పుకారుకు మరింత మసాలా జోడిస్తున్నాడు.

ఆ మధ్య శ్రీకృష్ణదేవరాయలు 2019 ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో పంపిన సందేశం కూడా వాట్సప్‌లో వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ప్రచారంపై అంత సీరియస్‌గా వ్యాసం రాస్తే అంతగా ఎందుకు నవ్వుతున్నావ్?’’
‘‘అదే చెప్పాను.. యాచకుడికి యాచకుడే శత్రువు అని ?’’

‘‘అదే అడుగుతున్నా, అది ఎలా? ’’
‘‘రామలింగరాజు గుర్తున్నాడా? గుర్తుండే ఉంటాడులే.. ఐటి ప్రపంచంలో ఎక్కడికో వెళ్లిన ఆయన ఎందుకు గుర్తుండడు. ఎవరూ కనిపెట్టక ముందే తానేం తప్పు చేశాడో రామలింగరాజు పూసగుచ్చినట్టు వివరిస్తూ తన నేరాన్ని అంగీకరించాడు. ఆ వెంటనే తెలుగు మీడియా రంగంలోకి దిగి ఆరు నెలల పాటు కథలల్లింది.

‘చందమామ’ మూత పడిందనే బాధ కలుగనీయకుండా కథలు వండి వార్చారు. చిన్నపిల్లలకు చాక్లెట్ ఆశ చూపి కిడ్నాపర్లు ఎత్తుకెళ్లినట్టు. రామలింగరాజును అమాయకుణ్ణి చేసి తనకు నచ్చని పార్టీ నాయకుడు ఆయన్ని నిలువునా ముంచాడని కథలు అల్లారు. ఆరునెలల పాటు వచ్చిన ఆ కథలు సేకరించి పుస్తకం వేస్తే ఇప్పటి వరకు వచ్చిన తెలుగు కథా సంకలనాలను తలదన్నేది అవుతుంది’’

‘‘ఔను ఐతే.. ?’’
‘‘ఆరు నెలల తరువాత పోలీసులు రాజు మీద చార్జీ షీట్ దాఖలు చేశారు. తానేం తప్పు చేశానని రామలింగరాజు ప్రకటించారో చార్జీ షీట్‌లో అవే ఆర్థిక నేరాలు ఉన్నాయి. అప్పుడు తెలుగు మీడియా ఇదే మాట రాసింది. ఆరు నెలల నుంచి వండి వార్చిన కథల సంగతి ఏమిటని ఎవరూ అడగలేదు. వండి వార్చామని మీడియా చెప్పలేదు. ’’

‘‘ఔను! ఐతే ఏంటి?’’
‘‘సామాజిక మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తుందని ‘పవిత్ర మీడియా’ ఆవేదన వ్యక్తం చేస్తూ వ్యాసాలు రాస్తుంటే యాచకునికి యాచకుడే శత్రువు అనే మాట గుర్తుకు వచ్చింది. అబద్ధాలు రాసే అవకాశం ఒకప్పుడు తమకే పరిమితం అయ్యేది ఇప్పుడు అందరికీ ఆ అవకాశం దక్కిందనే అక్కసు కనిపిస్తోంది.

కోడలికి బుద్ది చెప్పి అత్త తెడ్డు నాకిందని ఓ సామెత. పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవాలి.. తప్పదు.. ఒకప్పుడు మీడియా ఒక పార్టీ సొత్తు. పరిణామ క్రమంలో పార్టీల సొత్తుగా మారింది. మీడియా సామాజిక వర్గాలకే పరిమితం అయిందని బాధపడుతున్న కాలంలో సామాజిక మాధ్యమాలు పుట్టాయి. దీంతో ప్రతి ఒక్కరూ అచ్చం మీడియాలానే తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దే చాన్స్ వచ్చింది.

వేదాలు కొందరికే పరిమితం అనుకున్న కాలంలో అందరికీ అవి అందుబాటులోకి వచ్చినప్పుడు సాంప్రదాయవాదులు ఎంత బాధపడ్డారో అభిప్రాయాలను ప్రచారం చేసే అవకాశం సామాజిక మాధ్యమాల ద్వారా దక్కినప్పుడు అంతే బాధపడుతున్నారనిపిస్తోంది. మోదీ విజయంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర వహించాయని చెబుతారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నాయి ’’

‘‘అంటే- సమాచారానికి వాస్తవం అనే పవిత్రత అవసరం లేదా?’’
‘‘పాతివ్రత్యం ఆడవారికే కాదు మగవారికీ ఉండాలి. పవిత్రం, పాతివ్రత్యం నాకు లేదు- కానీ నీకు ఉండాలి అని డిమాండ్ చేయడం అన్యాయం. అందరికీ పాతివ్రత్యం ఉండాలని కోరితే నేనే నీకు మద్దతుగా చెయ్యెత్తుతాను. నాకు వర్తించదు, కానీ మీరు పాటించాలి అంటే ఇలానే నవ్వొస్తుంది మరి..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ ఢిల్లీకి పోయేది లేదూ… పోయినా పలకరించే గొంతూ లేదు…
  • రీల్ హీరోలు కాదురా… ఇదుగో వీళ్లు రియల్ హీరోలు… మార్గదర్శులు…
  • గుడ్లగూబ కళ్లతో అదరగొట్టేస్తయ్… ఈ జీవులేమిటో తెలుసా..?
  • వరల్డ్ ఫేమస్ గాంజాకు అడ్డా… అలెగ్జాండర్ ది గ్రేట్ సైనికుల వారసులు…
  • పులివెందుల… అప్పటి వైఎస్సూ లేడు, అప్పటి చంద్రబాబూ కాడు…
  • 74 ఏళ్లొచ్చినా… రజినీలో అదే స్టయిల్… అదే ఎనర్జీ… దీనికీ అదే ప్రాణం…
  • ఉద్యమ సంధానకర్తగా రేవంత్ గౌరవించాడు కాబట్టి… బీఆర్ఎస్ ట్రోలింగ్..!!
  • War-2 review ….. జూనియర్ ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది…!!
  • ఇవే వీథికుక్కల గాట్లకు చిన్నారులు మరణిస్తే… ఒక్క గొంతూ ఏడవలేదు…
  • కేసీయార్ చేస్తే సరస శృంగారమట… ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారమట..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions