యముడు ఏడుస్తున్నా, కరోనాలో కనికరం లేదు
——————–
లోకంలో ఎవరు ధర్మం తప్పినా, తప్పకున్నా యమధర్మ రాజు ధర్మం తప్పుడు. యమపాశానికి తన-మన, ఉన్నవాడు-లేనివాడు తేడాలేమీ లేవు. అవతార పురుషులయినా యముడి ముందు తలవంచాల్సిందే. యముడు నిర్దయుడు. అలాంటి నిర్దయుడి గుండె కరిగి నీరవుతోంది. యముడి కంట్లో నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయి. యముడి గుండె బరువెక్కి వెక్కి వెక్కి ఏడుస్తోంది. పగలు రాత్రి విరామం లేకుండా డ్యూటీ చేసి చేసి యముడు తొలిసారి అలసిపోతున్నాడు. కరకు మృత్యువు మూగబోతోంది. ఇక చంపలేనని యముడి పాశం మొరపెట్టుకుంటోంది. చంపి చంపి పాశం అలసిపోతోంది.
——————–
Ads
సెకెండ్ వేవ్ కరోనాతో గుజరాత్ వజ్రాల నగరం సూరత్ లో శ్మశాన వైరాగ్యం రాజ్యమేలుతోంది. ఊళ్లో ఉన్న మూడు ఆధునిక శ్మశానాల్లో ఒక్కో దాంట్లో రోజుకు ఇరవై శవాలను దహనం చేయవచ్చు. కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక రోజుకు ఒక్కో శ్మశానానికి సగటున ఎనభై శవాలొస్తున్నాయ్. శవదహనాలకు ఇక్కడ గ్యాస్ ను వాడుతున్నారు. అత్యంత ఆధునికం. అయితే శవాలను దహనానికి ఉంచే చేంబర్లు మెటల్ ఫ్రేమ్. ఆగకుండా గ్యాస్ మంట రోజంతా మండుతూ ఉండడంతో శవాలతోపాటు మెటల్ ఫ్రేమ్ లు కూడా కరిగిపోయి చచ్చే చావొస్తోంది. మళ్లీ కొత్త మెటల్ ఫ్రేమ్ లు బిగించాల్సి వస్తోంది. దాంతో రెండు, మూడు శవాలు బూడిద కాగానే కరెంటు సరఫరా ఆపి, రెండు నిముషాలు మౌనం పాటిస్తున్నారు. కొన్ని చోట్ల కరెంటు వైర్లు లోడ్ తట్టుకోలేక కాలిపోతున్నాయి. చావుకు మించిన ముగింపు లేదు. చావును మించిన కష్టం లేదు. కానీ చావు తరువాత కూడా ముగింపు క్రియ ముగింపు కావడం లేదు. అంతటి ముగింపు కూడా మౌనంగా గౌరవప్రదమయిన ముగింపు బూడిద కోసం నిరీక్షిస్తోంది. ఆటోమేటిక్ శవదహన యంత్రాల మెకానిక్కులు శ్మశానవాటికల్లోనే నిత్యం అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించి, అందుకు ఏర్పాట్లు చేసింది.
——————-
చెబితే బాగోదు కానీ- మిగతా ఊళ్లల్లో కూడా శ్మశానాలది ఇదే పరిస్థితి. యముడికి ఓపిక నశించినప్పుడు ప్రకృతి మాత్రం ఏమి చేయగలదు? శవాలను బూడిద చేసే గ్యాస్ కు కూడా ఊపిరి తీసుకోవడానికి సమయం కావాలి కదా? శవాన్ని చేతుల్లో పెట్టి మంటకు అందించే లోహానికి కూడా ఒక దహనానికి మరో దహనానికి మధ్య వంగిపోకుండా నిటారుగా నిలబడడానికి సమయం కావాలి కదా? గుట్టలు గుట్టలుగా వచ్చిపడే శవాల చిట్టాలు యమదూతలు చెబితే చిత్రగుప్తుడు లెక్కతప్పకుండా రాసుకోవడానికి కొంత వ్యవధి కావాలి కదా? సాయంత్రానికి చావు పద్దుల మొత్తం లెక్క చిత్రగుప్తుడు యమధర్మరాజుకు చెప్పడానికి కొంత సమయం పడుతుంది కదా?
కరోనా చావులకు ప్రకృతి విలపిస్తోంది. ప్రకృతి ఎదురు తిరుగుతోంది. కటిక రాళ్ల గుండెలు పగులుతున్నాయి. లోహాలు కరిగి కన్నీరవుతున్నాయి. యముడు మెత్తబడుతున్నాడు. చావు బాధపడుతోంది. అయినా- కరోనా గుండె కరగడం లేదు. ఇంతమందిని చంపి కరోనా ఏమి బావుకుంటుందో? ఇంతమందిని చంపిన పాడు కరోనా ఎప్పుడు చస్తుందో?
-పమిడికాల్వ మధుసూదన్
Share this Article