.
[ … Veerendranath Yandamoori … ] కొండ మీద నక్షత్రాలు (Abridged version)
“కళ్ళు సరీగ్గా కనబడని వాడిని వంటింట్లోకి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఆవకాయ జాడీ బ్రద్దలు కొట్టాడు చూడు” ప్రొద్దున్నే మా పనిమనిషిని మా ఆవిడ తిడుతోంది. ప్రతిరోజూ నా మీద పడాల్సిన వర్షపు జల్లు ఈరోజు నా పనిమనిషి మీద పడింది. అలా అని నా కోటా కాన్సిల్ అవుతుందని రూల్ ఏమీ లేదు.
“వాడి బతుకు బండలు చేసాడమ్మా ఆ దేవుడు” అంటోంది మా పనిమనిషి.
“నేను చెపుతోంది దేవుడి గురించి కాదు. వాడిని ఇక్కడకు తీసుకురావద్దని…” రుసరుసలాడుతూ వంటింట్లోంచి బయటకు వచ్చింది నా భార్య. వెనుకే పనిమనిషి.
ఆవిడ నవ్వటం నేను ఒక్కసారి కూడా చూడలేదు. పనిమనిషి కాదు. మా ఆవిడ.
Ads
పెళ్ళయిన ఈ నలభై ఏళ్లలో నా భార్య నవ్వగా నేను ఒక్కసారి కూడా చూడలేదు.
మా మామగారు త్రికాలజ్ఞాని. దేశం గర్వించదగ్గ జ్యోతిష్కుడు. కానీ కూతురి భవిష్యత్తు సరీగ్గా అంచనా వెయ్యలేదేమో, ‘మందస్మిత’ అని పెట్టాడు. ఆయన భవిష్యత్- దర్శనం ఇంత దారుణంగా ఎలా ఫెయిల్ అయిందని ఆయన్నే అడిగాను. నన్నో పిచ్చివాడిని చూసినట్టు చూసి “పెళ్ళవక ముందు తెగ నవ్వేది” అన్నాడు క్లుప్తంగా. ఇంకేం మాట్లాడను? ముక్కూ నోరూ మూసుకుని వచ్చేశాను.
చిత్రమేమిటంటే హిరణ్యకశిపుడి కడుపున మహా భక్తుడయిన ప్రహ్లాదుడు పుట్టాడు. ఇక్కడ రివర్సు. పరమ నిష్టా గరిష్ఠుడైన మా మామగారికి ఈవిడ పుట్టింది.
ఒకే ఒక అదృష్టం ఏమిటంటే నా కొడుకు నా వారసుడు. గతజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో వాడు పుట్టాడు. భగవంతుడి దయ వల్ల ఇన్ఫోసిస్ లో చాలా పెద్ద పోస్టులో ఉన్నాడు.
నాకు వ్యాపార౦లో నష్టం వచ్చినప్పుడు “ఇన్ని గుళ్ళూ గోపురాలూ తిరుగుతావు కదా. నిన్నే దేవుడూ రక్షించలేదేం?” అడిగింది నా భార్య.
“ఇన్ని దేవుళ్ళ దయ ఉంది కాబట్టే స్వంత ఇల్లు అమ్మకుండా, ఇంతటితో పోయింది” అన్నాను.
“మరి ఫ్యాక్టరీ ఎందుకు పోయింది?” అంది నా కూతురు.
దీన్ని ‘మద్దెల శాపం’ అంటారు. గత జన్మలో నేను మద్దెల వాయించేవాడినయి ఉంటాను. దాని శాపమే ఇది. రెండు వైపులా ఎడా పెడా కొట్టించుకోవటం. కానీ నాలో విశిష్ట గుణం ఏమిటంటే ఎప్పుడూ సంయమనం కోల్పోను. “గ్రహాలు బావున్నాయని మీ నాన్నగారే చెప్పారు కదా” అన్నాను ఆయన్ని కూడా నా వైపు కలుపుకుంటూ.
“గ్రహాలూ బావుంటే వాస్తు ఎందుకు?” అన్నది నా కూతురు.
“ఖర్మ అలా వ్రాసి పెట్టి ఉంది. కర్మని ఎవరూ తప్పించలేరు. ఏది వ్రాసి ఉంటే అది జరుగుతుంది” తత్వ రహస్యం చెప్పాను.
“మరి అటువంటప్పుడు యజ్ఞం ఎందుకు?” అన్నది మా ఆవిడ.
“అది కూడా కర్మలో వ్రాసి ఉంది” అన్నాను. అప్పుడావిడ నా వైపు చూసిన చూపు నేనిప్పటికీ మర్చిపోలేను. సర్లెండి. ‘తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు’ అన్నారు పెద్దలు. ఇప్పుడా గొడవంతా ఎందుకు గానీ నా సమస్య చెబుతాను.
ప్రవాసాంధ్రులు మన భారత దేశభక్తులకి… క్షమించండి. భారత దేశభక్తులు కాదు. మన భారతదేశంలో ఉండే దైవభక్తులు. వారికి ఒక విన్నపం చేశారు. “వచ్చే నెల రాబోయే శ్రావణ పౌర్ణమి రాత్రి రాయలసీమలోని ఆకురాతి కొండ ఎక్కి, దేవుడికి మరింత ‘దగ్గరగా’ వెళ్లి అక్కడ లక్షదీపాలు వెలిగించి మనం మన భక్తిని ప్రదర్శించాలనీ, తమ ప్రెసిడెంటు వచ్చి అది చూస్తాడనీ…” ఒక ప్రకటన ఇచ్చారు.
ఇంకేముంది. మా అందరి హృదయవనాల్లో వేలవేల దీపాలు ఒక్కసారిగా వెలిగాయి. ఇలాంటి అవకాశo ఎప్పుడో పుష్కరానికి ఒకసారి వస్తుంది. మా గ్రూపు పదిమందీ ఇప్పుడా కొండ దగ్గరకు వెళ్ళాలి. వెళ్ళటానికీ, అక్కడ ఉండటానికీ మనిషికి పాతికవేల దాకా ఖర్చవుతుంది.
అక్కడే మా ఆవిడ అడ్డు పడింది. “పెళ్ళయిన నలభై సంవత్సరాల్లో తీర్థయాత్రలకని లక్షలు ఖర్చు పెట్టావు. అప్పుడంటే కాస్త డబ్బు ఉండేది. ఇప్పుడు పైసా లేదు. ఈ పరిస్థితిలో నువ్వు అంత దూరం వెళ్ళి దీపం వెలిగించకపోతే నష్టం ఏమైనా ఉందా” అని విరుచుకుపడింది.
నేను మాట్లాడలేదు. ఆ చర్చ ఎక్కడి వరకూ వెళ్తుందో తెలుసు. అందుకే నేను ఇంట్లో ఎక్కువ మాట్లాడను. ఇలా ‘మాట్లాడకుండా’ ఉండటం కోసం గతంలో ఒకసారి ‘ఏకాగ్రతా_ నిశ్శబ్దం.కామ్’ వారికి యాభై వేలు కట్టి బెంగళూరు వెళ్లాను. అక్కడ ఒంటరిగా, రోజంతా ఎవరితో మాట్లాడకుండా ఉండాలి. ఉప్పూ కారం లేకుండా నెలరోజుల పాటూ అలా మౌనంగా ఉంటే ఏకాగ్రత పెరిగి సాంత్వన లభిస్తుంది.
వ్యాపారంలో వచ్చిన నష్టం తాలూకు బాధ పోవటం కోసం వెళ్ళాను. మా ఆవిడ అర్థం చేసుకోలేదు. “ఎవరితో మాట్లాడకుండా ఉండటానికి యాభై వేలా? నీకేమైనా బుద్ధి ఉందా? ఇంట్లోనే ఎవరితోనూ మాట్లాడకుండా ఉండొచ్చుగా” అన్నది. వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా ఆకాశవాణి ప్రోగ్రాం ప్రొద్దున్నే ప్రారంభం అవుతుంది.
“తిండీ, నివాసం… అన్నీ కలిపి” అన్నాను సర్ది చెపుతున్నట్టూ.
“ఏదీ… ఆ ఆకులూ అలములకా?” అంది.
“శ్వాస మీద ధ్యాస” అన్నాను.
“శ్వాస మీద ధ్యాసకి బెంగుళూరు దేనికి? బాత్రూములో ఏం చేస్తావ్? అక్కడ పెట్టు ధ్యాస” అంది. ఈమె ఐక్యరాజసమితిలో వాదించి ఉంటే, కాశ్మీరు ఎప్పుడో మనదై ఉండేది.
మా ఆవిడకి ఇంగ్లీషు రాదు. అందుకే ఇంగ్లీషుతో కొట్టాలనుకున్నాను. “మౌనం గోప్ప ధ్యానం. ఇంగ్లీషులో ‘మెడిటేషన్’ అంటారు. నీకు అర్థం కాదులే. అలా చెయ్యటం వలన ఏకాగ్రత పెరుగుతుంది.”
ఆవిడా ఏం తగ్గలేదు. “నిజమే. కానీ నాకు అర్థం కాక అడుగుతానూ. ఏ పని చేస్తే ఆ పనిలో శ్రద్ధ పెట్టటమే కదా ధ్యానం అంటే. దానికి మాట్లాడటం మానెయ్యటం ఎందుకు? ఆకులు తినటం ఎందుకు? ఈ మాత్రం ‘ధ్యాస’ ఆ తిరుపతి ఫ్యాక్టరీ వ్యవహారాల్లో పెట్టి ఉంటే అదే మెడిటేషన్ అయ్యుండేది కదా”…
లాభం లేదు. ఈ నిరంతర పోరాటంలో నేను ఎన్నటికీ గెలవలేను. ఈ మాటల ప్రవాహం ఆగదు. మొత్తానికి ఎలాగో అప్పుచేసి అప్పట్లో బెంగళూరు వెళ్ళాననుకోండి. అది వేరే సంగతి.
కానీ ఇప్పుడు ఈ దీపాల సంగతి ఎలా? ఎలా మా ఆవిడని కన్విన్స్ చెయ్యటం? చేతిలో డబ్బు ఉన్నప్పుడే నా మాట చెల్లలేదు. ఇప్పుడేo చెల్లుతుంది? ఇంకో నెల మాత్రమే టైమ్ ఉన్నది. మా బృందానికి నేను లీడర్ లాంటివాడిని. నేను మానేస్తానంటే అందరూ గోల చేస్తారు. దీనికి ఏది మార్గం? ఆ రాత్రి భగవంతుడిని మనస్పూర్తిగా ప్రార్థించాను.
భక్తుడి కష్టాలు తీర్చెడివాడు భగవంతుడే కదా. తనకి దగ్గరగా వచ్చి కొండమీద నక్షత్రం పెట్టటానికి నా కొడుకు రూపంలో ఆదుకున్నాడు.
మరో పది రోజుల్లో శ్రావణ పౌర్ణమి అనగా నా కొడుకు యాభై వేలు పంపాడు. ప్రయాణానికి మార్గం సుగమమైంది. చెప్పానుగా. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్.
మరో వారంలో ప్రయాణం. నా మనసు మేఘాల్లో తేలుతూ ఉంది.
++ ++ ++
ఇలా మేఘాల్లో తేలుతూ వెళ్తూ ఉండగా మోటార్ సైకిల్ గుంటలో పడింది. చిన్న శబ్దమూ, ఆపై నాలుగు రోజుల తర్వాత మెలకువా వచ్చింది. పెద్ద దెబ్బ తగల్లేదు కానీ, రక్తం ఎక్కించవలసి వచ్చింది.
ఆపై రెండు రోజులకి కాస్త కోలుకున్నాను. బెడ్ పక్కన కూర్చొని బత్తాయి పండు వలుస్తూ, “అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం జరగలేదు” అంది మా ఆవిడ.
“చూసావా! ఇష్ట దైవం మహిమ” అన్నాను.
“మరి అంత ప్రేముంటే, అసలు ఆక్సిడెంటు అవకుండానే చూడొచ్చుగా” అన్నది.
“ఎడ్డెం అంటే తెలుసా?” అన్నాను.
“తెడ్డానికి అపోజిట్” అంది.
ఎడ్డే అంటే వంకర, మూర్ఖుడు అని రెండు అర్థాలు. ‘వంకర’ అంటే ‘టింకర’ అనేవాడు మూర్ఖుడు.
అదంతా చెప్పి నా తెలుగు పరిజ్ఞానాన్నిఆవిడ ముందు ప్రదర్శించబోతూoడగా మా కూతురూ, అల్లుడు, కొడుకూ, కోడలూ వచ్చారు. ‘రికవర్ సూన్ అంకుల్..’ అంటూ నా అల్లుడు ఫ్లవర్ బొకే అందించాడు. కూతురు ఆపిల్స్ ఇచ్చింది. నా కొడుకు ఒక ఫోటో ఇస్తూ, “దగ్గర పెట్టుకో నాన్నా. తొందరగా నయమవుతుంది” అన్నాడు.
మధ్యలో మా ఆవిడ ఫోటో అందుకుని చూస్తూ, “ కృష్ణుడు చాలా ముద్దుగా ఉన్నాడు కదా” అన్నది .
“కృష్ణుడు నీకు నచ్చటం నాకు నచ్చింది” అనుకున్నాను.
నిద్రబోయే ముందు ప్రతిరోజూ చదివి తల పక్కన పెట్టుకునే భగవద్గీత పుస్తకo మధ్యలో ఆ ఫోటో పెట్టుకుని, మా అబ్బాయితో “ఆకురాతి ప్రోగ్రాం కాన్సిల్ అయింది కదరా. నీ యాభై వేలూ…” అని అనబోతూ ఉంటే నా భార్య చప్పున తలెత్తి, “యాభై వేలేమిటి?” అన్నది.
ఆపిల్ పండు విషయమై మొగాడి మీద కోపమొచ్చిన దేవుడు భార్యలకి పాము చెవులిచ్చి మొగుళ్ళ మీద కక్ష తీర్చుకున్నాడు.
నేను ఏదో చెప్పబోయేటంతలో నన్ను రక్షించటానికా అన్నట్టు ఒకాయన మంచం దగ్గరకు వచ్చాడు. లాల్చీ పైజమాలో ఉన్నాడు. కళ్ళు నిర్మలంగా ఉన్నాయి. మొహం ప్రశాంతoగా ఉంది. చేతికి ఒక బెంగాలీ సంచి వేలాడుతోంది.
నా భార్య స్టూల్ మీద నుంచి లేస్తూ, “ఈయన పేరు మురారి. ఈయనే నీకు రక్తం ఇచ్చింది. ఆ సమయంలో ఈయన రాకపోయి ఉంటే..” అని ఆపింది. కళ్ళకి మంగళసూత్రం అద్దుకుoటుoదేమో అనుకున్నాను గానీ అటువంటిదేమీ చెయ్యలేదు.
నిజమే. నా గ్రూపు రక్తం సాధారణంగా దొరకదు. చేతులు జోడించి, “అంతా భగవత్ లీల. మీలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టే ధర్మం నాలుగు పాదాలతో నడుస్తోంది. మురారి అంటే కృష్ణుడు. మిమ్మల్ని దేవుడు కాపాడతాడు” అన్నాను.
ఆయన నవ్వి “అవును. నన్ను భగవంతుడు కాపాడతాడు. నేను భగవంతుడిని కాపాడతాను” అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. దేవుడు ఉన్నాడనే ఆస్తికులూ, లేడనే నాస్తికులూ ఉంటారని తెలుసు గానీ ‘దేవుడితో నాకు సంబంధం లేద’నే వారెవరో నాకు అర్థం కాలేదు. నా అనుమానం అర్థం చేసుకున్నట్టు “స్నేహం, ధ్యానం మొదలైనవి భగవంతుడితో 7 రకాల సంబంధాలు” అన్నాడు.
పిల్లి అంటే మార్జాలమన్నట్టు ఉంది అందామనుకుని, ఎంతైనా రక్తం ఇచ్చిన వాడు కదా, మర్యాద కాదని మానేశాను. మరికొంచెం సేపు మాట్లాడి ఆయన వెళ్ళిపోయాడు. అప్పటి వరకూ ముళ్ళ మీద కూర్చున్నట్టూ ఉన్న మేము ఒక్కసారిగా రిలాక్స్ అయ్యాం.
వెళ్తున్నవాడి వైపు నా భార్య కొరకొరా చూస్తూ, “ఇన్ని కబుర్లు చెప్తున్నాడా. నీకు రక్తం ఇవ్వటానికి పదివేలు తీసుకున్నాడు” అన్నది.
విస్తుబోవటం నా వంతు అయింది. అప్పుడు మా టాపిక్ రక్తం అమ్మకాలూ, కిడ్నీ మాఫియా మీదకు వెళ్ళింది. ఇంతలో నర్సు వచ్చి “అదేంటి? మురారి బాబు వెళ్ళిపోయారా?” అని అడిగింది.
“ఆయన మీకు తెలుసా?” నా భార్య అన్నది.
“తెలియకపోవటమేమిటి? ఆయనది రేర్-గ్రూప్ రక్తం. డబ్బున్నవాళ్ళకి తన రక్తం అమ్మి, ఆ డబ్బుతో బీదవాళ్ళకి రక్తం కొనిస్తాడు. ఎప్పడూ ఇక్కడే ఉంటాడు.” అని చెప్పింది. నా భార్యా నేనూ మొహామొహాలు చూసుకున్నాం.
++ ++ ++
ఆ రాత్రి నేను నిద్రపోలేదు. ‘నాలో ఎక్కడో ఏదో పటేలున పగిలింది’ అన్న పెద్ద మాటలు చెప్పను గానీ, ‘స్నేహం, ఆరాధన’ మొదలైన “7 రకాల” బంధాల గురించి మురారి చెప్పిన వివరణ మళ్ళీ మళ్ళీ (ఈ సారి కొత్తగా) మననం చేసుకున్నాను.
“భగవంతుడితో స్నేహం చెయ్యి. స్నేహంకన్నా గొప్పది మరేమి ఉన్నది? గోపబాలురు ఎవరు? తపశ్శక్తితో పునీతులైన ఋషులు. ఆ పుణ్య ఫలితంగానే కృష్ణుడితో జలకాలాడారు. వీపు మీద ఎక్కి చెరువుల్లో దూకారు. అంతెందుకు? కురుక్షేత్ర యుద్ధ సమయంలో కృష్ణుడు అర్జునుడి రథసారధి. అశ్వాల రొదలో, ఏనుగుల ఘీంకారాల్లో అవతలివారి మాటలు వినిపించవు. భుజాన్ని వామపాదంతో కొడితే అటూ, కుడి కాలితో కొడితే ఇటూ తిప్పాలి. కృష్ణుడు నిజరూపం తెలిసే సరికి ‘ఓ దేవదేవా! నువ్వు భగవంతుడివా? నిన్నా నేను కాలితో కొట్టింది?’ అని అర్జునుడు వాపోతాడు. కృష్ణుడు ఆప్యాయంగా నవ్వి, “కొట్టేటంత చనువు నీకు కాక ఇంకెవరికుంటుంది? స్నేహితుడివైన నీవు కాకపోతే నేను ఎటు వెళ్ళాలో ఎవరు చెపుతారు? ” అంటాడు.
భగవంతుడితో స్నేహం అంటే అది..!
నీవు నిజమైన స్నేహితుడివైతే ‘ఎవడబ్బ సొమ్మ’ని తిడితే, రాముడు బెదురుతూ వచ్చి నీ ఆభరణాలు నీకు అందజేస్తాడు. నీవు నిజమైన భక్తుడివైతే ‘లావొక్కింత లేదు’ అనగానే పెళ్ళాంతో సరసాలాపి విష్ణువు పరుగెత్తుకు వస్తాడు.
పని చేయటానికి కావలసిన శక్తినిచ్చేది ధ్యానం. అంతే తప్ప ముక్కు మూసుకుని స్పృహ కోల్పోవటమూ, ఆ “భ్రమలో” దేవుణ్ణి చూడటమూ కాదు. చేసే పని మీద భక్తే ధ్యానం. చేస్తున్న పని తప్ప మరేమీ గుర్తు ఉండక పోవటం ఏకాగ్రత. పక్షి కన్ను తప్ప మరేమీ కనపడక పోవటమే ఏకాగ్రత. రాధకి కృష్ణుడి పట్ల ఆరాధన అదే. ఆ‘రాధ’ పేరులోనే అది ఉన్నది కదా.
తాదాత్మ్యతకి గోప్ప ఉదాహరణ ప్రహ్లాదుడు. ‘ఇందుగలడు– అందులేడని సందేహము వలదు’ అంటాడు. నరసింహుడు మనిషిలోనూ ఉన్నాడు. రాతి స్థంభంలోనూ ఉన్నాడు. రాతికి పూజ చెయ్యటం నీ ఆనందం. నువ్వు సాటి మనిషికి సేవ చెయ్యటం దేవుడికి ఆనందం.
భగవంతుడిని నమ్ము. నమ్మకంతో పని చెయ్యి. అతడు ఎక్కడున్నాడు? నీలోనే. నమ్మకానికి వారసుడు ఆంజనేయుడు. సంజీవని తెమ్మంటే హిమాలయాలనే తీసుకొస్తాడు. “హనుమా..! నేను చెప్పగానే ఇది సాధ్యమా కాదా అని ఆలోచించకుండా ఆ పనికి బయలుదేరతావు కదా. నీకేమీ అనుమానాలుండవా?” అని రాముడు అడుగుతాడు.
‘రామా! నువ్వు నాకొక పని చెప్పావంటే, ఆ శక్తి కూడా నువ్వే ఇస్తావనే నమ్మకం నాకుంది’ అంటాడు ఆంజనేయుడు. నీలో ఉన్న భగవంతుడి పై నమ్మకం లేకుండా ఎన్ని యజ్ఞాలు చేస్తే ఏమి లాభం? హుండీలో ఎన్ని డబ్బులు వేస్తే ఏం లాభం? హుండీ కేవలం నీ ఆనందం మాత్రమే.
భగవంతుడిని ప్రార్థించటం అంటే, నీతో పాటూ అతడు సృష్టించిన సకల చరాచారాలనీ ప్రేమించటం. అవన్నీ నీ తోబుట్టువులు. అందరూ నీ సహోదరులు. వారి పట్ల వాత్సల్యం చూపించు. ప్రకృతిని ప్రేమించు. తాదాత్మ్యత చెందు. నీ ప్రేమ విశ్వజనీయమైనది అయితే, ఆ ప్రేమ కోసం కోసం భగవంతుడు నీ ముందు చేయి సాచి నిలబడతాడు. యశోదకి అంత వాత్సల్యం ఉండబట్టే నోరు చూపించమంటే వినయంగా చేతులు కట్టుకుని చూపించాడు. ‘ఓయమ్మ నీ కుమారుడు’ అని పొరుగింటివారు ఫిర్యాదు చేసినప్పుడు రోటికి కట్టేసినా ఆ దివ్య మంగళుడు కిమ్మనలేదు.
“భగవంతుడు నీకు డబ్బు కాస్త ఎక్కువ ఇచ్చాడంటే వాటిని నీ సహచరులకు పంచమని.
నాకు ఖరీదైన రక్తం ఇచ్చాడoటే దాన్ని ఇతరులకి పంచమని.
నీకు జ్ఞానం ఇచ్చాడంటే కాస్త ఆలోచించమని. ఇన్ని విధాలుగా భగవంతుడికి స్నేహితుడిగా, ఆరాధకుడిగా, సఖుడిగా, వాత్సల్యంతో ఉండగా నాకు భగవంతుడు ఇంకా కొత్తగా ఏమి ఇస్తాడనీ, చేస్తాడనీ మీ ఉద్దేశ్యం?” అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రంతా అదే ఆలోచించాను.
++ ++ ++
దేవుడికి దగ్గరగా వెళ్లి, కొ౦డ మీద దీపాలు పెట్టే కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. కోటికి పైగా ఖర్చయిందట. చాలా పేపర్లూ, చానెళ్ళూ దానికి బహుళ ప్రాచుర్యం ఇచ్చాయి. నేను వెళ్ళలేదు. భగవంతుడికి ఎలా దగ్గరవ్వాలో, మురారి బాబు చెప్పిన ఆ 7 మార్గాలూ మా గ్రూపుకి కూడా చెప్పాను. వాళ్ళూ హేతువుతో ఆలోచించే వారే. తరువాత ఆ మాట మీద ఉంటారో లేదో గానీ, ప్రస్తుతానికి నేను చెప్పింది అర్థం చేసుకున్నారు.
నెల రోజులు పోయాక ఒక రోజు ప్రొద్దున్నే పనిమనిషి “మీరందరూ కలిసి నా కొడుకు కళ్ళు బాగుచేశారయ్యా. ఏమి చేస్తే మీ రుణం తీరుతుంది” అంటూ కొడుకుతో దణ్ణం పెట్టించింది. కుర్రాడు కృతజ్ఞతతో నావైపు చూస్తున్నాడు.
కొండ మీద లక్షల దీపాలు వెలుగుతున్నాయి.
నా ముందున్న రెండు నక్షత్రాలూ మరింత ప్రకాశవంతంగా ఉన్నాయి.
వెనుకే వచ్చిన నా భార్య మందస్మిత నన్ను చూసి తొలిసారి నవ్వింది.
(“స్వాతి” మరియు “క్షీర సాగరం లో కొత్త కెరటాలు”, “20 మంచితనం కథలు” – పునర్ముద్రణ. No arguments and controversies please)
Share this Article