మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అసలే లోతు మనిషి… ఎక్కువగా మాట్లాడడు… సమాధానాలు చెప్పడు… మాట్లాడింది కూడా ఏదో మార్మికత ధ్వనిస్తూ ఉంటుంది… భావం సూటిగా ఉండదు… పైగా దేశ సాహిత్యం మీద నిశిత అవగాహన, పరిశీలన, ప్రవేశం, పరిణతి ఉన్నవాడు… అలాంటి పీవీ ఓసారి ప్రధాని హోదాలోనే మాడుగుల నాగఫణిశర్మ నిర్వహిస్తున్న అవధానానికి వచ్చాడు… ‘మీరొక ప్రశ్న వేయాలి అవధానికి’ అని పలువురు పీవీకి సూచించారు… ఒకేసారి రకరకాల ప్రశ్నలు తీసుకోవడం, ఒక్కో దానికి సరైన బదులు చెప్పడం కూడా అవధాన ప్రక్రియలో ఒక అంశం… అందరిలోనూ ఆసక్తి… పీవీ ఏం ప్రశ్న వేస్తాడు… ప్రధానిగా ఉన్న వ్యక్తి, అందులోనూ మౌన మార్మిక పీవీ అల్లాటప్పా ప్రశ్న వేయలేడు… దానికి అవధాని ఏం బదులు చెబుతాడు అని ఎదురు చూస్తున్నారు అందరూ… ఆయన అసలే ఎవరికీ అర్థం కాడు… అలాంటిది హఠాత్తుగా ఏదో ఓ ప్రశ్న వేసి వెళ్లిపోయే రకమా… కాదు కదా… తన మనస్థితిని వివరిస్తూనే ఓ వింత ప్రశ్న సంధించాడు…
‘‘ఒక ప్రశ్నను వేయడం అంటే ఎంత కష్టం… నాకన్నీ ప్రశ్నలే కనిపిస్తున్నాయి ఈమధ్య… నిద్రావస్థలో కూడా ప్రశ్నలే… కేవలం ఒక్క ప్రశ్నను ఎంచుకోవడం అంటే గడ్డివాములో సూది వెతికినంత కష్టం… పైగా ఒక్కటే ఎంచుకుంటే మిగతా ప్రశ్నలకు అన్యాయం చేసినట్టవుతుంది… కాబట్టి కవికి తన భావనను అనుసరించి, ఈ క్షణంలో ఆయన మనస్థితిని బట్టి అన్నింటికన్నా ఏది పెద్ద ప్రశ్నగా స్ఫురిస్తుందో దానికి సమాధానం చెబితే వినాలని ఉంది…’’ అన్నాడు పీవీ… నిజంగానే అప్పట్లో పీవీ ప్రధానిత్వం చుట్టూ అనేక ప్రశ్నలు, సమస్యలు, సవాళ్లే కదా… ఒక ప్రశ్న వేసినట్టూ కాదు, అలాగని వదిలేసినట్టూ కాదు… ఇది అవధానికి విషమ పరీక్ష… అసలు ఏ ప్రశ్నా లేనప్పుడు దేనికి సమాధానం చెప్పాలి…? రాగయుక్తంగా పీవీని కీర్తిస్తూ… మధ్యమధ్య సమాధానం గురించి ఆలోచిస్తూ… ఏం చెప్పాలా అని మథనపడిపోతూ… నాగఫణిశర్మ ఒకరకంగా యాతనకు గురైనట్టే..! ఆయన మాత్రం ఈ ప్రయాస చూస్తూ తన సహజశైలిలో నిర్వికారంగా, నిర్వేదంగా, ఉద్వేగరహితంగా ఉండిపోయాడు… చివరకు అవధాని దాదాపు చేతులెత్తేసినట్టుగా… ఒక జ్ఞాని నాకు మౌనప్రశ్న సంధించాడు… ఇప్పటిదాకా ఏది ప్రశ్న అంటూ అన్వేషిస్తూనే ఉన్నాను, దొరకడం లేదు… ‘నా ప్రస్తుతి గానమునే ప్రస్తుతం బదులిస్తున్నాను గైకొనవయ్యా’ అని అర్థంతరంగా, అర్థరహితంగా ముగించేశాడు… దటీజ్ పీవీ… (నిజానికి అనేక చిక్కుముళ్లు, సవాళ్ల సింహాసనమే పీవీకి అప్పుడు పెద్ద ప్రశ్న… దానికి సమాధానం ఇదీ అని నాగఫణి సమాధానం ప్రయత్నిస్తే రక్తికట్టేది… కాస్త ఆ కోణంలో వెళ్లే ప్రయత్నం చేశాడు కానీ మధ్యలోనే విఫలమయ్యాడు… అది ప్రశ్న కాని ప్రశ్న అనుకునే పక్షంలో సమాధానం కాని సమాధానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసి ఉండాల్సింది…)
Ads
ఆ వీడియో చూస్తుంటే, పీవీ ప్రసంగంలో రెండుమూడు అంశాలు ఆసక్తిగా అనిపిస్తాయి… (ఫేస్బుక్ videos లో search చేస్తే దొరుకుతుంది)… అవధానానికీ, పార్లమెంటులో తాము సమాధానాలు చెప్పడానికీ పోలిక చెబుతూ… ‘‘అవధానంలో ఒకరు గంట కొడుతుంటాడు… ఇంకొకరు పూలు వేస్తుంటాడు… మరొకరు అడ్డదిడ్డం ప్రశ్నలేస్తుంటాడు… అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూనే, అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పాలి అవధాని… అవధానం అంటే ప్రశ్నించేవాడు కావాలి, అవధాని సరిగ్గా చెబుతున్నాడా లేదా చూసేవాడు కావాలి… ఒక్కొక్కసారి చమత్కారిక సమాధానం చెప్పడమే కాదు, ఏం తెలివి తక్కువ ప్రశ్న వేశావయ్యా అని చురక పెట్టినట్టుగా కూడా ఉండాలి సమాధానం…’’ అని భలే ముడిపెట్టాడు పీవీ… మరొక విశేషాంశం ఏమిటంటే..? ‘‘నేను పలు భాషల్లోని అనేక సాహిత్య ధోరణులను గమనించాను… ఉత్తర భారతంలో కవిత్వంలో ప్రధానంగా భావప్రాధాన్యం ఉంటుంది… అనేకసార్లు ప్రాసలు లేకపోయినా, వ్యాకరణం సరిగ్గా లేకపోయినా, పొరపాట్లున్నా శ్రోతలు రసగ్రహణ చేస్తారు… శాబ్దిక రమ్యత, పాండిత్యం పట్టించుకోరు… కానీ మన దక్షిణ భాషల్లో భావంతోపాటు పాండిత్యం, శబ్దాధిపత్యం ఎక్కువ… మనకు యుద్ధాలు లేవు కదా, ప్రభువుల ఆదరణ, ఎక్కువ తీరిక ఉండేది… అందుకని ఆ విశేష కృషి జరిగేది… ప్రత్యేకించి తెలుగులో ఎక్కువ… మన దగ్గర రాఘవ పాండవీయం, యాదవ రాఘవ పాండవీయం…. ఒక కంటెంటును భారతం, భాగవతం, రామాయణానికి వర్తించేలా రాసిన ప్రజ్ఞను చూశాం… అసలు అవధానం ఇంకెక్కడా లేదు, ఉత్తర భారతంలో ఇది చెబితే అదెలా సాధ్యం అంటారు, నమ్మరు… అందుకని దీన్ని కాపాడుకోవాలి… కొత్త రీతులను రంగరించి బతికించాలి…’’ ఇదీ పీవీ అభిలాష… ఆ దిశగా ఏమైనా జరిగిందా..?!
Share this Article