.
ఒక మహానేత… ఒక మహానటి… ఒక మహావ్యక్తి… వాళ్లకు సంబంధించిన రంగాలకు సంబంధించి వాళ్లు సాధించిన ఘనతలు, వాళ్ల గొప్పతనాలను ప్రశంసిద్దాం… కానీ వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో తప్పులు కనిపిస్తే, తప్పులుగా అనిపిస్తే తప్పుపట్టకూడదా..? మన అభిప్రాయాన్ని వినిపించడం, వెల్లడించడం తప్పవుతుందా..?
ఫలానా రంగాల్లో వాళ్లు విశేష ప్రతిభ ప్రదర్శించారు కాబట్టి ఇక ఏదైనా సరే చల్తా, చల్నేదో బాల్‌కిషన్ అనుకోవల్సిందేనా..? కొందరు తప్పేముంది తప్పుల్ని ఎంచితే అంటారు… మరికొందరు తప్పే అంటారు… ఈ మీమాంస ఎందుకొచ్చిందంటే..?
Ads
గీతూ రాయల్… అసలు పేరు గ్రీష్మ గీతిక లేఖ కోవూర్… పలకడం కష్టంగా ఉందా… అందుకే గీతూగా ఫిక్స్ చేసుకుంది… స్వస్థలం చిత్తూరు… మొదట్లో జబర్దస్త్, తరువాత ఆర్‌జే, వీజే. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్… బిగ్‌బాస్ ఫేమ్… కాకపోతే కొన్నిసార్లు తిక్కతిక్కగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది… అది వేరే సంగతి…
ప్రజెంట్ విషయం ఏమిటంటే..? ఆమె నటి సావిత్రి మీద ఏవో కామెంట్స్ చేసింది… దానిపై ఆమె మీద విమర్శలు వచ్చాయి… అంతటి మహానటి మీద కామెంట్స్ పాస్ చేస్తావా అని కొందరు కస్సుమన్నారు… దాని మీద ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ…
‘‘నాకు సావిత్రి గారి జీవితం తెలిసింది మహానటి సినిమా వల్లే. అయితే నేను సావిత్రి గారిని పర్సనల్‌గా ఏమనలేదు. ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకున్నా. ఒక జంట మధ్యలోకి థర్డ్ పర్సన్ వచ్చి భర్తతోనో ఆ భార్యతోనో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమవుతున్నాయి. దానికి ఒక ఉదాహరణగా మాత్రమే సావిత్రి గారిని చెప్పాను. సినిమాల్లో ఆవిడ యాక్టింగ్ గురించి నేను ఏమనలేను.. ఎందుకంటే అందులో ఆవిడ కాలి గోటికి కూడా నేను సరిపోను.
కానీ ఒక మనిషిగా మాత్రం ఆవిడ గురించి చెప్పాను. ఇప్పుడు నేను పెట్టే వీడియోలపై అందరూ నన్ను జడ్జ్ చేయడం లేదా.. నా లైఫ్ గురించి మాట్లాడటం లేదా.. ఎందుకంటే నేను ఒక పబ్లిక్ ఫిగర్.. నా గురించి ఏమన్నా చెల్లిపోతుందిలే అనుకుంటారు.. సావిత్రమ్మ ఆల్రెడీ పెళ్ళయిన జెమినీ గణేషన్ గారిని ప్రేమించింది… ఆ విషయం తెలిశాక మనసు చంపుకోవచ్చు కదా.. అది కష్టమే కానీ, అలా చేసి ఉంటే ఆవిడ జీవితమే బాగుండేది కదా.. అలా ఎవరూ ఉండొద్దు అని చెప్పడానికి అలా అన్నాను…
ఆవిడ మహానటే కావచ్చు.. కానీ ఒక మనిషిగా ఆవిడ చేసింది మాత్రం తప్పే.. ఆ విషయంలో సావిత్రి గారు తప్పు చేశారని వాళ్ల పిల్లలే ఒప్పుకున్నారు. అందుకే ఆ ఉదాహరణ చెప్పా. సావిత్రి గారు ఆ తప్పు చేశారు కాబట్టి కర్మ అనుభవించారని చెప్పా.. అంతే..
అలమేలు (జెమినీ గణేషన్ మొదటి భార్య) గారు ఎంత బాధపడి ఉంటారు. ఇప్పుడు అదే పరిస్థితిలో నా భర్త ఉండి, ఒక అమ్మాయి రాత్రి వర్షంలో తడుచుకొని వచ్చేసి, నన్ను పెళ్లి చేసుకో అని నా భర్తని అడిగితే ఎలా ఉంటుంది.. నేను ఎలా తీసుకోగలుగుతా.. అలమేలు గారు సాఫ్ట్ కాబట్టి సైలెంట్‌గా ఉందేమో, నేను అయితే అలా సైలెంట్‌గా ఉండను..” ఇలా సాగింది ఆమె వివరణ, తన మాటలకు జస్టిఫికేషన్…
పైన చెప్పుకున్నదే… కొందరికి గీతూ రాయల్ మాటలు తప్పు… ఇంకొందరికి తప్పేముందిలే అనిపించవచ్చు… అవునూ, సినిమా తారలు ఆల్రెడీ పెళ్లయిన వాళ్లను ఎందుకు పెళ్లి చేసుకుంటారు..? ఇది కాస్త డిబేటబులే..!!
Share this Article