ముందుగా ఒక డిస్క్లయిమర్…. మనం కరోనా కరోనా అని రోజూ తెగచించేసుకుంటున్నాం గానీ… దాన్ని మించిన ప్రమాదకరం టీవీ సీరియళ్లు… లక్షల మంది మెదళ్లను కాలుష్యంతో నింపి, అందులోనే కుళ్లిపోయేలా చేసే టీవీ సీరియళ్ల వల్ల నష్టం అంతా ఇంతా కాదు… నిజానికి టీవీ సీరియల్ అనేది ఓ జాతీయ విపత్తు… ఎటొచ్చీ మనం గుర్తించం..! దిక్కుమాలిన కథలు, తలకుమాసిన కథనాలు, ప్రేక్షకులంతా ఎడ్డోళ్లు అనుకునే వాటి దర్శకులు- నిర్మాతలు… వాటి కథకులకు ఏది తోస్తే అది… రోజురోజుకూ అష్టవంకర్లు తిరిగే కథ, వచ్చీపోయే పాత్రలు… ఇళ్లల్లో ఆడవాళ్లకు వేరే పనేమీ ఉండదు… ఒకరినొకరు ఎలా చంపుకోవాలో ప్లాన్లు వేస్తుంటారు… మధ్యలో ఎరుకలసాన్లు, జ్యోతిష్కులు, క్షుద్రపూజల మాంత్రికులు, హంతుకులు గట్రా వచ్చిపోతుంటారు… ప్రతి సీరియల్లోనూ మగాళ్ల పాత్రల కేరక్టరైజేషన్ పరమ దరిద్రం… టాప్ రేటెడ్ సీరియళ్లన్నీ అంతే… కోట్లకుకోట్లు కొల్లగొట్టే కార్తీకదీపమే తీసుకొండి…
హీరో ఒక అనుమానప్పీనుగు… హీరోయిన్ తన శీలాన్ని నిరూపించుకోవడానికి సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ సక్కుబాయి, సతీ సుమతిల ప్రతిరూపంగా డైలాగులు కొడుతూ ఉంటుంది… ఆ పిల్లలు బామ్మలు, మామ్మలకన్నా ముదుర్లు… మధ్యలో శూర్పణఖ వంటి ఓ లేడీ విలన్… ముసల్ది అయిపోయినా సరే హీరోను తన ట్రాపులో పడేసుకోవాలనే కేరక్టర్… హీరో ఓ కార్డియాలజిస్టు… కానీ హీరోయిన్ ఎవరో రచయితతో సన్నిహితంగా కనిపించగానే అనుమానించి, తన పిల్లలు అక్రమ సంతానమేనని తీర్మానించేసుకుని, హీరోయిన్ను తన్ని తరిమేస్తాడు… పొటెన్సీ లెస్టు, ఫర్టిలిటీ టెస్టు, డీఎన్ఏ టెస్టులు గట్రా తెలియని డాక్టర్… వాడు హీరో..!! అవన్నీ ఒకెత్తు… విడిచిపెట్టేశాడు కదా… ఎప్పుడంటే అప్పుడు ఆమెను ఈడ్చి కొట్టేస్తాడు… ఏమే, రావే, పోవే భాష మాత్రమే వాడతాడు… ఇంత దరిద్రమైన కేరక్టరైజేషన్ ఈ దశాబ్దకాలంలో చూసి ఉండం… కానీ రేటింగుల్లో టాప్… మాటీవీ వాడి మాయ… 1000 ఎపిసోడ్లు అయిపోయాయి… మరో 1000 వీజీగా తీసేస్తాం అని ఆమధ్య డైరెక్టర్ ఆర్డీఎక్స్ పేల్చాడు… ఓసోస్, ఇదెంత పని, మరో వెయ్యి హత్యలు చేయలేమా అన్నట్టుగా ఉంది… దిమాకుల్లో చటాక్ ఉన్నవాళ్లంతా భయపడుతుండగా… లేదు లేదులే, అయిపోయింది, క్లైమాక్సు వచ్చేసింది… హీరోహీరోయిన్లు కలిసిపోయారు, ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నారు… హీరోయిన్ కరోనాను మించిన ఏదో మిస్టీరియస్ రోగానికి గురై, చివరకు హీరో జాలితో, సానుభూతితో, కరుణతో దగ్గరకు తీసుకుంటాడు… ఇద్దరూ కావిలించేసుకున్నారు అంటూ యూట్యూబర్లు, సైటర్లు తెగ గోలపెట్టేస్తున్నారు…
Ads
ట్రోలర్లు అయితే పండుగ చేసుకుంటున్నారు… ఈరోజు ప్రసారం చేయబోయే ఎపిసోడ్ ప్రోమోను ఆధారంగా చేసుకుని తెగ సెటైర్లు వేస్తున్నారు… పైన చూశారు కదా… ఉదాహరణ… నిజానికి ఎంత ట్రోలింగుకైనా ఈ సీరియల్‌కు అర్హత ఉంది… మీమ్స్, ట్రోల్స్ వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో, పోస్టుల్లో తెగ సందడి చేస్తున్నాయి… ప్రత్యేకించి ఆ హీరోను, ఆ కేరక్టర్‌ను చూసి అందరూ పకపకా నవ్వుతున్నారు… అసలు వేరే సీరియళ్లను ట్రోలర్లు పెద్దగా పట్టించుకోరు… కానీ కార్తీకదీపం రేంజ్ వేరు కదా… అందుకే దొరికినప్పుడల్లా ఉతికి ఆరేస్తుంటారు… అవునూ, నిజంగానే క్లైమాక్స్ వచ్చేసినట్టేనా..? దీప, కార్తీక్ ఒక్కటైనట్టేనా..? అబ్బే… కలలు కనకండి, కరోనా సెకండ్ వేవ్‌లాగే… కార్తీకదీపం వేవ్స్ వస్తుంటయ్… అప్పుడే ఏమైంది..? మోనిత, పాత హత్య, అంజి నేరం గట్రా తేలాలి కదా… సీరియల్ కథకుడు కథను సర్రున మరో మలుపు తిప్పి, మళ్లీ హీరోతో హీరోయిన్ను ఈడ్చి కొట్టిస్తాడు… ఈసారి ఎవరికీ దొరకకుండా హీరోయిన్ ఏ రామేశ్వరమో వెళ్తుంది… హీరో అక్కడికీ వెళ్తాడు… మోనిత మరో కుట్ర పన్నుతుంది… ఇది అనంతం… కథ నిరంతరం సశేషం…!!
Share this Article