.
అహం… జయలలిత ఆ పదానికి ప్రతిరూపం… నాయకులు, మంత్రులు, అధికారులు బహిరంగంగానే ఆమె కాళ్లకు మొక్కుతున్న సీన్లు… ఆమె కారు ఎక్కడో కనిపిస్తుంటే ఇక్కడే సాగిలబడే సీన్లు ఎన్ని చూశామో కదా…
అహం తలకెక్కితే మూర్ఖత్వమే బహిష్కృతం… అదెంత దాకా అంటే ఓసారి ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే పడగొట్టేంత… ఆమె తన కేబినెట్ మంత్రులను కూడా ఎంత పురుగుల్లా తీసిపారేసేదో బోలెడు ఉదాహరణలు కనిపిస్తాయి ఆమె చరిత్రలో…
Ads
అలాంటిదే రజినీకాంత్ వెల్లడించాడు మొన్న… అదేమిటంటే..? ఆర్.ఎం.వీరప్పన్ అని ఒక నిర్మాత… రజినీకాంత్‌తో మంచి అనుబంధం… తను రాజకీయాల్లో చేరాడు, జయలలిత అభిమానం సంపాదించాడు, మంత్రి కూడా అయ్యాడు…
1995… రజినీకాంత్ బ్లాక్‌బస్టర్ చిత్రం బాషా 100 రోజుల వేడుకలు జరుగుతున్నాయి… ఆ వేదిక మీద రజినీకాంత్ మాట్లాడుతూ తమిళనాడులో పెరిగిపోతున్న బాంబు సంస్కృతిని ప్రస్తావించి, విమర్శలు చేశాడు… ఆ ఫంక్షన్‌కు వీరప్పన్ అతిథిగా హాజరయ్యాడు…
పరోక్షంగా జయలలిత పాలనను బహిరంగంగా విమర్శిస్తుంటే వీరప్పన్ వింటూ కూర్చున్నాడు, కౌంటర్ చేయలేదని జయలలితకు కోపమొచ్చింది… మరుసటి రోజు తన మంత్రి పదవి పీకేసింది… సదరు మంత్రి విధేయత ఎట్సెట్రా ఏవీ పరిగణనలోకి రాలేదు…
సో, ఒకరకంగా తన వల్లే తన మిత్రుడి మంత్రి పదవి పోయిందని రజినీకాంత్ ఆమె మీద కోపం పెంచుకున్నాడు… అంతకుముందే పలు సంఘటనలతో జయలలితకూ రజినీకాంత్‌కూ నడుమ దూరాన్ని బాగా పెంచాయి… అందులో ఒకటి…
పోయిస్ గార్డెన్‌లో జయలలిత, రజినీకాంత్ ఇరుగూ పొరుగూ… ఆమె సీఎంగా ఉన్నప్పుడు ఓసారి ఆమె కాన్వాయ్ వస్తుందనే కారణంతో రజినీకాంత్ కారును ఆపేశారు… అసలే పాపులర్ హీరో, తనకూ అహం ఉంది… వెంటనే కారు దిగి, ఓ వీథిదీపానికి ఒరిగి, సిగరెట్ వెలిగించుకున్నాడు… తనను చూడటానికి జనం నిమిషాల్లో గుమిగూడటం మొదలైంది…
రోడ్ల నిండా జనం… జయలలిత కాన్వాయ్ ఆగిపోయింది… నామీద నీ అధికారం ప్రదర్శిస్తావా అన్నట్టుగా బాషా టైపులో ఆమె వైపు ఓ చూపు విసిరి వెళ్లిపోయాడు… ఇద్దరూ సినిమాల ద్వారా పాపులారిటీని పొందినవాళ్లే… కానీ రజినీకాంత్ పాపులారిటి సినిమాకు మాత్రమే పరిమితం, జయలలితది రాజకీయాధికారం… దాని ప్రాబల్యం వేరు… ఈ తేడా కూడా అప్పట్లో బాగా చర్చనీయాంశమైంది…
ఇవన్నీ ఒక్కొక్కటీ కలిసి ఆమె మీద వ్యతిరేకత పెరిగి… 1996 ఎన్నికల్లో రజినీకాంత్ డీఎంకే, టీఎంసీ కూటమిని బహిరంగంగా సమర్థించాడు… జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడు అనే తన విమర్శను ఫ్యాన్స్ సంఘాలు జనంలోకి బాగా తీసుకెళ్లాయి…
ఇదంతా నేను ఏది చెప్పినా తమిళజనం వింటారు అనే అహాన్ని పెంచింది రజినీకాంత్‌లో… రాజకీయాల్లో వ్యక్తిగత అహాలు ఎలా ప్రభావాన్ని చూపిస్తాయో చెప్పడానికి జయలలిత- రజినీకాంత్ సంబంధాలే పెద్ద ఉదాహరణ… సానుకూలతలకూ, వ్యతిరేకతకూ వేరే సిద్ధాంతాల్లేవు, రాద్దాంతాల్లేవు… ఇవిగో ఇలాంటివి తప్ప..!!
Share this Article