హబ్బబ్బ… ఈసారి ఇండియన్ ఐడల్ పోటీని సోనీ వాడు ఎంత బాగా రక్తికట్టిస్తున్నాడో కదా అనుకున్నాం కదా ఈమధ్య… అన్ని రియాలిటీ షోలను మించి పాపులారిటీ సాధిస్తున్నట్టే ఉంది… ఈసారి కంటెస్టెంట్లు కూడా ఏక్‌సేఏక్ ఉన్నారు, బలంగా పోటీపడుతున్నారు కూడా… సరే, టీవీ షోలు అంటేనే ఓ వ్యాపారం కదా… మంచి రేటింగ్స్ కావాలి, యాడ్స్ కుమ్మేయాలి… ఒక పిచ్చి టీవీ సీరియల్ తీస్తే అదలా ఏళ్లకేళ్లు నడుస్తూనే ఉంటుంది… మన ఇండియన్ వ్యూయర్స్ మెంటాలిటీ తెలుసు కదా… చూస్తూనే ఉంటారు అలా… రేటింగ్స్ అన్నీ వాటికే… కానీ ఒక రియాలిటీ షోను క్లిక్ చేయాలంటే చాలా కష్టం… అదీ పాన్ ఇండియా స్టయిల్లో..! కానీ ఖర్చుకు వెరవకుండా సోనీ ఈ షోను రక్తికట్టిస్తోంది… వారం వారం ఒక గెస్టును కూడా తీసుకొచ్చి సందడిని ఎప్పటికిప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తోంది… ఆయా గెస్టులకు అనువైన పాటలు, కంటెస్టెంట్లతో మాటామంతీ గట్రా నిజంగానే ఆసక్తిని రేపుతున్నయ్ షో మీద…
ఒక యాక్టివ్ గెస్టు గనుక వస్తే ఆ ఎపిసోడ్ ఎంత బాగా పండుతుందో చెప్పడానికి ఆమధ్య రేఖ పాల్గొన్న ఎపిసోడ్ ఓ ఉదాహరణ… ఆరోజు ఎపిసోడ్ అదిరిపోయింది… పాడింది, ఆడింది, కానుకలిచ్చింది, జోకులు వేసింది, పర్ఫామ్ చేసింది… వాట్ నాట్… సేమ్, గెస్టులు గనుక యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తే ఆయా ఎపిసోడ్లు జనరంజకమవుతాయి… ప్రేక్షకుడికి కూడా ఓ కొత్తదనం… రేటింగులు, యాడ్స్, డబ్బులు అనేవి పక్కన పెట్టినా సరే… ఒక రియాలిటీ షో గనుక హిట్టయితే నాన్-ఫిక్షన్ కేటగిరీలో ఆ చానెల్ పోటీలో ఉంటుంది… అయితే ఎటొచ్చీ… ఎలాగూ జనం బాగానే మెచ్చుకుంటున్నారు కదాని సోనీవాడు ఓ మతిలేని పని చేసేశాడు… అది ఏమిటయ్యా అంటే గెస్టుగా రాందేవ్ బాబాను పిలవడం…!!
Ads
రాందేవ్ బాబా ప్రముఖుడే… సందేహం లేదు… తనను తీసిపారేయాల్సిన అవసరమూ లేదు… కానీ ఒక షోకు తను ఎలా ఆప్ట్ అవుతాడు..? ఇది ఫిలిమ్ సాంగ్స్ బేస్డ్ పక్కా ఎంటర్టెయిన్మెంట్ షో, డీజే తరహా షో… పైగా సినిమా పాటలే ఈ షోకు ఆధారం… దానికి ఒక సన్యాసి హాజరై ఏం చేస్తాడు..? ఆ షోకు తనెలా సూట్ అవుతాడు..? ఏం..? అక్కడికి వెళ్లి… అక్కడ కూడా దేహదారుఢ్య ప్రదర్శన, యోగా చిట్కాలు గట్రా బోధిస్తాడా..? ఇవే కదా మనకు తలెత్తే ప్రశ్నలు… ఎస్, నిజంగా అదే చేశాడు… ఈమధ్య చాలా రోజులైంది కదా తెర మీద కనిపించి… సిలిండర్ ఎత్తి చూపించాడు, హోస్ట్‌ను అమాంతం పైకెత్తాడు… యోగా చిట్కాలు చెప్పాడు… తనను పిలవడానికి సోనీవాడికి ఉన్న సమర్థన ఏమిటంటే… ఆరోజు శ్రీరామనవమి స్పెషల్… అయితే కావచ్చుగాక… రాందేవ్ బాబా ఆధ్యాత్మిక ప్రముఖుడేమీ కాదు… తను ఓ వ్యాపారి, దేశీయ కార్పొరేట్ రిటెయిలర్… స్వతహాగా యోగా గురువు… అంతేతప్ప తనకేమీ ఆధ్యాత్మిక కిరీటాలు లేవు… సో, ఏ కోణం నుంచి చూసినా ఆ ఎపిసోడ్‌కు ఆయన్ని గెస్టుగా పిలవడం విచిత్రం, విస్మయకరం… (ఏమో, తెర వెనుక సంగతులు ఏమున్నాయో మనకు తెలియవు…)
ఒక సల్మాన్ వచ్చాడంటే అదొక అట్రాక్షన్ వాల్యూ ఆ షోకు… కొత్త ప్రేక్షకులను షో వైపు రప్పించడానికి ఉపయోగకరం… అలాగే కాజోల్, ఏక్తాకపూర్, జితేంద్ర, రేఖ, హేమమాలిని ఎట్సెట్రా సినిమా హీరోలు, హీరోయిన్లు వచ్చారంటే అదొక అదనపు ఆకర్షణ అవుతుంది… తాజాగా జయప్రద కూడా గెస్టుగా రాబోతోంది… అలాగే ఏఆర్ రెహమాన్, ఆనంద్ జీ వంటి సంగీత దర్శకులు… అల్కా యాజ్ఙిక్, కుమార్ సాను వంటి గాయకులు వస్తున్నారంటే అది మరింత ఆప్ట్ అవుతుంది… వాళ్ల ప్రతి మాటా పోటీదార్లకు బాగా ఉత్తేజాన్ని ఇస్తుంది… వాళ్లు సినిమా సంగీతంలో మునిగి తేలేవాళ్లు… మరి రాందేవ్ బాబా ఎందుకు..? అవునూ, నీకేం పనయ్యా అక్కడ..? వీళ్లు పిలిచారు సరే, వెళ్లిపోవడమేనా..? కాషాయం కట్టిన సన్యాసి డీజే ప్రోగ్రామ్‌కు పోయినట్టు…!!
Share this Article