.
అనుభవలేమి చాలా అంశాల్లో పదే పదే కనిపిస్తోంది రేవంత్ రెడ్డి సర్కారులో… మంత్రుల సమన్వయలేమితోపాటు అసలు ఏదైనా ఇష్యూ వస్తే ఎలా డీల్ చేయాలో కూడా తెలియడం లేదు… ఎలా సమర్థించుకోవాలో, ఎలా సరిదిద్దుకోవాలో, అసలు ఎవరు సమాధానం చెప్పుకోవాలో కూడా సోయి లేదు…
ఉదాహరణకు ఇంటర్‌మీడియెట్ ప్రభుత్వ కాలేజీల్లో సంస్కృతం ప్రవేశపెట్టడం… కేవలం మార్కుల కోసం ప్రైవేటు కాలేజీలు తమ విద్యార్థులతో సంస్కృతం తీసుకునేలా చేసి… ఇంగ్లిష్, హిందీ, తెలుగు… ఏ లిపిలోనైనా సరే రాయించేస్తాయి… పిల్లలకు వచ్చేది కూడా తక్కువే, కానీ అడ్డగోలు మార్కులు పడతాయి…
Ads
దాని మీదే బోలెడు విమర్శలు ఉండగా, ప్రభుత్వ కాలేజీల్లోనూ ప్రవేశపెట్టడం ఏమిటసలు..? పైగా మార్కులు తప్ప మరే ఫాయిదా ఉండదు… వేద, సంస్కృత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యానంతరం పోస్టులు లేవని కొందరు కేసీయార్‌కు దగ్గరగా ఉండే ఎవరో స్వామిని ఆశ్రయిస్తే, ఆయన కేసీయార్‌కు చెబితే… ఈమేరకు అప్పట్లోనే ఓ ప్రపోజల్…
అంటే కొత్త కొలువుల క్రియేషన్ కోసం, వాటి భర్తీ కోసం అన్నమాట… సరే, ఆయనే చేయలేదు కదా, మరి ఈ ప్రభుత్వానికి దేనికి..? బోలెడు విమర్శలొచ్చాయి… ఏదీ, ఒక్కరైనా సమర్థించుకోలేదు, సరిదిద్దుకోలేదు… 3, 4 రోజులుగా విమర్శలొస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి ఒక్క మాట వివరణ లేదు, స్పష్టత లేదు…
స్కూళ్లలో తెలుగు మస్ట్ అన్నారు… సరే, 9, 10 తరగతులకు సింగిడి పుస్తకమా..? వెన్నెల పుస్తకమా..? సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సిలబసులకు ఏ పుస్తకం..? ఈ ప్రశ్నలకు అసలు ఇంకా సమాధానాలే దొరకడం లేదు… ఏ శాఖ నుంచీ వివరణ లేదు…
ఈలోపు మాపై తెలుగు రుద్దకండి అని ఇతర భాషలకు చెందిన కొందరు సిటిజెన్స్ ఆందోళనలు… విచిత్రం ఏమిటంటే…? తమిళనాడులో ఏనాటి నుంచో ఉన్నదే ఈ రుద్దుడు, తమ భాషను తప్పకుండా నేర్చుకోవాల్సిందే అంటారు వాళ్లు… ఇదేతరహా ఆందోళనలు గనుక తమిళనాడులో ఎవరైనా చేస్తే ఎలా ఉండేది..? అదే కాదు, కర్నాటక కూడా తమిళనాడును మించిపోయింది ఇప్పుడు…
ఇప్పుడిప్పుడే మరాఠీ రుద్దుడు కూడా మొదలైంది… ఎటొచ్చీ మన హైదరాబాదే చాలా మంచిది… ఓ మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఏకంగా శాసనసభలోనే ఓ మహిళా మంత్రి సీతక్కకు హిందీ రాదు, ఇంగ్లిషు రాదు అని ఆక్షేపిస్తాడు… ఆమె ఏదో సమాధానం ఇచ్చింది గానీ తోటి కేబినెట్ మంత్రుల నుంచే బలమైన కౌంటర్లు పడలేదు ఆ మజ్లిస్ ఎమ్మెల్యేకు…
ఆమధ్య పార్లమెంటులో డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ పార్లమెంటు వ్యవహారాలను సంస్కృతంలోకి కూడా అనువదించడాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలంగా ఆరోపించాడు… అది ఆర్ఎస్ఎస్ భావజాలంతో అనుసంధానించడం అట… పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథా చేయడం అట… ప్రస్తుతం 73 వేల మంది మాత్రమే సంస్కృతం మాట్లాడేవారున్నారని లెక్క చెప్పాడు…
సరే, స్పీకర్ బిర్లా తనకు దీటుగా సమాధానం చెప్పాడు, అది వేరే సంగతి… కానీ ఇప్పుడు ఇంటర్‌మీడియెట్ ప్రభుత్వ కళాశాలల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టడం బీజేపీ ద్వారా కాదు, యాంటీ -బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా జరగడం ఒకింత విస్మయకరమే..!! అంటే, డీఎంకే భాషలో చెప్పాలంటే, కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఇంటర్మీడియెట్ విద్యను అనుసంధానించడమా..!?
Share this Article