.
మాస్ జాతర, మనదే ఇదంతా…. అని ఓ పాట కనిపించింది యూట్యూబులో… రవితేజ పాట… అప్పుడెప్పుడో ఓ పాట వచ్చింది కదా, నీ కళ్లు పేలిపోను చూడవే అని… సేమ్, అదే టోన్‌లో, అదే ట్యూన్‌లో భీమ్స్ సంగీతం, భాస్కరభట్ల సాహిత్యం…
సాహిత్యం అనే పెద్ద పదం అక్కర్లేదు, మన తెలుగు సినిమా పాటలకు ఆ పదం వర్తించదు… నిర్మాత, హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడి టేస్టు… కథకు, పాత్రకు తగిన పాటలు… ఏవో నాలుగు పదాలు ట్యూన్‌లో కూర్చాలి, అంతే కదా… లిరిసిస్టు తప్పేమీ లేదు… తనకు వేరే గత్యంతరమూ లేదు… పైగా రవితేజవి సేమ్ అవే మొనాటనస్ స్టెప్పులు…
Ads
అలాగే జరిగింది… సేమ్, ఆ పాత పాట తరహాలోనే… తులసి కోటలో గంజాయి ఫ్లేవర్ అట… నీ బాబు నీకన్నా పెద్ద లోఫరు, నువ్వు పైకి చూడబోతే స్కాచ్ లాగా సూపరు, నీ మైండ్ చూడబోతే చీప్ లిక్కరు… నీలాంటి పిల్లా ఉంటే ప్రతి జిల్లా అయిపోదా కొల్లేరైపోదా తెల్లారేకల్లా… నిన్నెన్ని బూతులు తిట్టుకున్నా పర్లేదు, నా ఉసురు తగిలిపోదా… ఇలా సాగింది పాట… రియల్లీ మన ఇండస్ట్రీ టేస్టుకు మనమీద మనమే జాలిపడదాం… మళ్లీ మళ్లీ…
ఫాఫం, మన లిరిసిస్టులు… అన్నీ చంపుకుని రాయాల్సి వస్తున్నట్టుంది… సరే, శ్రీలీల గురించీ ఓ మాట చెప్పుకోవాలి… పాపం, కేవలం డాన్సులకే ఆమెను తీసుకుంటున్నారు… చూడబోతే త్వరలో ఫేడవుట్ ప్రమాదం ఉందామెకు… ఇప్పటికే పాపులారిటీ పడిపోయింది…
అసలు విషయానికి వద్దాం… ఎఐ అన్ని రంగాల్లోకి జొచ్చుకు వస్తోంది కదా… ఆమధ్య ఎస్పీ బాలు గొంతుతో ఓ పాట ఎవరో పాడిస్తే బాలు కొడుకు చరణ్ కేసు వేశాడు… అది అసమంజసం అని కాదు… రాయల్టీ కోసం… ఇప్పుడు చక్రి గొంతుతో ఈ పాట కంపోజ్ చేశారు…
ఈ ధోరణి ఎన్నిరకాల విపరిణామాలకు దారితీస్తుందంటే..?
1) అందరూ పాత సూపర్ గాయకుల గొంతులతో పాడించేస్తే, వారసులకు ఎంతో కొంత రాయల్టీ ముట్టజెబితే మరి వర్తమాన గాయకులు ఏం కావాలి..? వైవిధ్యానికి తావేది..?
2) రేప్పొద్దున అరె, మస్తుందిరా సాంగు అనుకుని ఏ గద్దర్ అవార్డో ప్రకటిస్తే, దాన్ని ఎవరికివ్వాలి..? ఎవరి ఘనతగా చెప్పుకోవాలి..?
3) రాను రాను ఎన్టీయార్, ఏఎన్నార్, ఎస్వీయార్ ఎట్సెట్రా మన ఘన ప్రముఖులనే అచ్చంగా ఎఐ సాయంతో తెర మీద ఆవిష్కరిస్తే..? ఒరిజినల్ ఒరిజినలే… కృతకం కృతకమే… ప్రేక్షకులు హర్షిస్తారా..? స్వాగతిస్తారా..?
4) మరెందుకు ఈ ప్రయోగాలు..? పాత వాళ్ల పాటల్ని, సినిమాల్ని, సీన్లను వాళ్లకే అట్టిపెట్టండి… ఈ కృతకపు జాడల్లోకి వాళ్లను లాగకండి… ఐనా పెడపోకడలు రాను రాను మరింత పెరిగిపోతున్న మన ఇండస్ట్రీకి చెప్పేదెవడు..? వినేదెవడు..!
గతంలో యాంజెలినా జూలీతో ఫోటో రియలిస్టిక్ మోషన్ కాప్చర్ టెక్నాలజీతో ఓ మూవీ తీశారు, తరువాత హాలీవుడ్ మళ్లీ ఆ జోలికిపోలేదు, కారణం, ఎవడూ చూడలేదు… రజినీకాంత్‌తో ఆయన బిడ్డ సేమ్ టెక్నాలజీతో కొచ్చాడియాన్ తీసింది… అదీ ఎవడూ చూడలేదు… ఒరిజినల్ ఒరిజినలే, కృతకం కృతకమే…
నిజం… ఇదే పాటలో ఇదే భాస్కరభట్ల చెప్పినట్టు… తులసి కోటకు ఈ పాటలు గంజాయి ఫ్లేవర్..! భలే చెప్పావు బ్రదర్… ఈ పాట నిర్మాత, దర్శకుడు, హీరోకు అర్థమైందో లేదో గానీ..!!
Share this Article