.
సోషల్ మీడియా అంటే సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అందరికీ క్రేజే.
ఎంతటోడైనా సరే దీనిమాయలో మునిగి తేలాల్సిందే.
ఇందాక నేను యూ ట్యూబ్ ఛానెల్స్ చూస్తుంటే,
‘ జగపతి బాబు రోడ్ల మీద ఎలా నడుస్తున్నాడో చూస్తే షాక్ అవుతారు ‘
అని థంబ్ నెయిల్ వదిలిన ఓ ట్యూబు కంటపడింది.
Ads
ఇలాంటి షాక్ ట్రీట్మెంట్లు గతంలో చాలా చూసిన అనుభవంతో నేను షాక్ అవలేదు కానీ ఆశర్యం వేసింది.
వీడి పిచ్చిగానీ జగపతి బాబు రోడ్డు మీద నడవకుండా గాల్లో నడుస్తాడా?
జగపతి బాబు ఏంటి మోహన్ బాబు అయినా ఆఖరికి బాబూ మోహన్ అయినా నడవాల్సింది నేల మీదే కదా !
ఇందులో షాక్ అయ్యేదేముంది?
కొంపదీసి జగపతి బాబు తాగి రోడ్డెక్కాడా?
ట్యూబు వాడి ట్రాప్ లో పడకూడదు అనుకుంటూనే ఓపెన్ చేసి చూసా.
వీడియోలో జగపతి బాబు నిజంగానే ట్రాఫిక్ రోడ్ల మీద ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు.
జనం జగపతి బాబు తమ ముందు నుంచే నడుచుకుంటూ వెళ్ళడం ఆశ్చర్యంగా చూస్తున్నారు.
వీళ్లూ మనలాంటి మనుషులే అనే థింకింగ్ మర్చిపోయి యుగాలు అవుతుంది కదా, అంతే ఆశర్యం ఉంటుందిలే.
నా కెమెరా కళ్ళు ఈ సీన్ ఏదో నాచురల్ గా జరిగింది కాదని పసిగట్టాయి.
ప్రీ వెడ్డింగ్ షూట్ లా ప్రీ వాకింగ్ షూట్ కోసం జగపతి బాబు కెమెరామెన్ గంగరాజుతో ఎరేంజ్ చేసుకున్న సెట్టింగ్ అని అర్థమైంది.
వెంటనే జగపతి బాబు ప్రొఫైల్ లోకి వెళ్ళి చూసా.
ఈ మధ్య ఉగాదికి జగపతి బాబు ఒక్కడే తల్లి ఉంటున్న ఇంటికెళ్ళి ఉగాది పచ్చడి తినిపించడం మొత్తం షూట్ చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అంతే… ‘జగపతి బాబు తల్లి ఇంటికెందుకు వెళ్ళాడో తెలిస్తే షాక్ అవుతారు ‘ అంటూ షాకుల థంబ్ నెయిల్స్ తో యూ ట్యూబర్లు తెగ మోసేశారు.
ఆ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. సేమ్, చద్దన్నం గొప్పతనం మీద కూడా ఓ వీడియో.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా… హీరోగా…. విలన్ గా అన్ని పాత్రల్లో చక్కటి నటుడిగా ప్రూవ్ చేసుకున్న జగపతి బాబు కొత్తగా ఈ యూ ట్యూబ్ వీడియోల్లోకి ఎందుకు దిగాడు?
ఈమధ్యనే సీనియర్ సిటిజెన్ కోటాలోకి వెళ్ళిపోయిన జగపతి బాబు కొంపదీసి ఐడెంటిటీ క్రైసిస్ లో పడుతున్నాడా?
మొదట్లో అవకాశాల కోసం సొంత ఐడెంటిటీని సృష్టించుకోవడానికి ఎలా కష్టపడతారో.. ఎదిగిన తర్వాత ఆ ఐడెంటిటీని నిలబెట్టుకోవడానికి కూడా అంతే కష్టపడాల్సి ఉంటుంది.
ఇది అన్ని రంగాలకు వర్తిస్తుంది.
లేకపోతే కొత్తనీరు వచ్చి పాతనీరు కొట్టుకుపోతుంది.
కాల్గేట్ టూత్ పేస్ట్ గురించి తెలియనివాళ్ళు లేరు.
కానీ ఈరోజుకీ యాడ్స్ ఇవ్వడం ఆపలేదు.
అదంతే వ్యాపార సూత్రం.
ఇక ఈ జాడ్యం హీరోయిన్లలో ఒకింత ఎక్కువగా ఉంటుంది.
సినిమాల్లో కొత్తగా అవకాశాల కోసం వెతుక్కునే ఔత్సాహిక నటీమణుల నుంచి జాన్వీ కపూర్ వరకు పర్సనల్ అటెన్షన్ కోసం ఇన్స్టాగ్రామ్ ని తెగ వాడుకుంటారు.
వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ లో చిన్న వీడియో పోస్ట్ చేయగానే లక్షల్లో వ్యూస్ వస్తాయి.
సరే, ఇన్‌స్టాలో యాడ్స్ పెట్టడం కోట్ల రూపాయల దందా… ఇన్‌ఫ్లుయెన్సర్లు అయిపోతే ఏ బెట్టింగ్ యాప్సో ప్రమోట్ చేసినా బోలెడు డబ్బు…
వర్ధమాన హీరోయిన్లలో చాలామంది ఏడాదికోసారైనా గోవా బీచ్ లోనో.. లక్ష ద్వీప్ బీచ్ లోనో ఓ బికినీ షూట్ ప్లాన్ చేసి, సోషల్ మీడియాలో వీడియో వదలడం ఆనవాయితీగా చేస్తున్నారు.
అదంతా ప్రొఫెషన్ లో ఓ భాగం.
కాబట్టి ఇందుమూలంగా యావన్మందికీ అర్థమైంది ఏంటంటే ,
‘ఎంతవారలైనా సోషల్ మీడియా దాసులే ‘ అని.
అవునా? కాదా? — పరేష్ తుర్లపాటి
Share this Article