.
(రమణ కొంటికర్ల) …. అమ్చీ ముంబైగా పిల్చుకునే ఆర్థిక రాజధానిలో… ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా ఎప్పుడూ ఓ చర్చే. ఒకవైపు, నిత్య గందరగోళం, విపరీతమైన జనరద్దీ. మరోవైపు, కడు పేదవాడి నుంచి ఆకాశహర్మ్యాల్లో నివసించే ధనవంతుడి వరకూ కనిపించే మహానగరం. అలాంటి నగరంలోని అంబానీ ఇంట్లో సౌకర్యాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి పెద్ద చర్చే మొదలైంది. 1) ఏసీ లేదట 2) వక్ఫ్ ఆస్తి అట…
1.8 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే సుమారు 15 వేల కోట్ల రూపాయలతో రాజభవనాల్ని సైతం మరిపించేలా 27 అంతస్థుల బిల్డింగ్ ని ముఖేష్ అంబానీ ముంబైలో నిర్మించిన సంగతి విదితమే. ఇంటీరియర్ డెకరేషన్స్, బిల్డింగ్ డిజైనింగ్, స్విమ్మింగ్ పూల్స్, డాబాతోటలు వంటి మెరుపులు, ఇంజనీరింగ్ అద్భుతాలను పక్కనబెడితే… అంతకుమించి ఆ భవంతిని నిర్మించిన తీరు ఇప్పుడు మళ్లీ చర్చకు ప్రధాన కారణమైంది.
Ads
ఏసీలు లేకుండానే ఆస్వాదించగల్గేలా ఆ ఇంజనీరింగ్ నైపుణ్యమే ఆ స్కై మాన్షన్ గురించి కొత్త చర్చకు తెరలేపింది. ముంబై వంటి సముద్ర తీరంలో పరిమితిని మించిన జనబాహుళ్యంలో… ఏకంగా 27 అంతస్థుల్లో ఏసీని మించిన స్వచ్ఛమైన గాలి, వెలుతురు, మంచు కురిసేలా తీర్చిదిద్దిన ఇంజనీరింగ్ అద్భుత సృష్టి అక్కడికెళ్లినవారిని కట్టిపడేస్తుంది.
అవుట్ డోర్ ఏసీ.. కూలింగ్ సిస్టమ్ వెనుక నిజమేంటసలు..?
ముఖేష్ అంబానీ యాంటీలియా స్కై మాన్షన్ లో ఏసీలు లేవనేది ఓ రూమర్. అదెలాగూ నిజం కాని ముచ్చటే. కానీ, పైకి వెళ్లినాకొద్దీ అరేబియా సముద్రపు గాలులు తాకేలా చల్లబడే వాతావరణంతో అక్కడ ఏసీల అవసరమేమాత్రం లేకుండా తీర్చిదిద్దిన తీరే యాంటీలియా గురించి మళ్లీ చర్చకు కారణం. గదుల్లోని ఇంటీరియర్ భాగాల్లో ఎలక్ట్రికల్ లైట్స్ వేస్తేనే వెలుతురుండే నగరాల్లోని భవనాలకు భిన్నంగా… సూర్యరశ్మితో కూడిన కాంతే ఇల్లంతా ప్రసరించేలా డిజైనింగ్ చేశారు యాంటీలియాని. పెర్కిన్స్ అండ్ విల్, లీటన్ ఏసియా అనే రెండు ప్రముఖ ఆర్కిటెక్ఛరల్ కన్స్ట్రక్షన్ కంపెనీలు కలిసి ఈ బిల్డంగ్ ను నిర్మించాయి.
అద్భుతమైన బెల్జియం గ్లాస్, గాజు, పాలరాతితో ఏర్పాటు చేసిన టైల్స్ తో పాటు… పైన గదుల్లో ఏర్పాటు చేసిన శీతలీకరణ వ్యవస్థ ఆశ్చర్యపరుస్తుందట. తీవ్రమైన ఎండలోంచి బయటకెళ్లినవారు కూడా ఆ మాన్షన్ లోకి అడుగుపెట్టాక ఆ కూలింగ్ సిస్టమ్ కు అలవాటు పడటమూ కష్టమేనంటున్నారు.
ఓసారి శ్రేయా ధన్వంతరి అనే బాలీవుడ్ నటి ఒక ఫ్యాషన్ షూట్ కోసం అంబానీ ఇంటికెళ్లిందట. ఆ చలికి తట్టుకోలేక కాస్త వాటర్ హీటర్స్ ఉష్ణోగ్రతను పెంచమని అడిగితే… సదరు ఆ మాన్షన్ మేనేజర్ కుదరదని చెప్పేశారట. అది వ్యక్తిగత అవసరాల కోసం మార్చే విధంగా కాకుండా.. ఆ బిల్డింగ్ డిజైనింగ్ లోనే కూలింగ్ సిస్టమ్ అలా ఏర్పాటు చేశారు కాబట్టి కుదరదని తేల్చి చెప్పేశారట.
ఆ భవనంలో అంబానీ కుటుంబీకులెక్కడ నివశిస్తారు..?
అంబానీ ఇల్లు ఆకాశహర్మ్యమే కాదు.. హెలిప్యాడ్స్, స్నోరూమ్స్, స్పా లాంజ్స్, టెంపుల్స్, ప్రైవేట్ థియేటర్స్, స్విమ్మింగ్ పూల్స్, ఐస్ క్రీమ్ పార్లర్స్ తో ఓ షాపింగ్ మాల్ కూడా దిగదుడుపే, ఓ స్టార్ హోటల్ కూడా నోరు వెళ్లబెట్టేలా తీర్చిదిద్దారు. అంతటి బిల్డింగ్ లో అంబానీ ఫ్యామిలీ మెంబర్సంతా ఉండేది మాత్రం 27వ అంతస్థులోనే. ఎందుకంటే అక్కడే అది నీతా అంబానీ టేస్ట్. సహజమైన కాంతి, వెంటిలేషనే అందుకు ప్రధాన కారణమంటుంది నీతా.
ముంబై శ్రీమంతులకు పెట్టింది పేరైన అల్టామౌంట్ రోడ్డులో.. సందడిగా ఉండే బజార్లో ఆకాశాన్ని చూసినట్టుగా చూడాల్సిన రీతిలో ఏకంగా 568 అడుగుల ఎత్తులో కనిపిస్తుంది. ఓవైపు విపరీతమైన వాహన కాలుష్యం కనిపించే అలాంటి మహానగరంతో ఎలాంటి సంబంధం లేనట్టు.. ఆ 27వ అంతస్థుపైన స్వచ్ఛమైన గాలితో.. కాలుష్యానికి దూరంగా… అలాగే, సముద్రగాలులే తప్ప.. దాన్నుంచి ఇబ్బంది పెట్టే తేమ వాతావరణానికి మరింత దూరంగా… అరేబియా అందాలను కనువిందు చేసేలా రూపకల్పన చేశారు ఆంటిలియా భవనం.
ఇంతకీ అక్కడెవరెవరు నివశిస్తారు…?
ముఖేష్, నీతా అంబానీ.. అలాగే, వారి పిల్లలు ఆకాష్, శ్లోకామెహతా దంపతులు… అనంత్, రాధికా మర్చంట్ దంపతులతో పాటు.. ఇషా.. ఇతర వ్యక్తిగత సన్నిహిత సిబ్బందికి మాత్రమే ఆ భవనంలోకి పర్మిషన్ ఉంటుంది. విశ్వసనీయ సహాయకులతో పాటు.. అక్కడే ఏర్పాటు చేసిన ఓ చిన్న అభయారణ్యాన్ని చూసుకునే పర్యవేక్షకులకు మాత్రమే ఆ 27వ అంతస్థులోకి అడుగుపెట్టే అనుమతి ఉంటుంది.
సముద్రతీరంలో మంచు!
అవును, సముద్ర తీరమంటే విపరీతమైన తేమ.. ఎవ్వర్ని చూసినా బయట కాస్సేపుంటే జిడ్డుగా మారే శరీరాలు కనిపించే మహానగరంలో.. పూర్తిగా మంచుగదులను నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతంగా ఆంటిలియా ప్రత్యేకత దక్కించుకుంది. ఆ భవనంలోని గోడల నుంచి ఆర్టిఫిషియల్ స్నే ఫ్లేక్స్ జాలువారేలా ఏర్పాట్లు చేశారు. అది నిజంగా ఇంజనీరింగ్ మ్యాజిక్కే. ముంబై వంటి ఉష్ణమండల ప్రాంతంలో వాతావరణాన్ని నియంత్రించే విధంగా చేసుకున్న ఏర్పాట్లు సామాన్యులనే కాదు, శ్రీమంతులనూ అబ్బురపర్చేవి.
ఒక ఆదర్శధామంలా కనిపిస్తుంది ఆంటిలియా. పౌరాణిక సినిమాల్లో మనం అప్పుడప్పుడూ చూసి నిజంగానే ఇలా ఉండేవా అని ఆశ్చర్యపోయే రీతిలో భవన నిర్మాణముంటుందంటున్నారు ఆంటీలియాను సందర్శించినవారు. గాజు, ఉక్కు, పాలరాయి, మంచు కురిసే ఏర్పాట్లు ఇవన్నీ మినహాయిస్తే.. అంతకుమించి ఓ అద్భుతమైన అనుభూతికి కేరాఫ్ లా.. ఓ భూతలస్వర్గమంటుంటారు.
రాజభవనాలంటే సాధారణంగా షాండ్లియర్స్ తో రంగురంగుల దీపకాంతుల్లో మెరుస్తూ కనిపిస్తుంటాయి. కానీ, వాటన్నింటినీ మించి సహజ సిద్ధమైన సూర్యకాంతి, స్వచ్ఛమైన గాలి, అంతకుమించిన కూలింగ్ వ్యవస్థనేర్పాటు చేసుకుంటూనే.. 8.0 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపాలు వచ్చినా తట్టుకునే అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం, ఇంటీరియర్ డిజైనింగ్ కు కేరాఫ్ కాబట్టే మళ్లీ ఇప్పుడు ఆంటీలియా వార్తల్లో కథనమై వైరలవుతోంది.
ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రతీ ఏటా చోటు సంపాదించే ముఖేష్ అంబానీ 2025లో కూడా ఫోర్బ్స్ జాబితాలో నంబర్ వన్ గా నిల్చారు. అయితే, యాంటీలియాను నిర్మించిన భూమి వక్ఫ్ బోర్డ్ కు సంబంధించిందనే వివాదమూ ఉంది. గతంలో దీనిపై అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందిచారు. కేవలం ఛారిటీ కోసం ఉపయోగించాల్సిన భూమి అంటూ కూడా చర్చ జరిగింది.
కరీం భాయ్ ఇబ్రహీం అనే వ్యక్తికి సంబంధించిన ఈ ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ పరమైంది. అనాథలైన వారికోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు కోసం ఈ భూమిని ఆయన దానమివ్వగా.. ఆ తర్వాత ఆ ట్రస్ట్ ఈ భూమిని వక్ఫ్ బోర్డుకు అప్పగించింది. 2002లో వక్ఫ్ బోర్డ్ రిక్వెస్ట్ మేరకే ఈ భూమిని ముఖేష్ అంబానీ 2.5 అమెరికన్ మిలియన్ డాలర్స్ కు కొనుగోలు చేశారు.
మార్కెట్ రేటు కంటే తక్కువకే కొనుగోలు చేయడంతో పాటు.. ఇక్కడ ఓ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, అనాథ ఆశ్రమం ఏర్పాటు చేయాలన్న సంకల్పానికి తూట్లు పొడుస్తూ ఇతర అవసరాల కోసం వాడటంపై వక్ఫ్ బోర్డ్ ఏకంగా సుప్రీం మెట్లెక్కింది. కానీ, ఆ పిల్ ను సుప్రీం కోర్ట్ కొట్టేసింది. దాంతో, స్టే ఆర్డర్ ను రద్దవ్వడం.. ఆ తర్వాత వక్ఫ్ బోర్డ్ కూడా తన పిటిషన్ ను ఉపసంహరించుకోవడంతో.. ఇదిగో మనం చెప్పుకుంటున్న యాంటీలియా నిర్మాణం జరిగింది……
Share this Article