.
హైవే… వెడల్పుగా, సమతలంగా రోడ్డు… డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అప్రమత్తంగా, జాగ్రత్తగా నడిపిస్తున్నట్టే కనిపిస్తూ ఉంటుంది… వాహనం మెత్తగా రివ్వున పోతూనే ఉంటుంది…
కానీ హఠాత్తుగా ఎదురుగా ఆగి ఉన్న వాహనాన్నో, ముందు వెళ్తున్న వాహనాన్నో గుద్దేస్తుంది… ఏం జరిగిందో అర్థమయ్యేలోపు డ్యామేజీ జరిగిపోతుంది… ఎందుకలా…? అనేక కారణాలు ఉండవచ్చుగాక, కానీ ఈమధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన కారణం… రోడ్ హిప్నాసిస్…
అవును, రోడ్ హిప్నోసిస్ హైవేల మీద జరిగే చాలా ప్రమాదాలకు ఒక ప్రధాన కారణం.., ముఖ్యంగా వెనుక నుండి ఢీకొనే ప్రమాదాలకు… అతి వేగం, అజాగ్రత్త డ్రైవింగ్, మద్య సేవనం, రోడ్డు పరిస్థితులు వంటి ఇతర కారణాలు ఉన్నా సరే, హైవే ప్రమాదాలకు రోడ్ హిప్నోసిస్ కూడా ఓ కారణమే…
Ads
రోడ్ హిప్నోసిస్ అంటే ఏమిటి?
రోడ్ హిప్నోసిస్ అనేది చాలా మంది డ్రైవర్లకు తెలియని, అర్థం కాని ఓ శారీరక స్థితి…
రోడ్ హిప్నోసిస్ రోడ్డు మీద 2.5 గంటల ప్రయాణం తర్వాత ప్రారంభమవుతుంది. డ్రైవర్ కళ్ళు తెరిచే ఉంటాయి…
కానీ డ్రైవర్ మెదడు కళ్ళు చూసిన విషయాలను రికార్డ్ చేయడం లేదా విశ్లేషించడం ఆగిపోతుంది… దాంతో ఎదురుగా ఉన్న వాహనాన్ని గుద్దేస్తుంది…
రోడ్ హిప్నోసిస్ ఉన్న డ్రైవర్‌కు ఢీకొనే క్షణం వరకు చివరి 15 నిమిషాలు ఏమీ గుర్తుండదు… అతను ఎంత కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాడో లేదా ముందు ఉన్న వాహనం ఏ వేగంతో వెళ్తున్నదో విశ్లేషించలేడు. సాధారణంగా ఢీకొనే వేగం 140 కిమీ కంటే ఎక్కువగా ఉంటుంది…
రోడ్ హిప్నోసిస్ నుండి రక్షించుకోవడానికి, ప్రతి 2.5 గంటల ప్రయాణానికి కాస్త ఆగడం లేదా టీయో, కాఫీయో తాగడం… లేదంటే ఓ పక్కన ఆపుకొని అటూఇటూ నాలుగు అడుగులు వేయడం, అంటే రిలాక్స్ కావడం ముఖ్యం…
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొన్ని స్థలాలు మరియు వాహనాలను గమనించి గుర్తుంచుకోవడం ముఖ్యం.
చివరి 15 నిమిషాల నుండి ఏమీ గుర్తులేకపోతే, అది మీరు మిమ్మల్ని మరియు ప్రయాణికులను మరణం వైపు నడిపిస్తున్నారని అర్థం.
రోడ్ హిప్నోసిస్ రాత్రి సమయంలో ఎక్కువగా జరుగుతుంది, ప్రయాణికులు కూడా నిద్రపోతుంటే, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది…
ఇప్పుడు వస్తున్న కొత్త వాహనాల్లో క్రూయిజ్ మోడ్ ఉంటుంది… నిర్ణీత స్పీడులో, నిర్ణీత లేన్‌లో… యాక్సిలరేటర్, గేర్లు యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా సాఫీగా వాహనం నడుస్తూ ఉంటుంది… డ్రైవర్ రిలాక్స్ మోడ్‌లో ఉంటాడు…
ఐనా సరే, అప్రమత్తత అవసరం… ముందుగా వెళ్తున్న వాహనాల మీద దృష్టి అవసరం… దాన్ని బట్టి మన స్పీడ్ తగ్గించడమో ముఖ్యం…
సో, కళ్ళు తెరిచి ఉన్నా మనస్సు మూసుకుపోయి ఉంటే ప్రమాదం తప్పదు… అదే రోడ్ హిప్నాసిస్ చెప్పే పాఠం…
Share this Article