.
మరాఠీలో కాకుండా ఇంగ్లీషులో మాట్లాడతావా.. ఛీ
… ‘మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్న గురజాడ మాట గుర్తుందా? ఇప్పుడు దానికి ప్యారడీ చేసి ‘మతములన్నియు మాసిపోనేపోవు.. భాషల కోసం కొట్లాడుకుందుము’ అనే కొత్త మాట రాయాలని ఉంది.
Ads
దేశంలో ఇప్పుడంతా మతాల కోసం, భాషల కోసం కొట్లాడుకుంటూ ఉన్నారు. తెలుగు వాళ్లింకా కొట్లాడే స్థితికి రాలేదు కానీ, కొంతవరకు పోరాడాలనే ఆలోచనతో (ఉట్టి ఆలోచనే) ఉన్నారు. పక్కన కన్నడ, మరాఠీలతో పోలిస్తే మనం చాలా మేలే. తమిళుల గురించి ఏనాటి నుంచో తెలిసిందే కదా.
… ఏప్రిల్ 7న మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలో ఉన్న దోమ్‌బివ్లీ ఊరిలో రాత్రిపూట పూనమ్ గుప్తా, ఆమె స్నేహితురాలు జ్యోతి చౌహాన్, ఆమె చేతిలో 9 నెలల బిడ్డ స్కూటీ మీద వెళ్తున్నారు. తమ ఇంటికి వెళ్లే దారిలో కొందరు కూర్చుని ఉండగా, బండి నడుపుతున్న పూనమ్ వారిని చూసి, ‘Excuse me’ అంది. అంతే గొడవ భగ్గున రాజుకుంది.
… ‘ఏమే.. మరాఠీలో మాట్లాడకుండా మాతో ఇంగ్లీషులో మాట్లాడతావా? నీకంత టెక్కా? చదువుకున్నానని పొగరా?’ అని ఆమె మీద మాటల దాడి చేశారు. ఆమెను ముందుకు పోనివ్వకుండా అడ్డుకున్నారు. వారంతా ఆమె ఉంటున్న వీధిలోని వారే.
గొడవ కాస్తా చినికి చినికి గాలివాన అయ్యింది. అందరూ పోగై, స్కూటీ మీదున్న వాళ్లను కిందకు లాగి మరీ దారుణంగా కొట్టారు. ‘మరాఠీ మాట్లాడతావా? మా చేతుల్లో చస్తావా?’ అంటూ వారిద్దరిపై దాడి చేశారు. ఆ గొడవలో తొమ్మిది నెలల బాబుకు కూడా దెబ్బలు తగిలాయి. గొడవ ఆపేందుకు వచ్చిన పూనమ్ భర్తను సైతం దారుణంగా కొట్టారు.
… విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఇదంతా వీధి గొడవలు అని తేల్చేశారు. రెండు వైపులా గాయాలున్నాయి కాబట్టి ఇద్దరి మీదా ఫిర్యాదు నమోదు చేశారు. గొడవ జరుగుతున్న సమయంలో ఎవరో తీసిన వీడియో పూనమ్‌కి దొరకడంతో దాన్ని పోలీసులకు అందించి, కొత్తగా మళ్లీ ఫిర్యాదు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
… ఇది మొదటి ఘటన కాదు. సరిగ్గా 15 రోజుల క్రితం మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన కార్యకర్తలు వెళ్లి ఓ సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారు. అతను మహారాష్ట్రలో పనిచేస్తూ మరాఠీతో మాట్లాడటం లేదని కొట్టారు. చేతులు కట్టుకొని క్షమాపణలు చెప్పేలా చేశారు.
పైగా ఎవరైతే మహారాష్ట్రలో ఉంటారో వారంతా తప్పకుండా మరాఠీలోనే మాట్లాడాలని హుకుం జారీ చేశారు. ఈ హుకుంలు ఎలాగూ సామాన్యులకే తప్ప సంపద ఉన్నవారికి కావు. మరాఠీ బలవంతపు ప్రయోగం మాత్రం అక్కడ జరుగుతూనే ఉంది. హింసాత్మకంగానూ మారుతోంది. ఆ మధ్య కర్ణాటకలో కూడా హిందీ, తెలుగు బోర్డుల మీద దాడి జరిగింది.
సో.. మతాల గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు భాషల వారీగా గొడవలు మొదలయ్యాయి. ఈ దేశంలో ఉండాలంటే ఇక ఒక్కో మనిషి ఇంగ్లీషు కాకుండా ఐదారు భాషలు నేర్చుకోవాల్సి రావొచ్చు. – విశీ (వి.సాయివంశీ)
https://www.facebook.com/sai.vamshiIAS/videos/679186878388140
Share this Article