.
వెనుకటికి ఎవరో కాళిదాసు కావ్యంలో కొంతభాగాన్ని ఎత్తి రాసి… తానే రాసినట్లు ప్రచారం చేసుకున్నాడు. కాళిదాసు కావ్యం చదవనివారు నిజమని నమ్మారు. చివరకు రెండూ చదివిన ఒక పండితుడు రాజుకు ఫిర్యాదు చేస్తాడు. నిజనిర్ధారణకు పండితుల పరిషత్తును ఏర్పాటు చేస్తారు.
కాళిదాసు కావ్యంలో సగభాగం యథాతథంగా ఎత్తిరాశాడని పండిత పరిషత్తు తేలుస్తుంది. ఆ రోజుల్లో ఈ నేరానికి రాసిన చేయి నరకడమే శిక్ష. శిక్ష ఖరారు అయ్యాక… కాళిదాసుకు విషయాన్ని విన్నవిస్తారు. అప్పుడు కాళిదాసు శిక్షించవద్దని సున్నితంగా చెబుతాడు.
Ads
“అతడికి నా రచన ఎంతగానో నచ్చితేనే కదా కాపీ కొడతాడు! అది నాకు గౌరవమే. ఆనందదాయకమే. కాబట్టి క్షమిస్తున్నాను” అంటాడు. వెంటనే కాపీ రచయిత కాళిదాసు కాళ్ల మీద పడి… ఇంకెప్పుడూ ఎవరి రచనలను కాపీ కొట్టను అని మారిన మనిషిగా సభ నుండి వెళ్లిపోతాడు. దాదాపుగా ఇదే సన్నివేశాన్ని అక్కినేని నటించిన మహాకవి కాళిదాసులో కూడా పెట్టారు.
కాపీ రైట్ మీద నానా యాగీ చేస్తున్న ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు ఎవరైనా ఈ కాళిదాసు కథ చెబితే బాగుణ్ణు. పాశ్చాత్య వాద్యాలతో దక్షిణాది సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన ఇళయరాజా ప్రతిభా విశేషాలు వీనులవిందుగా ఎన్నయినా చెప్పుకోవచ్చు. పాటల్లో ఆయన చేసిన ప్రయోగాల గురించి పరవశంగా మాట్లాడుకోవచ్చు. కర్ణామృతమైన ఆయన సంగీత సుధల గురించి పల్లవులకు చరణాలు పుట్టేలా వర్ణించవచ్చు. వినగానే ఇది ఇళయరాజా పాట అని చెప్పగలిగే ఒక ముద్ర ఆయన ప్రత్యేకం.
అలాంటి ఇళయరాజా ఎస్ పి బాలసుబ్రహమణ్యం బతికి ఉండగా… విదేశంలో ఒక సంగీత కార్యక్రమంలో తన పాటలు పాడడానికి వీల్లేదు… ఒకవేళ పాడితే తనకు రాయల్టీ చెల్లించాలని షరతు విధించారు. వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి బాలుకు లీగల్ నోటిస్ కూడా పంపారు.
ఆమధ్య మంజుమల్ బాయ్స్ మలయాళం సినిమాలో తన “ప్రియతమా! నీవచట కుశలమా!” పాటను వాడుకున్నందుకు రెండు కోట్ల రూపాయల నష్టపరిహారమివ్వాలని లీగల్ నోటిస్ పంపారు. నిర్మాత అనుమతి తీసుకునే వాడుకున్నామని వారు నెత్తీ నోరు కొట్టుకున్నా…”ఇసై జ్ఞాని” కరుణించలేదు. చివరకు 60 లక్షల రూపాయలు చెల్లించి… లెంపలేసుకున్నారు.
డైరెక్టర్ శంకర్ కు కూడా ఇలాగే తన పాటల ట్యూన్లను కాపీ కొట్టారని లీగల్ నోటిస్ పంపారు. తాజాగా అజిత్ హీరోగా రూపొందిన “గుడ్ బ్యాడ్ అగ్లీ” చిత్రంలో గతంలో తాను స్వరపరిచిన మూడు ట్యూన్లను తన అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపిస్తూ… అందుకు నష్టపరిహారంగా 5 కోట్లు చెల్లుంచాలని లీగల్ నోటిస్ పంపారు. రెండు కోట్లకు 60 లక్షల చొప్పున అయిదు కోట్లకు ఎంత వస్తుందో మరి!
లీగల్ గా ఇళయరాజా గెలుస్తూ ఉండవచ్చు. కానీ… బాలసుబ్రహ్మణ్యానికి లీగల్ నోటిస్ పంపినప్పటినుండి ఆయన పధ్ధతి ఆయన అభిమానులకే నచ్చడం లేదు. ఆ విషయం ఆయనకు తెలుసో! తెలియదో! మనకు తెలియదు.
ఒక నిర్మాత సినిమా సంగీతానికి డబ్బులు చెల్లించాడు. ఈయన అమ్ముకున్నాడు. ఆయన ట్యూన్లను యథాతథంగా, అది కూడా అనుమతి లేకుండా సినిమాల్లో వాడుకున్నప్పుడు న్యాయపోరాటంలో అర్థముందేమో కానీ… ఆయన స్వరపరిచిన రాగంలో ఆ పాటలను ప్రపంచంలో ఎవరూ కచేరీల్లో కూడా పాడకూడదు- అని బాలసుబ్రహ్మణ్యం లాంటి వారిమీద కూడా న్యాయపోరాటాలకు కాలు దువ్వే ఇళయరాజాను ఎలా అర్థం చేసుకోవాలో!
ఇప్పుడు ఇళయరాజా కాపీరైట్ కౌగిలికి దొరికినవారు-
“అబ్బ నీ తీయని దెబ్బ- ఎంత కమ్మగా ఉందిరోయబ్బా!” అని;
దొరకని వారు-
“అరె ఏమైందీ! ఈ మనిషికి?”
అని ఆయన ట్యూన్లలోనే పాడుకుంటున్నారు.
కొస మెరుపు:-
భారతదేశంలో కాపీ రైట్ ఒక బ్రహ్మ పదార్థం. మ్యూజిక్ డైరెక్టర్ కు కాపీ రైట్ వర్తిస్తే… పాట రాసిన రచయితకు, పాట పాడిన గాయకులకు వర్తించదా? ఈ డిజిటల్, కృత్రిమ మేధ యుగంలో కాపీ రైట్ చట్టం మీద ప్రభుత్వాలకే స్పష్టత లేదు. ఇందులో ఎన్ని లొసుగులో? ఎన్నెన్ని చిక్కుముళ్లో!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
(నిజానికి పాట మీద సర్వహక్కులూ నిర్మాతవే, తను డబ్బులిచ్చి తయారు చేయించుకున్న సరుకు పాట… నేను తయారు చేశాను, నేను రంగు పూశాను, నేను మట్టి పిసికాను అంటూ అందరూ రాయల్టీలు డిమాండ్ చేయడమే అబ్సర్డ్… ఇళయరాజా కక్కుర్తి వేషాలు చూస్తూ, వింటూ సినిమా ఇండస్ట్రీ చీదరగా చూసుకునే సిట్యుయేషన్ తనే తెచ్చుకుంటున్నాడు…
మేం ఎన్‌వోసీ తీసుకున్నాం, అన్ని హక్కులూ మ్యూజిక్ కంపెనీకే ఉంటాయి, వాళ్ల దగ్గరే పర్మిషన్స్ తీసుకున్నాం అని అజిత్ సినిమా నిర్మాత క్లారిటీ ఇచ్చాడు… అసలు ఆ రాయల్టీ రూల్స్ మీదే ఈ నిర్మాత కోర్టుకెక్కితే, తాడోపేడో తేలిపోతుంది కదా… ముచ్చట)
Share this Article