.
Subramanyam Dogiparthi …….. లేడీస్ సెంటిమెంట్ కధలు నేయడంలో సిధ్ధహస్తులు ప్రభాకరరెడ్డి . వంద రోజులు ఆడిన ఈ ధర్మాత్ముడు సినిమా కధ కూడా ఆయన వ్రాసిందే .
ఎవరూ లేని ఒంటరి రౌడీకి ఒక డబ్బున్న అమ్మాయి తారసపడటం , ఆస్తినంతా వదులుకుని కట్టుబట్టలతో ఆ రౌడీతో వెళ్ళిపోవడం , ఆ రౌడీని చట్టానికి లొంగేలా సంస్కరించి ప్రయోజకుడిని చేయడం , ఒక్కొక్క అడుగు వేసుకుంటూ జీవితంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందడం…
Ads
తరువాత కుమార్తె ఒక మోసగాడిని ప్రేమించి బయటకు వెళ్లి హింసించబడటం , ఆ వ్యధతో భార్య మరణించడం , విలనాసురుల బారి నుండి అల్లుడిని రక్షించడం , బీదాబిక్కీకి అనాధలకు సాయం చేయడంతో రౌడీగా ప్రస్థానం ప్రారంభించిన రంగడు ధర్మాత్ముడు రంగనాధ్ అవుతాడు . టూకీగా ఇదీ కధ .
బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్న దర్శకుడు బి భాస్కరరావుని ప్రత్యేకంగా అభినందించాలి . రౌడీ కధ అయినా ఢాంఢాంల సౌండ్ ఎక్కువగా లేకుండా నెమ్మదిగా , బోరించకుండా సినిమాను నడిపించాడు దర్శకుడు . మద్దిపట్ల సూరి డైలాగులు బాగుంటాయి .
కృష్ణంరాజు రెబల్ పాత్ర నుండి సాఫ్ట్ పాత్రలోకి ప్రవేశం చక్కగా చేసారు . ఆయన ఎంత ఎత్తుగా ఉంటారో అంత ఎత్తయిన నటనను ప్రదర్శించారు . జయసుధకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . చలాకీ అమ్మాయి పాత్ర నుండి బాధ్యత కల భార్య , తల్లిగా అద్భుతంగా రూపాంతరం చెందుతుంది .
వీరిద్దరి కుమార్తెగా విజయశాంతి . పాత్రోచితంగా నటించింది . మరో ప్రధాన పాత్ర పోలీస్ ఆఫీసర్ గుమ్మడిది . చాలా మంచి పాత్ర . ఉదాత్తమైన వ్యక్తిత్వం కల పాత్ర . ఎప్పటిలాగే చాలా బాగా నటించారు .
ఇతర ప్రధాన పాత్రల్లో రాజేష్ , ప్రభాకరరెడ్డి , ప్రసాద్ బాబు , త్యాగరాజు , అత్తిలి లక్ష్మి , మిక్కిలినేని , సారధి , చలపతిరావు , భీమరాజు , ప్రభృతులు నటించారు .
ఈ సినిమాలో కుక్కలతో ఫైటింగ్ ఒకటి ఉంటుంది . కుక్కల్ని గిరగిరా తిప్పి గొలుసులకు వేలాడదీస్తాడు హీరో . ఇప్పట్లో అయితే సెన్సార్ ఒప్పుకోదు . మనుషులను ఎంత హింసించే సీన్లు ఉన్నా ఒప్పుకుంటారు కానీ , జంతువులను హింసిస్తే అస్సలు ఒప్పుకోరు సెన్సారోళ్లు .
దానికీ ఓ లెక్క ఉంది . జంతువులు నోరు విప్పి చెప్పలేవు కాబట్టి న్యాయవ్యవస్థే వాటి నోరు అయింది . మంచిదే , మంచికే .
సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు కూడా శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా మధ్య వయసులో కృష్ణంరాజు జయసుధల డ్యూయెట్ ఓ గోపమ్మో ఇటు రావమ్మో చాలా చాలా అందంగా చిత్రీకరించాడు దర్శకుడు . యాభై ఏళ్ళు దాటిన వాళ్ళెవరూ పొరపాటున కూడా మిస్ కాకండి . You will love it .
మిగిలిన పాటలు తకధిమి తకధిమితోం కూడా డ్యూయెట్టే . శ్రావ్యంగా ఉంటుంది . శ్రీమంతం నాడు పాడే పాట దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలివ్వాలి మహిళా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతుంది . సెంటిమెంటల్ సాంగ్ కదా ! చిలక పచ్చ చీరె కట్టి , దమ్ముంటే కాసుకోండి పాటలు కూడా థియేటర్లో బాగుంటాయి . పాటలను అన్నీ మైలవలపు గోపియే వ్రాసారు .
ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ మద్రాస్ అన్నా నగర్ లోని టవర్లో తీసారు . చాలా సినిమాల్లో చూసే ఉంటారు . ఈ టవర్ 1968 లో International Industrial Trade Fair అప్పుడు ఐకానిక్ టవరుగా నిర్మించారు . అప్పుడు ముఖ్యమంత్రి అన్నాదురై . అప్పటి ఉప రాష్ట్రపతి వి వి గిరి చేతుల మీదుగా ప్రారంభించబడింది . ప్రఖ్యాత ఇంజనీర్ విశ్వేశ్వరయ్య గారి పేరు పెట్టారు ఈ టవరికి . మళ్ళా సినిమాలోకి వద్దాం .
తెలుగులో సంసారపక్ష విజయాన్ని సాధించిన ఈ సినిమాని తమిళ , కన్నడ , హిందీ భాషల్లోకి రీమేక్ చేసారు . తమిళంలో రజనీకాంత్ , రాధికలు ; కన్నడంలో విష్ణువర్ధన్ , రాధికలు ; హిందీలో జితేంద్ర , జయప్రదలు నటించారు .
1983 సెప్టెంబరు 16న విడుదలయిన ఈ చక్కటి సంసారపక్ష , శాకాహార సినిమా యూట్యూబులో ఉంది . రెబల్ స్టార్ అభిమానులు , జయసుధ అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . చూడతగ్గ సినిమా . A watchable , sentimental , emotional , feel good movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article