.
సినిమాల పరిస్థితి దారుణంగా ఉంది… ఏ స్టార్ సినిమా అయినా థియేటర్లకు రావడం లేదు, షోస్ పడటం లేదు మీకు తెలుసా,,, సెకండ్ షోస్ తీసేశారు…. అంటూ ఫాఫం, నక్కిన త్రినాథరావు అట, నిర్మాత అట… బాగా బాధపడిపోయాడు…
ఈయనే అనుకుంటా ఆమధ్య పాత మన్మథుడు హీరోయిన్ సైజుల మీద రోత కూతలు కూసింది… సరేే, తను చెప్పిన ఈ అంశాలకే పరిమితమై ఓసారి ఆలోచిద్దాం…
Ads
https://x.com/idlebraindotcom/status/1912467489532846306
ఈ పోస్టుకు Srikanth Miryala @miryalasrikanth మెల్‌బోర్న, రచయిత, సైకాలజిస్టు ఇచ్చిన రిప్లయ్ కాస్త ఆలోచనాత్మకంగా ఉంది…
ఓసారి యథాతథంగా చదవండి ఓసారి…
దీనికి చాలా కారణాలున్నాయి.
1. వినోద లభ్యత- మనిషికి కావాల్సింది వినోదం, ఆహ్లాదం. అది మంచిదా చెడ్డదా తర్వాత, కానీ తక్కువ ధరకి శ్రమలేకుండా పొందగలిగేది కావాలి. అదిప్పుడు టీవీలో, సామాజిక మాధ్యమాల్లో విరివిగా లభిస్తోంది. క్రికెట్ మాత్రమే కాకుండా మన భవిష్యత్తుని బ్రతుకుని నిర్ణయించే రాజకీయాలు కూడా ఈ వినోదంలో భాగం అయిపోయాయి.
2. పెరుగుతున్న బిహేవియరల్ వ్యసనాలు- తీవ్రమైన ప్రచారం వలన ఎక్కువ మంది బెట్టింగు ఆపుల్లో కాలం సాగిస్తున్నారు.
3. సంపాదన- ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు పనివేళలు బాగా పెరిగాయి. ఎక్కువమంది కుటుంబానికి కూడా సమయం ఇవ్వకుండా ఆఫీసుల్లో, దుకాణాల్లో మగ్గిపోతున్నారు. వాళ్ళకి సినిమాకి వచ్చేంత తీరిక, ఓపిక లేవు.
4. పెరిగిన సినిమా ధరలు- నేను మొన్న కోర్ట్ సినిమా పాతిక డాలర్లు పెట్టి చూసాను. మా ఇంట్లో పెద్ద టీవీ దాదాపు సినిమాటిక్ అనుభవం వచ్చే సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. దానికి నెట్ఫ్లిక్స్ నెలకి ఏడు డాలర్లు అవుతుంది. నేను ఒక్కరోజులో మూడు సినిమాలు చూసాను అందులో.
5. ప్రమాణాలు లేని తెలుగు సినిమా- అంతా ఒక మూసలో ఉన్నాయి సినిమాలు. కొత్తదనం లేదు. ఎంతసేపూ ఏదో నిరూపిద్దాం అనే ఆలోచన తప్పితే నటిద్దాం, మన్నన పొందుదాం, హృదయానికి హత్తుకునే కథలు తీద్దాం అనిలేదు. నాకు తెలిసి కొత్త ఒరవడికి, కొత్త ఆలోచనలకి బాగా ఇంపర్వియస్ అయిపోయింది తెలుగు సినిమా.
6. ఆకర్షణ లేమి- ట్రైలర్లలో మొత్తం కథ చెప్తున్నారు. ట్రైలరు మొత్తం కూడా చూడలేకపోతున్నారు. ప్రెస్మీట్లు కూడా ఏవో ఎబ్బెట్టు కలిగే ఇబ్బందికరమైన ప్రశ్నలు వెయ్యటం తప్పితే సినిమా మీద ఉత్సుకత కలిగించేలా ఉండటం లేదు.
7. చెరిగిపోయిన హద్దులు- సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు మనిషిలోని మృగత్వ ఆలోచనలని, కోరికలని పరోక్షంగా తీరుస్తాయి, తప్పులేదు (ఉదా, చిరంజీవి రావుగోపాలరావు ని యముడికి మొగుడిలో కొడుతున్నప్పుడు- అది అలా కొట్టు అని అనుకునేవాడ్ని )కానీ తీస్తున్న సినిమాల్లో అసభ్యత, అశ్లీలత, హింస బాగా హద్దుమీరి తీస్తున్నారు. ఇవి కొందరు ఆస్వాదించినా అందరి ముందు థియేటర్లో కూర్చుని చూడటానికి ఇబ్బంది పడుతున్నారు.
8. మూస ధోరణి- ఇప్పుడు ఏ కథానాయకుడిని తీసుకున్నా ఓకే వీళ్లు తీసే సినిమా ఇలా ఉంటుంది, ఈ అంశాలుంటాయి అని చాలా స్పష్టంగా ముందే తెలుస్తోంది, దానివలన పాత సినిమాలే చూసుకోవడం సరిపోతుంది అనుకుంటున్నారు. ఎవరూ కూడా వైవిధ్యం కోసం ప్రయత్నం చెయ్యటం లేదు. వైవిధ్యం కోసం ప్రయత్నం చేస్తే సినిమా పోతుందని అదే మూసలో తీస్తూ మొత్తం సినిమానే ముంచుతున్నారు.
9. మారిన ప్రజా ఆలోచన- ప్రజల్లో కూడా గృహహింస, లింగవివక్ష మొదలైన అంశాల పట్ల బాగా అవగాహన పెరిగింది, దాంతో సమాజ విలువలు కూడా మారతాయి. కానీ అవే పాతకాలపు మిసోగైనిస్టిక్ ఆలోచనలతో సినిమాలు తీస్తున్నారు, డాన్సులు కంపోజ్ చేస్తున్నారు. ఆత్మాభిమానం ఉన్న ఆడవాళ్లు వీటికి దూరంగా ఉంటున్నారు. అలాగే మొన్నటివరకు సౌందర్య లాగా నటనకి ఆస్కారం ఉన్న కథానాయిక పాత్రలు రాయటం మానేశారు.
10. మారిన దృక్పథం- సినిమాలు తీసేవాళ్ళు ఒకప్పుడు సినిమాని కళ గానూ, అలాగే డబ్బు సంపాదించేదిగానూ చూసారు, ఇప్పుడు అదిలేదు. మొత్తం కార్పొరేటైజేషన్ చేసి కళని వేళ్ళతో ఊడబెరికి అవతల పడేశారు.
11. విపరీతమైన ఆలస్యం- ప్రతి సినిమాని చూడటానికి ఎదురుచూసే సమయంలో ఒక స్వీట్ స్పాట్ ఉంటుంది. అది ఒక మూడు నెలలు లేదా ఆరునెలలు ఉండొచ్చు. అంతకుమించి ఆసక్తి ఉండదు. ఈ గ్లిమ్స్, ట్రైలర్లు, సాంగ్స్, టీజర్లు అని నానా చెత్త వదిలి విడుదల తేదీ ఇవ్వకుండా అలా నాన్చుతున్నారు. దాంతో ఉన్న ఆసక్తి కూడా పోతుంది. ఉదా కన్నప్ప సినిమా చూడాలనుకున్నాను, ఇప్పుడు ఆసక్తి పోయింది. ఇప్పుడు ఇలాగే తీస్తే ఒక పెద్ద హీరో వచ్చే పదిహేనేళ్ల కెరీర్లో నాలుగైదు సినిమాలకంటే ఎక్కువ తీయలేరు. ముసలయ్యాక వెనక్కి తిరిగిచూసుకుంటే ఏమీ ఉండదు.
12. ప్రేక్షకుల్ని చులకనగా చూడటం- అత్యాశ పెరిగి అభిమానాన్ని సొమ్ము చేసుకోవాలనుకోవడం. టిక్కెట్టు రేట్లు ఎక్కువ పెరగటం. నెగటివ్ పబ్లిసిటీ మీద పెట్టుబడి పెట్టడం. అలాగే పిల్లలకోసం పూర్తిగా సినిమాలు తీయటం మానెయ్యటం. ఇప్పుడు ఏంటంటే తెలుగు సినిమా కొన ఊపిరితో ఐసీయూలో ఉంది, ఆ ఐసియులో ఉండి సినిమాని బ్రతికిద్దామని సినిమావాళ్లు అందరూ అక్కడే ప్రయత్నిస్తున్నారు, కానీ బయట ప్రేక్షకులు ఇప్పటికే గొయ్యి తీసి పెట్టారు. పూడ్చేస్తే వెళ్లి ఫలహారం తినొచ్చని చూస్తున్నారు….
చివరగా… దిక్కుమాలిన హీరోయిజాన్ని బొందపెట్టండి, కథకు ప్రాధాన్యం ఇవ్వండి, ప్రయోగాలు చేయండి, కొత్తదనం చూపించండి, మూసను వదిలేయండి… సుప్రీమ సూపర్ బంపర్ ఎలివేషన్లకు తెరవేయండి… థియటర్ ఎందుకు బతకదో చూద్దాం…
Share this Article