.
గోపాలక్రిష్ణ చెరుకు…. (9885542509) …… ఇది ఓ 16 ఏళ్ల అమ్మాయి కథ. ఏ రీల్స్ చేస్తూనో, పచ్చళ్ల వీడియోలు చేస్తూనో ఉండే అమ్మాయేమో అని ఊహించుకోకండి… చీకటి బతుకున ఓ వేగుచుక్క కథ!
ఒకవైపు సొసైటీని దోచుకుంటూ తమ అనుకూల మీడియాతో ఆహా ఓహో అని కీర్తింపజేసుకునే తుచ్ఛ నాయకురాలు కూడా కాదు ఆమె…
Ads
అచ్చుగుద్దినట్టుగా.. RRR సినిమాలో చూపించినట్టునే ఉండే ఓ దట్టమైన పచ్చని అడవి. మరోవైపు, అటూ ఇటూ చూస్తూ తుపాకులు మోస్తున్న బ్రిటిష్ సైన్యం చీమల దండులా కదులుతోంది. ఓ వైపు నుండి నెమళ్లు, ఇంకోవైపు జింకలు పరుగెడుతుంటే…
బ్రిటిష్ యాసెంట్ లో వావ్ అంటూ ఓ ఇంగ్లీష్ దొర తన కళ్లు పెద్దవి చేసి చూస్తున్నాడు. అదే సమయంలో, ఒక్కసారిగా వారిపై బాంబుల దాడి… కళ్లు మూసి తెరిచేలోపు వాళ్లు మోసుకొస్తున్న ఆయుధాలన్నీ ఎత్తుకెళ్లారు. ఇదీ 1944 బర్మాలోని దట్టమైన అడవిలో జరిగిన ఓ ఘటన. దీని వెనక ఉండి నడిపించింది ఓ 16 ఏళ్ల ఆడపిల్ల.
అడవి శేషు దర్శకత్వం వహించిన ఓ సినిమాలో యుక్త వయసులో ఉన్న ఓ అమ్మాయి పాకిస్థాన్‌లో గూఢచారిగా పనిచేస్తుంది. అక్కడుండే శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు భారత్‌కు చేరవేస్తుంది. అదంతా సినిమా.
కానీ నిజ జీవితంలో ఓ అమ్మాయి అలాంటి ఉద్యోగం చేయగలదా.. ? చేసింది కాబట్టే మనం ఇప్పుడు ఆమె గురించి చెప్పుకోబోతున్నాం. అవి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతున్న రోజులు. కదన రంగంలో ఓ పదహారేళ్ల అమ్మాయి అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ యంగ్ అండ్ డైనమిక్ ఏజెంట్ పేరే… సరస్వతీ రాజమణి!
నేతాజి సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరి.. భారత స్వాతంత్ర్యం కోసం ఏజెంట్‌గా పనిచేసింది సరస్వతీ రాజమణి. సరిగ్గా పదిహేనేళ్లు కూడా నిండకముందే నేతాజి సిద్ధాంతాలకు ఆకర్షితురాలైన తాను.. రంగూన్ ప్రాంతంలో ఓ మంచి డబ్బున్న కుటుంబంలో లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ పెరిగిన అమ్మాయి.
కానీ ఆమె ఆలోచనలు మాత్రం దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేలా చేశాయి. కట్ చేస్తే, ఆ తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని మహిళా విభాగం రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో గూఢచారిగా చేరింది. ఆ తర్వాత ఆమె ఆపరేషన్స్ బ్రిటిషర్లను ముప్పుతిప్పలు పెట్టాయి. ఆ ఏజెంట్ సరస్వతి చేసిన ఓ పనే మనం ఈ కథలో మొదట చదివిన ఘట్టం!
ఇలాంటివి ఎన్నో సాహసమైన ఆపరేషన్స్‌కు కీలక మాస్టర్ బ్రెయిన్ సరస్వతి. ఆమె చర్యలతో తమ రహస్యాలు బయటకు ఎలా వెళ్తున్నాయో తెలియక బ్రిటిషర్లు తలలు బద్దలు కొట్టుకున్నారు. కానీ అంతటి ఏజెంట్ సరస్వతి గురించి మన చరిత్ర పుస్తకాల్లో ఒక్క పేజీ కూడా లేదు. అందుకున్న అనేక కారణాల గురించి సబ్జెక్ట్ ను పక్కదారి పట్టించడం ఇప్పుడు అనవసరం!
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీ సంస్దలు ఇప్పుడు తీస్తున్న సిరీస్‌ల్లో ఇలాంటి యంగ్ లేడీ ఏజెంట్ క్యారెక్టర్ల స్టోరీస్ మనమెన్నో చూడగల్గుతున్నాం. అందులో రియల్ స్టోరీస్ తో పాటు, కాల్పనిక కథలూ ఉంటాయి. కానీ, ఇక్కడ సరస్వతీ రాజమణి నాటి ఓటీటీలు లేని కాలంలో మన గడ్డపై ప్రదర్శించిన సాహసం, త్యాగం అంతకుమించినది.
సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫౌజీ ఆనవాళ్లు భవిష్యత్తులో ఎక్కడా కనిపించకూడదనే నాటి పాలకులు తీసుకున్న నిర్ణయమో, ఏమో గానీ… అలాంటి చరిత్రలు మన సినిమాలుగా, సీరీస్ లుగా ఇంకా విస్తృతం కావడం లేదు. దీంతో పాటుగా, నాటి యుద్ధ సమయంలోని రికార్డులు చాలావరకు నాశనమయ్యాయనీ అంటారు.
సరే, కారణాలు ఏవైనా.. 1990లో ఓ జర్నలిస్ట్ బయటపెట్టేంతవరకు ఆమె ఎక్కడ ఉందన్నది ఎవరూ ఆరా తీయలేదు, ఎవరికీ తెలియలేదు. భారతావనికి స్వాతంత్ర్యం వచ్చాక చెన్నైలో స్థిరపడింది సరస్వతీ రాజమణి.
దేశానికి స్వాతంత్ర్య వెలుగులు వచ్చాయి కానీ.. ఈ ధీరవనిత జీవితం మాత్రం స్వాతంత్ర్యం వచ్చిన ఆ సంబరాల నీడలోనే గడిచిపోయింది. ఆఖరికి ఆమె 2019లో మరణించినప్పుడు కూడా ఆమె గురించి కొద్దిమందికి మాత్రమే తెలవడం మరో విషాదం.
ఏజెంట్ సరస్వతీ రాజమణి దేశం కోసం తన విలువైన యుక్తవయస్సును త్యాగం చేసింది. కానీ తన గొప్పతనం, తాను చేసిన త్యాగం మాత్రంం తాను ఎవరికీ చెప్పుకోలేదు.
ఎందుకంటే వారికి కావాల్సింది ఆడంబరం కాదు.. దేశ స్వాతంత్ర్యం మాత్రమే! కానీ, అలాంటి వారి గురించి చెప్పడం సహచరులు, మీడియా సంస్థల కనీస బాధ్యత!
Share this Article