.
రాజకీయాలు, దౌత్య సంబంధాలు, టారిఫ్ వార్లు, ట్రంపు పైత్యాలు, విదేశీ విధానాలు వంటి పెద్ద పెద్ద పదాల్ని కాసేపు వదిలేద్దాం… అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉష, పిల్లలతోపాటు ఇండియా టూర్ గురించి మాట్లాడుకుందాం…
ఉషా వాన్స్… చిలుకూరు ఉష… అచ్చమైన తెలుగు మహిళ… పుట్టింది అమెరికాలోనే, కానీ ప్యూర్ తెలుగు కుటుంబంలో… ఆమెకు ఈ పర్యటన ఓ మురిపెం… పుట్టింటికి వస్తున్నంత సంబురం…
Ads
ఓ అగ్ర దేశపు ఉపాధ్యక్షుడి భార్యగా, తన ముగ్గురు పిల్లలతో పుట్టింటి నేలపై సంబరంగానే అడుగుపెట్టింది… ఎంత మెటీరియలిస్టిక్ అయినా తెలుగు రక్తం కదా, ఓ ఎమోషన్ ఉంటుంది… అందుకే…
తన పిల్లలకు ఇండియన్ డ్రెస్సులు తొడిగింది,.. చంటి దాన్ని చంకనేసుకుని భర్త (తెలుగు అల్లుడు కదా, తప్పదు), పక్కన తను… అక్షరధామ్ పోతుంది, ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్ చూపిస్తుంది పిల్లలకు, మొగుడికి… అంతెందుకు..? ఏకంగా మోడీని కలుస్తుంది…
కొన్ని ఎమోషన్స్‌కు అక్షరరూపం ఇవ్వలేం… నిజానికి ఓ ఉపాధ్యక్షుడి అధికారిక పర్యటన అప్పుడెప్పుడో 13 ఏళ్ల క్రితం జో బైడెన్ వచ్చిన తరువాత మళ్లీ ఇదేనట… కమలా హారిస్ మొన్నటిదాకా సెకండ్ లేడీయే… కానీ ఇండియా రాలేదు తను…
నిజానికి ఆమె రూట్స్ తమిళనాడులో ఉన్నా సరే… ఆమె రక్తం ప్యూర్ భారతీయం కాదు, ఆమె పెద్దగా తన ఇండియన్ రూట్స్ గురించి మురిపెంగా చెప్పుకున్నదీ లేదు… ఆమె తండ్రివి జమైకన్ రూట్స్… తల్లి మరణించేముందు తన అస్థికల్ని చెన్నై సమీపంలోని సముద్రంలో కలపాలని కోరుకున్నది కాబట్టి, తల్లి ఆత్మ శాంతి కోసం చెన్నై వచ్చింది అప్పుడెప్పుడో కమల…
(ఆమధ్య 95 ఏళ్ల వయస్సులోనూ ఫిజిక్స్ పాఠాలు చెప్పే శాంతమ్మ గురించి చదువుకున్నాం కదా… ఈ ఉషకు ఏమవుతుంది అంటారా..? వరుసకు మనమరాలు అట… శాంతమ్మ మరిదికి ఉష మనమరాలు… ఉష నేటివ్ పామర్రు…)
2014లో పెళ్లి చేసుకున్నారు వాన్స్, ఉష… స్వచ్ఛమైన హిందూ పద్ధతిలో పెళ్లికి వాన్స్ అంగీకరించాడు… పెళ్లి తరువాత కూడా ఎవరి మతాచరణ వాళ్లదే… ఆమె ప్రాక్టీసింగ్ హిందూ… సంతానంలో ఒకరికి వివేక్ అని పేరు పెట్టుకుంది… మిగతా ఇద్దరు ఇవాన్, మిరబెల్… ఆయనేమో రోమన్ కేథలిక్… ముగ్గురు పిల్లలకు రెండు మతపద్ధతులూ నేర్పిస్తున్నారు…
ఉష తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు క్రిష్ణ (క్రిష్ చిలుకూరి)… హైదరాబాద్ నుంచి అమెరికా వలస వెళ్లిన కుటుంబం… ఆమె బంధుగణం ఇప్పటికీ ఆమెతో టచ్‌లో ఉన్నారో తెలియదు, ఎవరెవరు ఆమెను కలుస్తారో తెలియదు గానీ… తన దేశం అనే భావన ఉందామెలో… అందుకే వాన్స్‌కు తొలిసారిగా పుట్టింటికి తోడ్కొని వచ్చింది, పిల్లలతోసహా…
లోకేష్, ఆమె అమరావతి వస్తుందో రాదో, మీరు పిలిచారో లేదో తెలియదు గానీ… ఆ బ్రాహ్మణిని దేవాంశ్‌తోసహా తీసుకుపోయి, ఢిల్లీలోనే ఓ మాంచి పట్టుచీర ఇచ్చి ఆడపడుచు మర్యాదలు చేసి, అక్కడే ఏపీ భవన్‌లో కమ్మ ని తెలుగు భోజనం పెట్టించి రావచ్చు కదా… కనీసం అడిగావా లేదా..!!
Share this Article