.
ఓ సందేహం… చట్టాలను తుంగలో తొక్కి, ఓ జర్మన్ పౌరుడినీ, అదీ పదే పదే తను జర్మన్ పౌరుడిని కాను, ఇండియన్ పౌరుడినేనని అబద్ధాలు చెప్పి, తెలంగాణ సమాజాన్ని మోసగించిన, కోర్టులను తప్పుదోవ పట్టించిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ను తెలంగాణ జనం మీద రుద్దినందుకు కేసీయార్ తెలంగాణ సమాజానికి క్షమాపణ ఏమైనా చెబుతాడా..?
ఎట్టకేలకు హైకోర్టు ఈ కేసును తేల్చేసింది కదా… రమేష్ జర్మనీ పౌరుడేనని చెప్పేసింది కదా… అంతేకాదు, 30 లక్షల జరిమానా వేసి, అందులో 25 లక్షల్ని ఈ కేసులో అలుపెరగకుండా పోరాడిన ఆది శ్రీనివాస్‌కు, మరో 5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి చెల్లించాలని ఆదేశించింది… గుడ్, ఎట్టకేలకు న్యాయం గెలిచింది…
Ads
ఇది తేల్చడానికి 15 ఏళ్లు పట్టింది… హైకోర్టుకూ సుప్రీం కోర్టుకూ నడుమ… విదేశాంగశాఖ రిపోర్టులు అటూఇటూ… లాయర్లకే కోట్లు ఖర్చు పెడుతూ, ఏళ్లుగా వ్యాజ్యాన్ని అటూఇటూ తిప్పుతూ తన తప్పును కప్పిపుచ్చుకుని, మొత్తం న్యాయవ్యవస్థనే తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు తప్ప తన న్యాయపోరాటంలో వీసమెత్తు న్యాయం, నిజాయితీ లేకుండా పోయింది…
భారతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించిన సదరు మాజీ ప్రజాప్రతినిధి ఇన్నేళ్లుగా పొందిన జీతభత్యాల మాటేమిటి…? అసలు 30 లక్షలు కాదు, తనకు ఈ శిక్ష సరిపోతుందా..?
కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ తన రాజకీయ అవసరాల కోసమే పోరాడి ఉండవచ్చుగాక… కానీ నిజమేమిటో బయటపడటానికి, బీఆర్ఎస్ చేసిన తప్పును జనానికి స్పష్టం చేసేందుకు దోహదపడ్డాడు… ఇదే బీఆర్ఎస్ అదే చెన్నమనేని మీద పోరాడుతున్నందుకు ఎన్నిరకాల అవస్థలకు గురిచేశారో తనకే తెలుసు…
చెన్నమనేని దొరవారు మాజీ ప్రభుత్వ వ్యవసాయ రంగ సలహాదారు అట… ఇదుగో ఇలాంటివాళ్లను నెత్తిన మోసి… (విధేయతా..? సామాజికవర్గమా..? ఏది అర్హత..?) తెలంగాణ ప్రజల మీద ఆయన ప్రాతినిధ్యాన్ని రుద్దిన పాపం కేసీయార్‌దే కదా… మరి క్షమాపణ చెబితే తప్పేమిటి..? హుందాగా ఉంటుంది కదా…
ప్రతి చిన్న విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి, రచ్చ రచ్చ చేసే బీఆర్ఎస్ క్యాంపు ప్రస్తుతం సైలెంటు… ఎఐ ఫోటోలు, ఎడిటెడ్ వీడియోలు, పెయిడ్ క్యాంపెయిన్లే కాదు… సొసైటీ అంటే కోర్టులు, ప్రజాకోర్టులు, పోరాటాలు అన్నీ ఉంటాయి…
సదరు చెన్నమనేని దొరవారు కరోనా కాలంలో జర్మనీలో ఉండి 11 నెలలపాటు తెలంగాణ ప్రజల సొమ్ము వేతనంగా పొందాడు… తను ఎంతకాలం ఎమ్మెల్యేగా ఉన్నాడో, అదంతా లెక్కతీసి, తెలంగాణ ప్రజల ఖజానా నుంచి వేతనం రూపేణా తీసుకున్నాడో అదంతా తను తెలంగాణ సమాజానికి ఇచ్చేస్తే సదరు చెన్నమనేని దొరతనంలో నిజాయితీ ఉన్నట్టు లెక్క… మరి ఆది శ్రీనివాస్ ఈ డిమాండ్ ఎందుకు చేయడం లేదో..!!
Share this Article