జూనియర్ బచ్చనంత పాప్యులారిటీ లేకున్నా ది బిగ్ బుల్ సినిమా కన్నా… ప్రతీక్ గాంధీ నటించిన స్కామ్ 1992 వెబ్ సీరీస్ ఎందుకు బాగుందంటే… వంద కారణాలు కనిపిస్తాయి. రెండింటికీ స్ఫూర్తి బిగ్ బుల్ హర్షద్ మెహతానే. మరెందుకు అభిషేక్ బచ్చన్ ది బిగ్ బుల్ కన్నా… ప్రతీక్ గాంధీ స్కాం 1992కు ప్రశంసలు దక్కుతున్నట్టు…? ఇదే నిజమని… ఇలాగే అందరూ ఆలోచించాలని… అనుకోవాలని కాకుండా ఓ కోణంలో జరిగిన విశ్లేషణగానే చూడాలని కోరుతూ…
స్టాక్ మార్కెట్… షేర్స్ హైకింగ్… బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులను ఆసరా చేసుకుని తారుమారు చేసే విధానాలు… దేశం మొత్తాన్ని కదిలించి చర్చోపచర్చలకు కారణమైన కోట్ల విలువైన సెక్యూరిటీ కుంభకోణాల కుట్ర కేసులు… వీటిగురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా యావత్ భారతం మొత్తం మాట్లాడుకునే ఆద్యులు హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ వంటివాళ్లేననేది జగమెరిగిన సత్యం.
అయితే అలాంటి స్కామ్స్, క్రైమ్సే మన నేటి సినిమాకైనా… సీరిసులకైనా.. హాట్ టాపిక్స్. అగో అలాంటి కోవకు చెందినవే మనం
చెప్పుకునే రీసెంట్ గా హాట్ స్టార్ వేదికగా రిలీజైన ది బిగ్ బుల్ సినిమా… అంతకుముందు సోనీ లివ్ నుంచి వచ్చిన స్కామ్ 1992 సీరిస్. వేటికవే ప్రత్యేకమైనవే అయినప్పటికీ… రెండింటికీ సుచేతా దలాల్ అనే జర్నలిస్ట్ తన భర్త దేబాషిష్ బసుతో కలిసి రాసిన “‘ది స్కామ్… ‘ ఫ్రమ్ హర్షద్ మెహతా టూ కేతన్ పరేఖ్” పుస్తకమే మూలంగా గోచరిస్తుంది.
Ads
హాట్ స్టార్ వేదికగా విడుదలై హేమత్ దేశాయ్ పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించి… మరో నటుడు అజయ్ దేవగణ్ నిర్మించి… కుకీగులాటీ దర్శకత్వంలో తెరకెక్కిన ” ది బిగ్ బుల్ ” చిత్రం కన్నా… సోనీలివ్ వేదికగా జై మెహతాతో కలిసి, హన్సల్ మెహతా తెరకెక్కించిన ” స్కామ్ 1992″ యే బాగా ఆకట్టుకుంది.
ది బిగ్ బుల్ సినిమాలోని హేమంత్ దేశాయ్ పాత్రకైనా… స్కామ్ 1992లో హర్షద్ మెహతా పాత్రకైనా స్ఫూర్తి నాడు సంచలనంగా మారి… నేటికీ హాట్ టాపిక్ గానే కొనసాగుతున్న బిగ్ బుల్ హర్షద్ మెహతా పాత్రనే స్ఫూర్తి. అయితే హర్షద్ మెహతా పాత్రలో ది బిగ్ బుల్ సినిమాలో అభిషేక్ బచ్చన్ కన్నా… స్కామ్ 1992 వెబ్ సీరీస్ లో ప్రతీక్ గాంధీనే హైలైట్ గా చేశాడన్నది రెండింటినీ పోల్చిచూసినప్పుడు మాత్రం అనిపించకమానదు. అంతేకాదు… నాడు హర్షద్ మెహతా వంటి స్టాక్ బ్రోకర్స్ కుంభకోణాలను 1992లో వెలుగులోకి తెచ్చిన ఫైనాన్షియల్ జర్నలిస్ట్ సుచేతా దలాల్ పాత్రలో ది బిగ్ బుల్ లో మీరారావుగా నటించిన ఇలియానాలో అంత జీవం, పటుత్వం కనిపించకపోవడం… ప్రేక్షకులను ఓ ఫైనాన్షియల్ అఫైర్స్ చూసే జర్నలిస్ట్ గా నమ్మించలేకపోవడం పెద్ద మైనస్. అదే సమయంలో స్కామ్ 1992లో మన హైదరాబాదీ, వరంగల్ నిట్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రేయాధన్వంతరీ.. సుచేతా దలాల్ పాత్రలో తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్న తీరు.. ఆమె ఆ పాత్రపై చేసిన హోంవర్క్ ను కళ్లకు కడుతూ హైలైట్ గా నిల్చింది.
రిస్క్ హైతో ఇష్క్ హై అంటూ స్కామ్ 1992లో ప్రతీక్ గాంధీ చెప్పే డైలాగులకు తగ్గట్టుగా అతను షేర్ మార్కెట్లో నిచ్చెనమెట్లు ఎక్కడానికి పడే కష్టాన్ని సీరిస్ లో కళ్లకు కట్టే యత్నం జరగ్గా… ది బిగ్ బుల్ లో మాత్రం జూనియర్ బచ్చన్ క్యారెక్టరైజేషన్ ను మల్చిన తీరులో మాత్రం అది ముమ్మాటికీ లోపించినట్టే కనిపిస్తుంది. కేవలం రోటీన్ హీరోయిజం తాలూకూ ఫార్మూలానే జొప్పిస్తూ… అభిషేక్ కేవలం సంజ్ఞలతోనే స్టాక్ మార్కెట్ అనే పరమపద సోపానపటంలో ఇంతింతై అంతెత్తెక్కుతున్న దశలో పాముల్లా అడ్డువచ్చే అవరోధాలను కూడా ఫ్లాట్ గా చూపించిన స్క్రీన్ ప్లే.. సినిమాపై దర్శకుడి చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేసే విషయమే. హేమంత్ షా, ప్రియాషా పాత్రలో నటించిన నికితా దత్తా మధ్య ప్రేమాయణం వంటి సీన్స్ కూడా కొంత కృతకంగానే కనిపిస్తాయి.
మొత్తంగా 1980, 90ల కాలంలో స్టాక్ మార్కెట్ రారాజుగా వ్యవహరించిన హర్షద్ మెహతా నుంచి కేతన్ పరేఖ్ వరకూ వారు షేర్ మార్కెట్ లో ఏవిధంగా వడివడిగా ఎదిగారో చూపించే ప్రయత్నంగానే ది బిగ్ బుల్ సినిమా, స్కాం 1992 వెబ్ సీరిస్ రెండూ సెల్యూలాయిడ్ కెక్కాయి. అయితే స్కాం 1992 వెబ్ సీరిస్ లో మనకు నాటి రోజులను కాస్త లోతుగా చూపించినట్టుగా… దర్శకుడు హన్సల్ మెహతా ఎక్సర్ సైజ్ స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో ది బిగ్ బుల్ డైరెక్టర్ కుకీ గులాటీ మాత్రం ఎందుకనో అంత లోతుగా స్టాక్ మార్కెట్ రారాజుల కథను స్పృషించలేకపోయారనేది రెండింటినీ పోల్చుకున్నప్పుడు గోచరిస్తుంటుంది. మరోవైపు ది బిగ్ బుల్ గా అభిషేక్ బచ్చన్ కూడా హర్షద్ పాత్రను సమర్థవంతంగానే పోషించే యత్నం చేసినప్పటికీ… కొన్నిసార్లు జూనియర్ బచ్చన్ సైకో నవ్వుల తీరు కొంత కృతకంగా కనిపించి.. ఇంతవసరమా అని సగటు ప్రేక్షకుడికనిపించే విధంగా ఉంటుంది. పైగా పూర్తి స్థాయిలో హర్షద్ పాత్ర చిత్రణపై దృష్టి సారించిన దాఖలాలు కూడా కనిపించకపోగా.. హేమంత్ షా పాత్రలోనూ… గతంలో మణిరత్నం సినిమా గురులోని గురుకాంత్ దాస్ పాత్రనే తలపిస్తున్నట్టుగా బచ్చన్ యాక్షన్ సీన్స్ అప్పుడప్పుడూ అనిపిస్తుంటాయి. ది బిగ్ బుల్ లో హేమంత్ షా పాత్రలో నటించిన బచ్చన్ తమ్ముడు వీరెన్ షాగా సోహుమ్ షా పాత్ర.. ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో అవసరమైనప్పుడు ఓ సోదరుడుంటే ఎలా ఉంటుందో తెలియజెప్పేదిగా కనిపిస్తుంది. అయితే స్కామ్ 1992లో హర్షద్ మెహతా అన్నయ్య అశ్విన్ మెహతాగా హేమంత్ ఖేర్ పాత్రతో పోల్చినప్పుడు కూడా మళ్లీ బిగ్ బుల్ లో వీరేన్ షా పాత్రపై పైచేయిగానే కనిపిస్తుంది.
మొత్తంగా అభిషేక్ బచ్చన్ నటించిన ది బిగ్ బుల్ ఓ రెండున్నర గంటల సినిమా అయితే… పది ఎపిసోడ్ లతో నిర్మించిన సీరిస్ స్కామ్ 1992. కాబట్టి సీరిస్ లో చర్చించినంత లోతుగా సినిమాను మల్చలేనప్పటికీ… ఈ రెండూ కూడా ఒక సాధారణ గుజరాతీ అయిన హర్షద్ మెహతా అనే ఓ సేల్స్ మ్యాన్ ముంబాయి సబర్బన్ ప్రాంతంలో ఉంటూ.. తన జీవిత ఎదుగుదలపై అసంతృప్తితో.. సోదరుడు ఎక్కడైతే డబ్బు పోగొట్టుకున్నాడో అదే స్టాక్ మార్కెట్ లోకి ఎంటరై… సొంతంగా కన్సల్టెన్సీ ఏర్పాటు చేసుకుని బిగ్ బుల్ గా ఎలా ఎదిగాడన్న కథనాన్ని చూపించే ప్రయత్నమే తెరపైకెక్కిన ది బిగ్ బుల్, స్కాం 1992 కథలు.
మొత్తంగా ది బిగ్ బుల్ సినిమా అయినా… స్కాం 1992 సిరీసైనా.. హర్షద్ మెహతా నుంచి కేతన్ పరేఖ్ వరకూ భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థల్లోని లోపాలు, లొసుగులనుపయోగించుకుని… బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో స్టాక్ బ్రోకింగ్ లో కనబర్చిన వివేకం… అదే ఆ తర్వాత రాను రాను అత్యాశగా మారి క్షీణదశకు చేరే దుస్థితి వంటివాటిని చర్చిస్తాయి. అయితే అటు సినిమాలోనూ… ఇటు సీరిస్ లోనూ హర్షద్ మెహతానైనా… కేతన్ పరేఖ్ నైనా… హీరోగా అభివర్ణించుకుంటారా… లేక క్రిమినల్ గా భావిస్తారా అనేది మాత్రం ప్రేక్షకులకే వదిలిపెట్టే జస్టిఫికేషన్ మొత్తంగా కొసమెరుపు.
- రమణ కొంటికర్ల… ✍️
Share this Article