.
కాలి చెప్పులే చతుస్సాగర పర్యంత ధరాతలాన్ని పద్నాలుగేళ్ళు పాలించిన పుణ్యభూమి మనది. అయితే అది త్రేతాయుగం. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. కాబట్టి గురువు కాలి చెప్పులను విద్యార్థులు నెత్తిన పెట్టుకుని మోశారు.
ఇది కలియుగం. ఇప్పుడు సెల్ ఫోనే చతుస్సాగర పర్యంత ధరాతలాన్ని పరిపాలిస్తోంది. అలాంటి సెల్ ఫోన్ ను లాక్కుంటే… టీచర్ ను చెప్పుతో కొట్టింది ఒక విద్యార్థిని. (ఇలా రాయడానికి కూడా సిగ్గుగా, అవమానంగా ఉంది. కానీ తప్పడం లేదు)
Ads
కాలంతోపాటు ధర్మం మారుతుంది. గురువులో బ్రహ్మ, విష్ణు, శివులను చూసే కాలాలు కావివి. గురువుకు బహువచనం అనవసరమనుకున్న విద్యార్థులు ఏకవచనంతో సరిపెడుతున్నారు. నిర్వచనాలకు అందని ఏదో ఒక వచనం ఉంది కదా! అనుకుని గురువులు సర్దుకుపోతున్నారు. అయినా విద్యార్థుల కళ్ళు చల్లబడలేదు.
దేవుడికన్నా దెబ్బే గురువు. చిన్నప్పుడు అజ్ఞానం వల్ల దెబ్బల విలువ తెలుసుకోలేరు. మన చేత అక్షరాలు దిద్దించినవి దెబ్బలే. మార్కులు సరిగ్గా రాకపోతే శిక్షించినవి దెబ్బలే. క్లాసుకు ఆలస్యంగా రాకుండా క్రమశిక్షణలో పెట్టినవి దెబ్బలే. అల్లరి చేస్తే దండించినవి దెబ్బలే. స్కూళ్లలో పిల్లలను టీచర్లు కొడితే ఇప్పుడు హత్యానేరంలా మారి… విడ్డురంగా ఉంది కానీ… నాలుగయిదు దశాబ్దాల క్రితం అయ్యవారి చేతి ఆభరణం బెత్తం.
దెబ్బలు తినని బాల్యం ఉంటుందా? ఉంటే అది బాల్యం అయి ఉంటుందా?
ఇదంతా గతం.
ప్రస్తుతంలోకి వస్తే…
విజయనగరం జిల్లా రఘు ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలోకి వెళదాం. క్లాసులో ఒక విద్యార్థిని సెల్ ఫోన్ చూస్తోంది. టీచర్ సెల్ ఫోన్ లాక్కుంది. క్లాసయ్యాక బయట… నా అత్యంత విలువైన పన్నెండు వేల సెల్ ఫోన్ లాక్కుంటావా? అని టీచర్ ను ఏకవచనంతో సంబోధిస్తూ తెలుగులో రాయకుడని తిట్లు తిడుతూ… నిజంగానే కాలి చెప్పు చేతికి తీసుకుని… టీచర్ ను కొట్టింది.
దీని మీద ఆ టీచర్ ఫిర్యాదు చేశారా? కాలేజీ యాజమాన్యం ఏ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది? కనీసం తరువాతైనా ఆ అమ్మాయి టీచర్ కు క్షమాపణ చెప్పిందా? పోనీ, ఆ టీచర్‌తోనే రాజీనామా చేయించారా? లాంటివి ప్రస్తుతానికి అనవసరం.
సెల్ ఫోన్/ సామాజిక మాధ్యమం నేటి తరాన్ని ఎక్కడిదాకా తీసుకెళుతోందో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ.
ఫోన్ లాక్కుంటే చెప్పు తెగుతుందన్న ఎరుకతో టీచర్లు వారి పరిధిలో వారు చెప్పు దెబ్బలు తినకుండా జాగ్రత్తగా ఉండడానికి పెద్ద ఉదాహరణ!
పాపం… ఆ కాలేజీ పెట్టిన ఇన్నేళ్ళలో ఎప్పుడూ ఇంత పబ్లిసిటీ రాలేదేమో! అత్యుత్తమ విద్యార్థులతోనే వార్తల్లో ఉండాల్సిన అవసరం లేదు. చెప్పు చేతబట్టి టీచర్లను కొట్టే ఇలాంటి అత్యధమ విద్యార్థుల వల్ల కూడా ఆ విద్యాసంస్థ వార్తల్లో ఉండవచ్చు!
“అల్పబుద్ధివాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడి కుక్క చెరుకు తీపెరుగునా?
విశ్వదాభిరామ వినుర వేమ!”
- పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article