.
Subramanyam Dogiparthi …… సినిమా ప్రారంభంలోనే మయసభలో దుర్యోధనుడి ఏకపాత్రాభినయం . అదీ యన్టీఆరే . ఆ డైలాగుల్లో రాజసూయ యాగానికి వ్యతిరేకంగా , ఆ యాగం ప్రజాకంటకమైన చర్యగా చెప్పబడుతుంది .
హీరోయిన్ రాధ గ్రీన్ రూంలో దీనిని పాయింట్ అవుట్ చేసినప్పుడు దుర్యోధనుడు సామ్యవాది , సంస్కర్త అని కితాబు ఇస్తాడు తను .అప్పుడలా దుర్యోధనుడిని కీర్తించినా చెల్లింది… ఇప్పుడైతే కొందరు అస్సలు ఊరుకోరు… సరే, సినిమాలోకి వద్దాం .
Ads
యన్టీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు నటించిన ఆఖరి సినిమా ఈ చండశాసనుడు . అందుకే రాజకీయ ఉపన్యాసాలు , వినాయకుల ప్రస్తావనలు చాలా ఉంటాయి . అంతే కాదు ఎరుపు సినిమా కూడా . క్లైమాక్సులో సామ్యవాదమే గెలిచిందనే డైలాగ్ కూడా ఉంటుంది యన్టీఆరుకు .
వర్గ పోరాటం , అంటరానితనం , లెఫ్ట్ vs రైట్ చర్చలు పుష్కలంగా ఉంటాయి ఈ సినిమాలో . మనుషులంతా ఒక్కటే , సర్దార్ పాపారాయుడు వాసనలు బాగా కనిపిస్తాయి .
ఈ సినిమా ఊర్వశి శారదకు మంచి పేరు తెచ్చింది . విషాద పాత్రలకు , సానుభూతి పాత్రలకు చిరునామా అయిన శారద యన్టీఆర్ అంతటి చండశాసనుడికి ధీటుగా నటించటం , జనాన్ని మెప్పించడం చిన్న విషయం కాదు . ఆమె కృతకృత్యురాలు అయింది . విషాదం నుండి రౌద్రం , భీభత్సం వైపు చోటుచేసుకున్న ఆమె నట ప్రయాణంలో ఇది మరో మెట్టు అనవచ్చు .
యన్టీఆర్ స్వంత బేనర్లో , స్వీయ దర్శకత్వంలో 1983 లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రిలీజయిన ఈ చండశాసనుడు జనానికి బాగా నచ్చింది , బాగానే ఆడించారు జనం . వంద రోజుల పోస్టర్ పడింది . చండశాసనుడి గెటప్పులో యన్టీఆర్ , భువనేశ్వరి పాత్రలో శారద గెటప్ చాలా బాగుంటాయి . బాగా డిజైన్ చేయబడ్డాయి .
గ్లామర్ హీరోయిన్ రాధకు యన్టీఆరుతో ఇదే మొదటి సినిమా . డైలాగులను తెలుగులో చెప్పేందుకు యన్టీఆర్ బాగా సహకరించారట . ఇతర ప్రధాన పాత్రల్లో జగ్గయ్య ,అన్నపూర్ణ , రావు గోపాలరావు , రాళ్ళపల్లి , సత్యనారాయణ , చలపతిరావు , జయమాలిని , కవిత , ప్రభృతులు నటించారు .
సినిమాలో పాటలన్నీ హిట్టే . బాగా పాపులర్ కూడా అయ్యాయి . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో సి నారాయణరెడ్డి వ్రాసిన అన్ని పాటలూ బాగుంటాయి . దేశమంటే మట్టి కాదోయ్ అంటూ సాగిన పాటలో పేదల కష్టాలు , కార్మికుల వెతలు వంటి అంశాలతో హీరోయిన్ రాధకు తలంటి పోసే పాట అది .
మరో పాట జగ్గయ్య , శారద , కామ్రేడ్స్ కాగడాల ఊరేగింపులో వచ్చే ఎరుపు పాట . జనం తిరగబడుతోంది అంటూ సాగుతుంది . నైనా నందకుమారా అంటూ యన్టీఆర్ చిన్ని కృష్ణుడిలాగా స్నానం చేస్తున్న అమ్మాయిల చీరెలెత్తుకెళ్ళినప్పుడు పాట రాధ , యన్టీఆర్ మధ్య ఉంటుంది .
మరో పాట సుకు సుకు సుకుమారీ డ్యూయెట్ బాగుంటుంది . చిన్నారి సీతమ్మ శీమంతమంట అని మరో టీజింగ్ సాంగ్ కూడా సరదాగా సాగుతుంది . అన్నాచెల్లెళ్ళ అనుబంధం అంటూ ఒక రిపీట్ సాంగ్ చిత్రీకరణ బాగుంటుంది . రక్తసంబంధం సినిమారో యన్టీఆర్ , సావిత్రిలు ఒకేసారి చనిపోయినట్లు ఈ సినిమాలో కూడా అలాగే క్లైమాక్సులో అన్నాచెల్లెళ్ళు చనిపోతారు .
ప్రత్యేకంగా చెప్పవలసింది జయమాలిని రెండు పాటల గురించి . కేవలం డాన్సర్ పాత్ర కాదు ఆవిడది ఈ సినిమాలో . ఫుల్ లెంగ్త్ పాత్రే . సంసార పక్షం , అసంసార పక్షం రెండూ కలబోసిన పాత్ర . వాడా వాడా తెలిసింది నాకీడొచ్చందని చాలా ఎనర్జిటిక్ గా నటించింది .
దీని కన్నా బాగుంటుంది మరో డాన్స్ . పైగా అది శాస్త్రీయ నృత్యం . ఎంత టక్కరి వాడవే నా మోహన రంగా పాటలో జయమాలిని డాన్స్ అదిరిపోతుంది . అన్ని పాటల్లోకి ఇదే హైలైట్ . పొరపాటున కూడా మిస్ కాకండి . యల్ విజయలక్ష్మి మళ్ళా డాన్స్ చేసిందా అని అనిపిస్తుంది . లిరిక్సును కూడా రెడ్డి గారు బాగా వ్రాసారు .
యన్టీఆర్ ద్విపాత్రాభినయం , సామ్యవాదం సామాజిక న్యాయం వంటి కేకలు అరుపులు , శ్రావ్యమైన పాటలు , వెరశి యన్టీఆర్ సినిమా . జనానికి నచ్చిన సినిమా . యూట్యూబులో ఉంది . యన్టీఆర్ , శారద అభిమానులు తప్పక చూడవచ్చు .
జయమాలిని అభిమానులు మాత్రం ఆమె డాన్సించిన రెండు పాటల్ని అస్సలంటే అస్సలు మిస్ కాకండి .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article