.
మీ పేస్టులో ఉప్పుందా? పప్పుందా? బొగ్గుందా? లాంటి జ్ఞానసంబంధమైన మౌలికమయిన ప్రశ్నలు వాణిజ్య ప్రకటనల్లో వింటూ ఉంటాం. ఈ ప్రశ్నలు పైకి పిచ్చిగా, అర్థం లేనివిగా అనిపించినా… ప్రకటన తయారు చేసినవారి ఉద్దేశం నిజంగా మనల్ను పిచ్చోళ్లను చేయడమే.
“మీరు కడుపుకు అన్నమే తింటున్నారా?”
అని అడగ్గానే ఒక్కసారిగా మనం సిగ్గుతో తలదించుకుంటాం. హీరోయిన్ చెప్పే అనంత ఉప్పుజ్ఞానం ఇన్నాళ్లుగా మనం పొందనందుకు నిలువెల్లా కుమిలిపోతాం. పశ్చాత్తాపంతో వెంటనే రోజుకు హీన పక్షం రెండు కేజీల ఉప్పు తినాలని ఉప్పు సంకల్పం చెప్పుకుంటాం.
Ads
ఈలోపు ఇంకెవరో “మీ పళ్ళపొడిలో బొగ్గు లేదా? అయితే మాడి మసై… బొగ్గయిపోతారు” అనగానే అప్పటికప్పుడు కట్టెలు కాల్చుకుని బొగ్గులు నములుతూ ఉంటాం.
… అలా తాజాగా మనం రోజూ వాడే టూత్ పేస్టుల్లో లోహాలున్నాయని అమెరికాలో ఒక పరిశోధనలో బయటపడింది. తినే ఆహారంలో విటమిన్లు, లోహాలు ఉంటే మంచిదని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు కదా? అలాంటప్పుడు పళ్ళు తోమే టూత్ పేస్టులో కూడా లోహాలుంటే ఇంకా మంచిది కదా! అనుకుంటే పప్పులో కాలేసినట్లే.
దాదాపుగా పేరున్న అన్ని బ్రాండెడ్ టూత్ పేస్టుల్లో ఉన్నది సీసం, ఆర్సెనిక్, పాదరసం, కాడ్మియం లాంటి హానికర లోహాలు. వీటితో పళ్ళు తోముకుంటే పళ్ళెంత నిగనిగలాడతాయో తెలియదు కానీ… ఆ లోహాలు నోటిని, నోటిగుండా వెళ్ళి శరీరంలోని ఇతర అవయవాలను పాడు చేస్తున్నాయి.
మోతాదుకు మించి టూత్ పేస్టుల్లో ఉన్న సీసం వల్ల చిన్న పిల్లల్లో మెదడు, కిడ్నీలు, గుండె దెబ్బ తినే ప్రమాదం ఉంది. సీసంతో పాటు ఆర్సెనిక్, కాడ్మియం భార లోహాల వల్ల పెద్దవారిలో గొంతు నొప్పి, వాంతి అవుతున్నట్లు అనిపించడం, గొంతులో గరగర, గొంతు తడారిపోవడం లాంటి లక్షణాలు ఎక్కువవుతున్నాయి.
పేస్టు ఎక్కువ రోజులు నిలువ ఉండడానికి, తోమిన వెంటనే పళ్ళు తళతళలాడడానికి వాడే రసాయనాలే మన కొంప ముంచుతున్నాయని శాస్త్రీయంగా రుజువయ్యింది.
అందుకే హాయిగా ఇదివరకు వేపపుల్ల, పొట్టు కాల్చిన బూడిద, బొగ్గుతో పళ్ళు తోమేవారు. ఇప్పుడంతా నాజూకు. రంగు ముఖ్యం. తెల్లగా ఉన్న పేస్టులో ఎన్నెన్ని విష రసాయనాలో! ఆరోగ్యాన్ని పాడు చేసే రసాయనాలతోనే ఓం ప్రథమంగా మన రోజు మొదలవుతోంది.
… అయినా ఇదంతా అమెరికాలో కదా! మన పేస్టులు భద్రమే కదా! అని అనుకుంటే భారత టూత్ పేస్టుల కంపెనీలు పళ్ళికిలిస్తూ పడీ పడీ నవ్వుకుంటాయి. మన దగ్గర పేస్టుల్లో కూడా అవే రసాయనాలు. అమెరికాలో ఆహార, ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటిస్తేనే అలా అఘోరించింది.
మన దగ్గర ఆ ప్రమాణాలు కాగితాలకే పరిమితం. ఆ లెక్కన మన టూత్ పేస్టుల్లో ఏయే రసాయనాలున్నాయో ఆవిష్కరించగలిగితే… కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ నౌకలకు నౌకల రసాయనాలను దిగుమతి చేసుకునే శ్రమ తగ్గుతుంది.
… అన్నన్ని రసాయనాలు మన కడుపులో ఉండగా…మన శరీరం ఇంకా మన మాట వింటుండం మనకే ఆశ్చర్యంగా ఉంటుంది!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
(పెద్ద ప్రయాస అక్కర్లేదు… ఎక్కడికో వెళ్లి కొనుక్కోనక్కర్లేదు… ఏ అమెజాన్‌లోనే బొగ్గుపొడి దొరుకుతుంది… ఇంట్లోని కాసింత ఉప్పును కూడా కలిపి, మెత్తగా చేసుకుని వాడండి… గార పోవడమే కాదు హానికరమైన వైరస్, బ్యాక్టీరియా, ఇన్‌ఫెక్షన్లు కూడా దూరం…)
Share this Article