.
…. (రమణ కొంటికర్ల) ….. ఆసక్తి ఉండాలి. ఆ దిశగా పిల్లల్లో అవగాహన కల్పించాలిగానీ.. అద్భుతాలు సాధిస్తారు. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది మన తెలుగమ్మాయి ప్రవళిక. పదో తరగతికి కూడా చేరుకోకుండానే… తొమ్మిదో తరగతి వరకే ఆన్ లైన్ లో 175 కోర్సులను పూర్తి చేసి పిట్ట కొంచెమైనా చేత ఘనమనిపిస్తోంది ప్రవళిక.
భీమిలీలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చదువుతోంది ప్రవళిక. ఆంధ్రప్రదేశ్ లోని కోనెంపల గ్రామానికి చెందిన 15 ఏళ్ల బండారు ప్రవళికకు కొత్తవి నేర్చుకోవడం ఇష్టం. సహజసిద్ధంగా ఏర్పడ్డ ఆ కుతూహలానికి తోడు కస్తూర్బా పాఠశాలలోనూ ఉపాధ్యాయులు వివిధ అంశాల పట్ల కల్పిస్తున్న అవగాహన తోడైంది.
Ads
సుమారు 8 వేల 800 ఆన్ లైన్ కోర్సులను నేర్పించే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ద్వారా ఏకంగా తొమ్మిదో తరగతి వరకే ప్రవళిక 175 ఆన్ లైన్ కోర్సులను నేర్చుకుని ఇప్పుడు రికార్డులకెక్కింది.
పదో తరగతంటే కాస్త పిల్లల్లో వణుకుండటం సహజం. ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్స్ పేరిట విద్యార్థులకు ఇక అప్పటివరకూ ఉన్న స్వేచ్ఛ కాస్తా మెల్లిమెల్లిగా హరించుకుపోతుంది. అదే సమయంలో ఒత్తిడి, పోటీ కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ కు ముందే తొమ్మిదో తరగతి వరకే ప్రవళిక తన ఇష్టాలకనుగుణంగా 175 ఆన్ లైన్ కోర్సులను నేర్చుకుని వాటికి సర్టిఫికెట్స్ అందుకుంది.
రోబోటిక్స్, ఏఐ వంటి టెక్నికల్ అంశాల నుంచి మొదలుకుంటే సమయపాలన, కెరీర్ గ్రోత్ వంటి సామాజిక ఎదుగుదలలో కీలకమైన వివిధ సబ్జెక్ట్స్ ను ఎంచుకుని ఆన్ లైన్ కోర్సుల ద్వారా వాటిల్లో నైపుణ్యం సాధించింది. అందుకోసం రోజుకు 3 నుంచి 8 గంటల వరకు పరిస్థితులను బట్టి సాధన చేసింది.
ఈమధ్యే పదో తరగతి ఫలితాలు విడుదలైన సందర్భంగా ప్రవళిక సక్సెస్ స్టోరీ వెలుగులోకొచ్చింది. ప్రవళికకు ఈ ఏడు ఎస్సెస్సీ ఫలితాల్లో భాగంగా 600 మార్కులకుగాను 557 మార్కులు వచ్చాయి. ఒకవైపు అకడమిక్ స్టడీస్ లో తలమునకలవుతూనే.. లౌక్యంగా భవిష్యత్ ప్రపంచం వైపు అడుగులు వేసేందుకు కావల్సిన జనరల్ నాలెడ్జ్ ను కూడా ప్రవళిక సంపాదించుకుంటున్న తీరు నేటి విద్యార్థీ లోకానికి కచ్చితంగా ఆదర్శం.
ప్రవళికకు చిన్ననాటే తండ్రి చనిపోవడంతో.. ఒంటరి తల్లి దగ్గర ఆమె బాధలు చూస్తూ పెరిగింది. జీవితంలో చాలా కఠినమైన పరిస్థితులను చూస్తూ, సవాళ్లనెదుర్కొంటూ పెరిగిన ప్రవళికకు కేజీబీవీ మరో కొత్త ప్రపంచాన్ని చూపించింది. అక్కడికెళ్లాక కేవలం అకడమిక్ చదువులు, ఆన్ లైన్ చదువులతో జనరల్ నాలెడ్జ్ కు సంబంధించిన అంశాల పట్ల మాత్రమే కాకుండా.. క్రీడల్లోనూ ఆసక్తి కనబర్చింది.
తన పాఠశాల క్రికెట్ జట్టుకు ప్రవళిక కెప్టెన్. టెన్నిస్ బాల్ క్రికెట్ లో రాష్ట్ర స్థాయి పతకాలు సాధించింది ప్రవళిక. అందుకే ఆమె స్టోరీ డిస్నీ హాట్ స్టార్ వంటి ఓటీటీలనూ ఆకర్షించి.. ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూను ప్రసారం చేశారు ఆ మాధ్యమం ప్రతినిధులు. వర్తమాన ప్రపంచానికి తగ్గట్టుగా, భవిష్యత్ భారతానికి అనుగుణంగా ఆమె వేస్తున్న అడుగులను అక్కడి ప్రభుత్వం కూడా అభినందించింది.
కేజీబీవీ పాఠశాలలో కేవలం అకడమిక్ చదువులకు మాత్రమే పరిమితం కాకుండా… వారికి కావల్సిన జనరల్ నాలెడ్జ్ పైనా దృష్టి పెడుతూ నైపుణ్యం కల్గిన విద్యార్థుగా వారిని తీర్చిదిద్దే యత్నం జరుగుతోంది. అందులో ప్రవళిక వంటి ఆసక్తికరమైనవారే గనుక వాటిని తమకనుకూలంగా మల్చుకుంటే.. ఎన్నో విజయాలు వరిస్తాయనేందుకు సదరు ప్రవళికే ఓ ఉదాహరణ.
ఇప్పుడు ఆన్ లైన్ ఆమె చేసిన 175 కోర్సులతో సాధించిన సర్టిఫికెట్స్, ఆమెకొచ్చిన పేరుతో.. మరో 18 మంది విద్యార్థినులు ఆమె బాట పట్టారు.
ఉదయం యోగా నుంచి మొదలుకుంటే జీవితంలో ఉపయోగపడే ప్రతీ పనినీ ఎంత బాగా చేయగలమనే ఒక ఫోకస్ తో ప్రవళిక వంటి తొమ్మిదో తరగతి జర్నీలో కనిపించడం విశేషం.
సాధారణంగా అకడమిక్ ఫలితాల్లో టాప్ మార్క్స్ వస్తేనేగానీ ప్రముఖ కళాశాలల్లో ఉచిత విద్యనందించరు. కానీ, ప్రవళిక ప్రతిభకు మెచ్చిన శ్రీ చైతన్య విద్యాసంస్థ ఇప్పుడామెకు ఇంటర్ లో ఉచితంగా సీటు ఇచ్చింది. బీటెక్ లక్ష్యంగా.. ఆ తర్వాత సివిల్స్ లక్ష్యంగా ఒక పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్న ప్రవళిక సక్సెస్ స్టోరీ… పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా కచ్చితంగా నేటి విద్యార్థీలోకమందరికీ ఓ దారిదీపం…
Share this Article