.
[ – వరుణ్ శంకర్ ] స్విమ్ సూట్ వేసుకున్న తొలి భారతీయ సుందరి ఆమె…
ప్రపంచంలోని అతిలోక సుందరీమణులను ఒక్కచోట చేర్చి కనులపండువ చేసేదే మిస్ వరల్డ్ ఈవెంట్. సౌందర్యారాధకులకే కాదు, రసాత్మక హృదయమున్న ప్రతీ ఒక్కరికి ఈ ఈవెంట్ ఒక పండుగ.
Ads
భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే, ఈ ప్రపంచం అలుపూసొలుపూ లేకుండా అందం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మిస్ వరల్డ్ పోటీలు అందగత్తెను ఎంపిక చేయడం వరకే పరిమితం కాదు. దాని చుట్టూ ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది.
అంతేకాదు, నవ యువతరాన్ని అందాల లోకం వైపు నడిపిస్తుంది. అందాల పోటీలతో ఆడదాన్ని అంగడి సరుకుగా మారుస్తున్నారని గగ్గోలు పెట్టే అభ్యుదయ వాదులు- చివరకు పోటీల్లో ఎవరు గెలిచారో.. ఎలా గెలిచారో.. తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారట.
ఈ పోటీలకు ఉన్న స్పెషాలిటీ అదే. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మరిన తర్వాత, అందాల పోటీలపై గుర్తించదగిన వ్యతిరేకత కనిపించడం లేదు. పైగా ఇంటర్‌నెట్ జమానాలో ఈ పోటీలకు వ్యూయర్‌షిప్ పెరిగిపోయింది. ‘అందమా అందుమా..’ అంటూ అందరూ జైకొడుతున్నారు. ఇది కాలం తెచ్చిన అనివార్యమైన మార్పు.
హైదరాబాద్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీలు ఇప్పుడు హాట్ టాపిక్. 140 దేశాల నుంచి సుందరీమణులు కిరీటాన్ని గెలుచుకునేందుకు పోటీపడబోతున్నారు. మే 31న హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలే. ఇండియా తరపున పాల్గొంటున్న రాజస్థాన్ భామ నందిని గుప్తా అందమేపాటిదో, అదృష్టమేపాటిదో ఆ రోజు తేలుతుంది. సరే, దీనినలా ఉంచుదాం…
మిస్ వరల్డ్ అనగానే ఐశ్వర్య రాయ్ గుర్తుకువస్తుంది. 1994లో ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని గెల్చుకుంది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగి తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకుంది. బచ్చన్ ఇంటి కోడలైంది. ఇది చరిత్ర.
అయితే ఐశ్వర్యరాయ్‌కి మూడు దశాబ్దాల ముందే చరిత్రను సృష్టించిన భారతీయ సుందరి ఒకరున్నారు. ఇప్పటి తరాలకు ఆమె ఎవరో బహుశా తెలియకపోవచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి మాత్రం ఆమె పేరు చిరపరిచితమే అయి ఉంటుంది.
రీటా ఫారియా.. 1966లో మిస్ వరల్డ్‌గా గెలుపొందిన తొలి భారతీయ సుందరి. ఒక్క భారతదేశమే కాదు, ఆసియా ఖండం నుంచే గెలుపొందిన తొలి మహిళ ఆమె. ఆధునికత మీద, అందం మీద ఇండియాలో అంతర్జాతీయ స్పృహ అంతంతమాత్రంగానే ఉన్న ఆ రోజుల్లో రీటా ఫారియా మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకోవడం మామూలు విషయం కాదు.
మిస్ వరల్డ్ పోటీలు 1951లో ప్రారంభమయ్యాయి. ‘ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్’లో భాగంగా లండన్‌లో మొదలుపెట్టిన ఈ పోటీలు ఏడు దశాబ్దాలుగా నిరాఘాటంగా కొనసాగుతున్నాయి. మొదటి మిస్ వరల్డ్‌గా ‘మిస్ స్వీడన్’ కికి హాకన్సన్ గెలుపొందింది. అప్పటికి ఇండియా నుంచి ఈ పోటీల్లో ప్రాతినిథ్యం లేదు.
ఆధునికతను అందిపుచ్చుకునే ప్రయత్నాలు తొలి దశలోనే ఉండటంతో అప్పటి యువతరం ఈ పోటీలపై దృష్టి పెట్టలేదు. అయితే ముంబై (నాడు బాంబే/బొంబాయి)లో కొంత పాశ్చాత్య సంస్కృతిని అనుకరించే ధోరణులు మొదలయ్యాయి. బాలీవుడ్‌కు పునాదులు పడుతున్న క్రమంలో అందాల తారల ప్రభావం యువతపై పెరగడం మొదలైంది.
రీటా తల్లిదండ్రుల స్వస్థలం గోవా కాగా, ఆమె పుట్టి పెరిగిందంతా బాంబేలోనే. బాంబేలోని గ్రాంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలో రీటా అందాల పోటీలపై మక్కువ పెంచుకుంది. ఈ క్రమంలోనే 1966లో ఆమె మిస్ బాంబేగా ఎంపికైంది.
అటు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా, ఇటు సినిమా పరిశ్రమకు కేరాఫ్‌గా బాంబే ఎదుగుతున్న క్రమంలో అక్కడి సంస్కృతి, అలవాట్లు, వేషధారణ చిన్నతనంలోనే రీటాపై ప్రభావం చూపాయి. దీంతో ఆధునిక జీవనశైలిని, వేషభాషలను ఆమె సునాయసంగా అందిపుచ్చుకోగలిగింది. ఈ అంశాలన్నీ ఆమెను మిస్ వరల్డ్ పోటీలకు నామినేట్ అయ్యేలా చేశాయి.
1966లో 66 దేశాలకు చెందిన సుందరీమణులు మిస్ వరల్డ్ టైటిల్ కోసం పోటీ పడ్డారు. వేదిక.. బ్రిటన్ రాజధాని లండన్. అనేక వడపోతల తర్వాత రీటా ఫారియా ఫైనల్స్‌కు చేరింది. ఫైనల్స్‌లో జడ్జిలు ఆమెను ‘మీరు డాక్టర్ ఎందుకు కావాలనుకుంటున్నారు..’ అని ప్రశ్నించారు.
తన చిన్ననాటి కల అనో, ఫలానా వాళ్లు ప్రేరణ అనో ఆమె చెప్పలేదు. ‘భారతదేశానికి స్త్రీ వైద్య నిపుణుల అవసరం ఎంతో ఉంది.. అందుకే నేను వైద్య విద్యను చదువుతున్నాను..’ అని బదులిచ్చింది. ఆమె సహజమైన, పరిపక్వమైన సమాధానానికి జడ్జిలు ముగ్ధులయ్యారు.
మిస్ వరల్డ్ పోటీల నినాదమైన ‘బ్యూటీ విత పర్పస్’కు సరిగ్గా సరిపోవడంతో, ఆమెను మిస్ వరల్డ్ గా ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటికి రీటా వయస్సు 23 ఏళ్లు. ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థిని. రెండో స్థానంలో మిస్ గ్రీస్ నిలవగా, రీటాకు 2500 పౌండ్స్‌ను ప్రైజ్ మనీగా అందించారు.
5 ఫీట్ల 8 ఇంచుల ఎత్తుగల రీటా… తన అందంతోనే కాదు, ఆలోచనలపరంగా మెచ్యూరిటీతో, ఆధునికతతో అందరినీ ఆకట్టుకుంది. ఇక్కడొక విషయం చెప్పాలి.. ప్రధానమైన మిస్ వరల్డ్ పోటీకి అనుబంధంగా మరికొన్ని పోటీలు కూడా ఉంటాయి.
‘బెస్ట్ ఇన్ స్విమ్‌సూట్’, ‘బెస్ట్ ఇన్ ఈవెనింగ్ వియర్’ అంశాల్లో కూడా రీటా టాప్‌గా నిలిచింది. స్విమ్ సూట్‌లో జడ్జిలను ఎలాగైతే మెప్పించిందో.. భారతీయతకు ప్రతిబింబమైన చీరకట్టులోనూ అంతేస్థాయిలో మెప్పించింది.
చీరకట్టు ధరించే ఆమె ‘బెస్ట్ ఇన్ ఈవెనింగ్ వియర్’ బహుమతిని గెలుచుకుంది. స్విమ్ సూట్ ధరించిన తొలి భారతీయ సుందరిగా ఆమె ఆనాటి యువతరాన్ని ఆకట్టుకుంది. పొడుగు కాళ్ల సుందరిగా హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పటికీ రీటాను స్విమ్‌సూట్ సుందరిగా గుర్తుపెట్టుకుంటారు.
రీటా ఫారియా ఒక్క ఇండియా నుంచే కాదు, ఆసియా ఖండం నుంచే మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి యువతిగా రికార్డులోకి ఎక్కింది. రీటా ఒక శకానికి నాంది పలికింది. ఆమె మిస్ వరల్డ్‌గా ఎంపికైన నాటి నుంచి బ్యూటీనెస్ అనేది పరిశ్రమగా మారి కార్పొరేట్‌లుక్‌ను సంతరించుకుంది.
విచిత్రం ఏమిటంటే రీటా మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత, అందానికి సంబంధించిన వస్తువుల వ్యాపారమైతే పెరిగింది గానీ, ఇండియా నుంచి 28 ఏళ్ల వరకు మరొకరు మిస్ వరల్డ్ కాలేకపోయారు. 1994లో ఐశ్వర్యరాయ్ టైటిల్ గెలుచుకొని, రెండో సుందరీమణిగా తెరపైకి వచ్చింది.
ఆ తర్వాత 1997లో డయానా హైడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ మిస్ట్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు. 2025 పోటీల్లో ఇండియా నుంచి నందిని గుప్తా పోటీపడుతోంది.
రీటా ఫారియా 1966లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత మోడలింగ్, సినిమా రంగంలో ఎన్నో అవకాశాలను వచ్చినా వాటిని నిరాకరించింది. లండన్‌లోని కింగ్స్ కాలేజీ హాస్పిటల్‌లో ఉన్నత వైద్యవిద్యను పూర్తి చేసింది.
1966 నుంచి 67 వరకు మిస్ వరల్డ్ హోదాలో ఎక్కడికి వెళ్లినా రీటా చీరకట్టునే ధరించి భారతీయతను చాటిచెప్పింది. ఆమె తన ప్రపంచ యాత్రలో భాగంగా సౌత వియత్నాంలో అమెరికా సైనికులను కలుసుకోవడం వివాదాస్పదమైంది.
అప్పుడు వియత్నాంతో అమెరికా యుద్ధం జరుపుతోంది. భారతదేశం ఆనాడు వియత్నాంకు మద్దతుగా ఉండటంతో రీటా యాత్ర వివాదాస్పదమైంది. ఈ విషయంపై రాజ్యసభలోనూ చర్చ జరిగింది. అప్పుడు అదొక సంచలనం.
అందం గురించి రీటా చెప్పిన మాటలు ఔరా అనిపిస్తాయి. ‘శారీరక అందం అనేది జనటికల్ అదృష్టం.. ఆదర్శనీయమైన లక్షణాలు, లక్ష్యాలతో దానిని మరింత ద్విగుణీకృతం చేసుకోవచ్చు..’ అని చెబుతారు. రీటా వయస్సు ఇప్పుడు 82 ఏళ్లు. ఐర్లాండ్‌లో ఆమె మనవరాళ్లతో కాలక్షేపం చేస్తోంది. ముదిమి వయస్సులోనూ తనదైన ఆకర్షణతో ఆమె అందరినీ ఆకట్టుకుంటోంది.
మిస్ వరల్డ్ కిరీటాన్ని ప్రపంచంలో అత్యధికంగా గెలుచుకున్నవి రెండు దేశాలు మాత్రమే. ఒకటి వెనిజుయెలా అయితే, రెండోది ఇండియా. ఈ సారి ఇండియా గెలుచుకుంటే అత్యధికంగా గెలుచుకున్న దేశంగా, అందాలభామల నిలయంగా పేరు పొందుతుంది. భిన్న సంస్కృతులు, అద్భుతమైన చర్రితే కాదు, భారతావనికి ‘అందమైన’ వారసత్వం కూడా….
Share this Article