.
Bharadwaja Rangavajhala ….. మే నాలుగు దాసరి బర్త్ డే … పుట్టిన రోజు గ్రాండ్ గా జరుపుకోడం ఆయనకు అలవాటు. ఉదయం నుంచీ రాత్రి వరకు ఎవరో ఒకరు వచ్చి బర్త్ డే విషస్ చెప్తూనే ఉండేవారు.
ఆ సందర్భంగా ఆయన కాంపౌండులోనే పుస్తకావిష్కరణలు జరిగేవి. చిన్న పాటి సభలూ జరిగేవి. సినిమా ప్రముఖులే కాదు … రాజకీయ, పత్రికా రంగాలకు చెందిన పెద్దలు కూడా వచ్చి దాసరికి శుభాకాంక్షలు చెప్పి వెళ్లేవారు. వెళ్లకపోతే ఏమవుతుందో అనుకుని వెళ్లేవారూ ఉండేవారనుకోండి …
Ads
పరిశ్రమకు దాసరి చాలా చేశారు. చాలా మందికి సహాయం చేశారు. చాలా మందిని ఇబ్బంది పెట్టారు. టేకిట్ గ్రాంటెడ్ అనే పద్దతిలో వెళ్లి భారీ దెబ్బలు తిన్నారు.
పత్రికా రంగంలోనూ ఆయన జండా ఎగరేశారు. ఉదయం దిన పత్రి,క బొబ్బిలిపులి రాజకీయవార పత్రిక, శివరంజని, మేఘసందేశం లాంటి సినిమా పత్రికలూ ఆయన ఆధ్వర్యంలో నడిచినవే. అవన్నీ సక్సస్ ఫుల్ గా లాంఛ్ అయినవే …
ఆ సమయానికి మార్కెట్లో ఉన్న పత్రికలకు గట్టి పోటీ ఇచ్చినవే … అయితే దాసరి స్టైల్ కు సెట్ అవక దెబ్బతిన్నాయి. ఆ క్రమంలో దాసరి రాజకీయాల్లోకీ వెళ్లారు. అక్కడా పరిమితమైన విజయమే ఆయన సాధించింది.
చిత్ర పరిశ్రమలో ఏ ఇష్యూ జరిగినా దాసరి జోక్యంతోనే అది పరిష్కారం అవుతుందనే పాపులార్టీ సంపాదించారు. అదే ఏరియాలో మానిప్లేటర్ అనే పేరూ సంపాదించుకున్నారు.
పరిశ్రమకొచ్చి దాసరి బోల్డు సంపాదించారు. ఇంకా బోల్డు పోగొట్టుకున్నారు. ఒక ఫ్యాక్టరీలా సినిమాలు తీశారు. ఎవరికి ఏమిచ్చారనేది పక్కన పెడితే అందరికీ ఎప్పుడూ పనుండేలా చూశారు.
ఆయన తొలి రోజుల్లో మాత్రమే దర్శకుడు. ఆ తర్వాత సినిమా కాంట్రాక్టరు అవతారం ఎత్తారు. చాలా సందర్భాల్లో నిర్మాతలను డమ్మీలుగా చేసి మరీ తన హవా నడిపించారు. ఆ క్రమంలోనే బోల్డు అపప్రథనూ మూటకట్టుకున్నారు.
దాసరి మంచి ఆర్గనైజరు. ఎవరి దగ్గర ఏ విద్య ఉందో ఆయనకు బాగా తెల్సు. ఎవరితో ఏ పని చేయించుకోవాలో ఆంతకన్నా మా బాగా తెల్సు. అది ఆయనకు చాలా విజయాలను అందించింది. అందుకే తెలుగు సినిమా రంగంలో దాసరికి సాటి వచ్చే వారెవరూ కనిపించరు.
దాసరి మంచి స్కీమరు అన్న వాళ్లూ ఉన్నారు. అదే నోటితో దాసరి పరమ అరాచకుడు అన్నోళ్లూ ఉన్నారు. మంచీ చెడూ కలిస్తేనే మడిసి అని రమణగారు అన్నట్టు … దాసరి మంచిగా కనిపించే చెడ్డవాడు … చెడ్డగా అనిపించే మంచివాడు … వెరసి మంచి మడిసి …
అదో రకం అమాయకుడు. భోళా. ఆయనే చెప్పుకున్నట్టు… దాసరి మంచి తండ్రి కాలేకపోయినా .. మంచి గురువనిపించుకున్నారు. ఇండస్ట్రీ అంతా గురువుగారూ అని పిల్చేంతగా తన ముద్ర వేసేశారాయన. వెళ్ళిపోయినా ఇండస్ట్రీలో గురువుగారు అంటే ఆయనే… దాసరిలేరు నీకెవ్వరూ…
Share this Article