.
( రమణ కొంటికర్ల ) …. సాధారణంగా ఓ ప్రభుత్వాసుపత్రి అంటే రోగులు, వైద్యులు, నర్సులు, స్ట్రెచర్స్, స్కానింగ్ రూమ్స్ , మందులు, ఎవ్వరిని చూసినా మూతులకు మాస్కులు.. సర్వసాధారణంగానైతే, ఇదిగో ఇలాంటి వాతావరణం చూస్తాం. కానీ, సంబరాలు, డ్యాన్సులు, భాజాభజంత్రీలు ఎక్స్పెక్ట్ చేయగలమా..? కానీ, విధి ఆడే వింత నాటకం ఏదైనా చేయిస్తుంది. అందుకే, మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వాసుపత్రి పెళ్లి వేదికైంది.
రాజ్ గఢ్ జిల్లాకు చెందిన ఆదిత్య సింగ్, నందినీ సోలంకి వివాహం గత నెల 30వ తేదీన బుధవారం రోజున అక్షయతృతీయ రోజు జరగాల్సి ఉంది. కానీ, సోలంకి తీవ్రమైన అస్వస్థతతో బాధపడుతూ మంచం పట్టింది. ఆసుపత్రికి తరలించక తప్పని పరిస్థితి నెలకొంది. దాంతో ఆమె స్వస్థలం కుంభరాజ్ ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో బినాగంజ్ కు తరలించారు.
Ads
అక్కడా క్యూర్ కాకపోవడంతో ఏకంగా ఆమె స్వస్థలం కుంభరాజ్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బియోరాకు తరలించి అక్కడి ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి చికిత్సనందించారు. కానీ, అప్పటికప్పుడు సోలంకి ఆరోగ్యం కుదుటపడుతున్నా.. ఆమెకు బెడ్ రెస్ట్ కచ్చితమని తేల్చేశారు వైద్యులు.
సో, డిశ్చార్జ్ చేయడం సాధ్యం కాదన్నారు. దాంతో ఆదిత్యసింగ్ తో కలలుగన్న తన సాంప్రదాయబద్ధమైన వివాహం అక్షయ తృతీయ నాడు జరగడమంటే ఒక్కమాటలో చెప్పాలంటే అసాధ్యం. ఒకవేళ ఆ అక్షయ తృతీయ రోజు వారు పెళ్లి చేసుకోకపోతే.. వారి వివాహానికి మరో రెండేళ్లు ఆగితేనేగానీ శుభముహూర్తాల్లేవు.
దాంతో ఆదిత్యసింగ్, నందినీ సోలంకి ఆ ఇద్దరి కుటుంబాలూ ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చాయి. వివాహం కోసం సోలంకిని పెళ్లిమంటపానికి తీసుకురాలేమేమోగానీ… పెళ్లిమంటపాన్నే సోలంకి దగ్గరకు తీసుకువెళ్లగలం కదా అనే ఆలోచన చేశారు.
తమ ఆలోచనను సదరు ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపారు. అక్షయ తృతీయ సెంటిమెంట్ తో పాటు.. ఆరోజు పెళ్లి వాయిదా పడితే వివాహానికి ముహూర్తాలు లేని పరిస్థితిని వైద్య బృందానికి అర్థం చేయించారు. దాంతో ఆసుపత్రి సిబ్బంది పెళ్లికి ఓకే చెప్పింది.
ఇంకేం బియోరా ప్రభుత్వాసుపత్రిలోని ఔట్ పేషంట్ విభాగం మొత్తం పెళ్లి మండపంలా ముస్తాబు చేశారు. ఆదిత్యసింగ్ బారాత్ తో వచ్చి సందడి చేశాడు. మరీ ఆడంబరంగా కాకుండా… కాస్త నిరాడంబరంగానే పెళ్లి వేదికను అలంకరించినా… అప్పటివరకూ వైద్యులు, నర్సులతో హడావిడిగా… రోగులు, వారి బంధువుల కుటుంబాల హాహాకారాలు, ఆవేదనతో దుఖభరితంగా కనిపించిన ఆ ఔట్ పేషంట్ విభాగం కొత్త రూపు, నూతన కళ సంతరించుకుంది.
అయితే, ఆసుపత్రిలో ఇన్ పేషంట్స్ ను డిస్టర్స్ చేసేలా.. అక్కడికి వివిధ సమస్యలు, రోగాలతో వచ్చేవారిని ఇరిటేట్ చేసేలా కాకుండా… ఎలాంటి బిగ్గరతనం లేని ఒక వేడుకను ప్లాన్ చేశారు.
అలా బియోరా ప్రభుత్వాసుపత్రిలోని ఔట్ పేషంట్ విభాగం పెళ్లివేడుకకు వేదికైంది. తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో వివాహ క్రతువును ప్రారంభించారు. వైద్యులు, నర్సులే పెళ్లి పెద్దలయ్యారు. వరుడు ఆదిత్యసింగ్ పెళ్లికూతురు సోలంకిని ఎత్తుకుని పెళ్లిపీటలపై కూర్చోబెట్టగా.. వారిపై పెళ్లి పెద్దలు పూలవర్షం కురిపించారు. మరోవైపు అగ్నిసాక్షిగా హాస్పిటల్ వేదికగా ఆదిత్యసింగ్, సోలంకి ఏడడుగుల వివాహబంధంతో ఒకటయ్యారు.
వారి పెళ్లి వేడుక వీడియో కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతూ వైరలవుతోంది. ప్రేమ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఆ కొత్త పెళ్లి జంటను ఆశీర్వదిస్తుంటే.. మరికొందరు ఎమోజీస్ తో తమ ప్రతిస్పందనను తెలియపరుస్తున్నారు.
వారం క్రితం విషమ పరిస్థితిలో మూడు ఆసుపత్రులు మారి చివరకు బియోరా ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సోలంకి ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడటంతో పాటు.. ఆ పెళ్లి వేడుక ఆమెలో మరింత బలాన్ని నింపిందంటోంది బియోరా ఆసుపత్రి వైద్యబృందం…
Share this Article