.
చాన్నాళ్లయింది తెలుగులో ఓ మ్యాగజైన్ చదివి… నవ్య, జ్యోతి, ఆంధ్రభూమి, చతుర, విపుల ఎట్సెట్రా మాసపత్రికలు, వారపత్రికలు మూతపడ్డాక… మార్కెట్‌లో మిగిలింది స్వాతి మాత్రమే అనుకుంటా…
పాఠకులు కూడా వేరే ప్రత్యామ్నాయం లేక… ఇంకా డిజిటల్ పఠనం వైపు మళ్లని పాఠకులు దినపత్రికల సండే మ్యాగజైన్లను కొంటున్నారు… ఆదివారం రాగానే నాలుగైదు దిన పత్రికలు కొంటే… నాలుగైదు పత్రికలు పస్ల్ మ్యాగజైన్లు వస్తున్నాయి… కథలే గాకుండా వర్తమాన వ్యవహారాలపై వ్యాసాలు, ప్రత్యేక కథనాలు కూడా ఉంటాయి… అంతా అప్‌డేటెడ్ కంటెంట్…
Ads
చాలామంది కథకులు, రచయితలు కూడా… పబ్లిష్ చేసే పత్రికలు తక్కువైపోయి డిజిటల్ మ్యాగజైన్లకు పంపిస్తున్నారు తమ కథల్ని అనివార్యంగా… పర్లేదు, కథలు కూడా కాస్తో కూస్తో బాగానే ఉంటున్నాయి దినపత్రికల సండే మ్యాగజైన్లలో…
పక్కనే ఉన్న ఓ పాఠకుడిని అడిగాను… స్వాతి కవర్ ప్రైస్ 50 రూపాయలు కదా, అదే ధరకు నాలుగైదు మ్యాగజైన్లు వస్తున్నాయి కదా సార్ అన్నాడు నవ్వుతూ… పైగా వారం పాటు దాచుకుని చదవాల్సినంత ఏముందని తిరిగి నన్నే అనడిగాడు…
అవును, ఏముందనే ఆసక్తితో స్వాతి తిరగేశాను కాసేపు… నిరాశ కలిగింది… దినపత్రికల్లో దొరకనిది ఇందులో కొత్తగా ఏముందీ అనేలా ఉంది… పైగా ఎన్నేళ్లుగానో ఉన్న సేమ్ ఫార్మాట్… అంటే చిన్న చిన్న సినిమా బిట్స్ పేజీల్లో… ఓ ఆధ్యాత్మికం, ఓ వర్తమాన వ్యవహారం, రెండుమూడు సీరియల్స్, ఒకటీరెండు కథలు… ఇలాంటి ఓల్డ్ మిక్స్…
ఒకప్పుడు లక్షలాది మంది కొత్త పాఠకుల్ని తయారు చేసిన మధుబాబు సీరియల్ ఒకటి ఉంది… టైటిల్ భయం, భయం… కానీ తను ఈ కాలానికి అప్‌డేట్ కానట్టు అనిపించింది… ప్రస్తుతం స్పయింగ్, స్పెషల్ ఏజెంట్ల పనితీరు ఏమిటో తెలుసుకుంటే బాగుండు అనిపించింది… అదే ఆనాటి ఆ పాత షాడో, అదే కులకర్ణి, అదే గంగారాం, అదే శ్రీకర్, అదే స్పెషల్ బ్రాంచ్, అదే అంబాసిడర్… ప్చ్… తనదే ఏదైనా పాత నవల చదువుకుంటే సరి అనిపించింది… ఏమో, పాత నవలే ఇలా సీరియల్‌గా వేస్తున్నారా కొంపదీసి..?!
అదే సమరం… అదే కాలమ్… ఇప్పటికి కొన్ని వేల ప్రశ్నలు… చాలా చాలా రిపిటీషన్లు… అవే జవాబులు… ఆమధ్య ఇక రచనా వ్యాసంగానికి సెలవు, ఎవడూ పుస్తకాలు కొనడం లేదు, చదవడం లేదు అని వైరాగ్యాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించిన మల్లాది వెంకట కృష్ణమూర్తి సీరియల్ ఒకటి కనిపించింది… ఇంకెవరిదో ఒక కొత్త సీరియల్ ప్రారంభం…
అదే పసలపూడి వంశీ… తనే వీడియోలు చేసి వదులుతున్నాడు ఒకవైపు, మరోవైపు అలాంటిదే కథన శైలితో స్వాతిలోనూ వ్యాసం… వంశీ పోస్టులు అనేకం ఫేస్‌బుక్‌లో కూడా ఇలాంటివే చదివినట్టు గుర్తు…
ఎస్, ఇది వీక్లీలు, మంత్లీలు చదివేకాలం కాదు… అందుకే చాలా ప్రింట్ మ్యాగజైన్లు కొడిగట్టి పోయాయి… ఐనా ఈ వయస్సులో పలు ప్రయాసలకోర్చి ఇంకా మంత్లీ, వీక్లీలను రన్ చేస్తున్నందుకు వేమూరి బలరామ్ సాహసాన్ని అభినందించొచ్చు… కొన్నేళ్ల క్రితం ఆయన కుటుంబ గొడవల మీద కూడా కొన్ని వార్తలు చదివినట్టు గుర్తు… ఐతే..?
కాలం మారింది, పాఠకుల అభిరుచులు మారాయి… అందుబాటులో బోలెడు సమాచారం, వినోదం, విజ్ఞానం… వీడియోలు, సోషల్ మీడియా… ఈ నేపథ్యంలో జనానికి ఓ కొత్త ఫార్మాట్ మ్యాగజైన్ కావాలేమో… అక్కడే తేడా కొడుతున్నట్టుంది… అఫ్‌కోర్స్, దాని ప్రస్తుత సర్క్యులేషన్ వివరాలు తెలియవు గానీ… నాకు తెలిసి అదీ పడిపోతూ ఉంటుంది..!! అన్నట్టు.., బలరాం బయోపిక్ ఏదో నిర్మాణంలో ఉన్నట్టు కూడా ఆమధ్య వార్తలొచ్చాయి… ఏమైందో మరి..!!
అవునూ… స్వాతి అంటేనే ఓ సరసమైన కథ కదా… నేను చదివిన తాజా మ్యాగజైన్‌లో కనిపించలేదు… పైపైన తిరగేయడంలో మిస్సయ్యానా..? ప్రింట్ కంటెంట్ అలవాటు తప్పి, ఈ మ్యాగజైన్ నాకే నచ్చలేదా..? మిగతా పాఠకులకు బాగానే ఉంటోందా..? ఏమో..!!
Share this Article