.
ఒక రాజు చాణుక్యుడిని అవమానించాడు… ప్రతిగా చాణుక్యుడు పంతంతో వాళ్లను అంతమొందించి, తను కోరుకున్నవాడిని కుర్చీ ఎక్కిస్తాడు… అవును, కొన్నిసార్లు చిన్న చిన్న అంశాలు సునామీలై నిండా ముంచేస్తాయి…
సర్ రిచర్డ్ బ్రాన్సన్… 1979లో తను ప్రయాణించాల్సిన ఓ విమానాన్ని బ్రిటిష్ ఎయిర్‌వేస్ హఠాత్తుగా రద్దు చేసింది… బ్రాన్సన్ దాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు… చాలా సీరియస్‌గా… అసలే తెలివైనవాడు…
Ads
ఆరోజు తను వర్జిన్ ఐలాండ్స్‌కు వెళ్లాల్సి ఉంది ఫ్లయిట్‌లో… కానీ ఆ చివరి ఫ్లయిట్ రద్దు కారణంగా తనతోపాటు మరికొందరు అక్కడే విమానాశ్రయంలో చిక్కుపడిపోయారు… బ్రిటిష్ ఎయిర్‌వేస్ నిర్లక్ష్యానికి ప్రతీకారమో, సమాధానమో చెప్పాలని అనుకున్నాడు తను…
ఓ ఆలోచన తట్టింది… ఓ ప్రైవేటు ప్లేన్‌ను 2000 డాలర్లకు అప్పటికప్పుడు అద్దెకు తీసుకున్నాడు… అదే ఎయిర్‌పోర్టులోని ఓ బ్లాక్‌బోర్డు మీద రాశాడు …. ‘‘వర్జిన్ ఎయిర్‌లైన్స్.., జస్ట్, 39 డాలర్లు వర్జిన్ ఐలాండ్స్‌కు టికెట్టు ధర…’’
అక్కడే నాలుగైదు రౌండ్లు కొట్టి, వస్తారా, ఎవరికైనా ఆసక్తి ఉందా, రండి అని పిలిచాడు… నిమిషాల్లో సీట్లు ఫుల్… అక్కడ పుట్టింది సొంత ఎయిర్‌లైన్స్ అనే ఆలోచన… అలా పుట్టిందే వర్జిన్ ఎయిర్‌లైన్స్…
“ఒక కార్పొరేట్ ఎయిర్‌లైన్స్ సంస్థ నన్ను నిర్లక్ష్యం చేసింది… అయితే నేను కూడా ఇలాగే బాధపడుతున్న ప్రయాణికులందరి కోసం కొత్త ప్రయాణ అనుభవాన్ని అందించగలను కదా?” అనుకున్నాడు తను… ఐదేళ్లలో అది సాకారమైంది…
1984 – వర్జిన్ అట్లాంటిక్ తొలి ఫ్లైట్… జూన్ 22, 1984 – లండన్ గాట్విక్ నుండి న్యువార్క్ వరకు, ఒకే ఒక బోయింగ్ 747 తో ప్రారంభమైంది వర్జిన్ అట్లాంటిక్… వాళ్ల మిషన్ సింపుల్: “Make flying great again”…
బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్లు మొదట నవ్వారు… సంస్థ చైర్మన్ అయితే బహిరంగంగానే వెక్కిరింపులకు దిగాడు… బ్రాన్సన్ మాత్రం సైలెంటుగా తన పని తాను చేసుకుంటూ పోయాడు… ప్రయాణికుల పట్ల అత్యంత అమర్యాదగా, నిర్లక్ష్యంగా వ్యవహరించే ధోరణికి పూర్తి భిన్నంగా వెళ్తే చాలు సక్సెస్ అవుతాను అనుకున్నాడు…
తనను చూసి నవ్విన వాళ్లందరికీ పాఠం నేర్పాలని లోలోపల సంకల్పం గట్టిదైపోతోంది… ప్రభుత్వ సంస్థ, బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఆ రంగంలో దాదాపు మోనోపలీ… బలమైన ప్రభుత్వ బంధాలు… అందుకే వాళ్లు మొదట్లో ఈ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌ను లైట్ తీసుకున్నారు… అదే బ్రాన్సన్‌కు అనుకూలించింది…
ఎవరికివారు ఇది తమ ప్రైవేటు ఫ్లయిట్ అనుకునేలా… ఫ్రీ ఐస్‌క్రీమ్ ఇచ్చాడు… ఫ్లయిట్‌లోనే మసాజ్ సౌకర్యం ఏర్పాటు చేశాడు… ఫ్లయింగ్ లేడీస్ పేరిట ఫ్యాషన్ డిజైన్డ్ యూనిఫారాలు తొడిగాడు సిబ్బందికి… జస్ట్, ఇది ఓ ప్రయాణం కాదు, ఓ అనుభవం అది నినాదం…
అన్నింటికీ మించి ప్రతి చిన్న విషయంలోనూ ప్రయాణికులే దేవుళ్లు అన్నట్టుగా సరైన జవాబులు, సకాల స్పందనలు, మర్యాద… అవి నిలబెట్టాయి… (మన చెత్తా ఇండిగో వాడు ఎవడైనా చదివితే బాగుండు…) 1991 కల్లా 10 ఫ్లయిట్స్ సమకూర్చుకున్నాడు…
అప్పుడు బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు సెగ తగలడం స్టార్టయింది… గతంలో ఎవరూ చూడని డర్టీ ట్రిక్స్ ప్లే చేయడం మొదలుపెట్టారు ఇక… ప్రతిచోటా అనైతికంగా తొక్కే ప్రయత్నాలు ప్రారంభించారు…
వర్జిన్ ఎయిర్‌లైన్స్ సిస్టమ్స్‌ను హ్యాక్ చేసి కస్టమర్లకు తప్పుడు సమాచారం ఇవ్వడం స్టార్ట్ చేశారు… ఫలానా ఫలానా ఫ్లయిట్స్ రద్దయ్యాయని రూమర్స్ స్ప్రెడ్ చేసేవాళ్లు… తప్పుడు వార్తలు రాయించేవాళ్లు… తప్పుడు మార్గాల్లో ఆ ప్యాసింజర్లను తమవైపు మళ్లించుకునేవాళ్లు… అనైతికంగా ఎన్ని చేయాలో అన్నీ చేశారు…
బ్రాన్సన్ మీద ఒత్తిడి పెరుగుతోంది… ఆర్థికంగా నిలబడాలి, లేకపోతే దాన్ని కొనసాగించడం కష్టం… 1992లో తన సొంత వర్జిన్ రికార్డ్స్‌ను అమ్మేశాడు… వెన్ను చూపలేదు… బ్రిటిష్ ఎయిర్‌వేస్ మీద యుద్ధం ప్రకటించాడు బహిరంగంగానే…
బ్రిటిష్ ఎయిర్‌వేస్ సాగించిన డర్టీ ట్రిక్స్‌కు సంబంధించిన ఆధారాలు సంపాదించాడు… కోర్టుకెక్కాడు… ఈ పోరాటంలో ఆ సంస్థ ఓడిపోయింది… 1993, దిగివచ్చింది… బ్రాన్స్‌న్‌కు వ్యక్తిగతంగా మిలియన్ డాలర్లు, 2.5 లక్షల డాలర్లు వర్జిన్ అట్లాంటిక్ సంస్థకు లాయర్ల ఫీజులతోసహా చెల్లించింది… అంతేకాదు, బహిరంగ క్షమాపణ ప్రకటించింది… సంస్థ చైర్మన్ లార్డ్ కింగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది…
బ్రాన్సన్ ఆ సొమ్ములో ఒక్క పౌండ్ కూడా సొంతానికి ఉంచుకోలేదు… ‘బ్రిటిష్ ఎయిర్‌వేస్ బోనస్’ పేరిట ఆ సొమ్మంతా వర్జిన్ అట్లాంటిక్ ఉద్యోగులకు పంచేశాడు… ‘‘వాళ్లు మనల్ని చంపాలని చూశారు, మనం నిలబడ్డాం, ఈ పోరాటంలో మనమందరమూ సమానమే’’ ఇదీ తను ఇచ్చిన మెసేజ్…
వర్జిన్ అట్లాంటిక్ బుకింగ్స్ 30 శాతం పెరిగాయి… విశ్వసనీయత పెరిగింది… బ్రాండ్ వాల్యూ పెరిగింది… మీడియా కూడా బ్రిటిష్ ఎయిర్‌వేస్‌ను విలన్లుగా చిత్రించి అనేక కథనాలను జనంలోకి తీసుకెళ్లింది… ఒక మిలియన్ నష్టపరిహారానిదేముంది..? ఏకంగా 100 మిలియన్ల మేరకు బ్రాండ్ వాల్యూ పెరిగిపోయింది… ఉద్యోగుల లాయల్టీ పెరిగింది…
ఒక పర్పస్ కోసం నిజాయితీగా, కొత్త ఆలోచనలతో సాగించే పోరాటం ఎప్పుడూ ఓడిపోదనే నీతిపాఠంతో, విజయగాథతో బ్రాన్సన్‌ను బ్రిటిష్ మీడియా హీరోెగా నిలబెట్టింది..!
Share this Article