.
బజరంగీ భాయ్ జాన్ సినిమా .. గుర్తుంది కదా.. పాకిస్తాన్ నుంచి తప్పిపోయి వచ్చిన చిన్న మూగపాపని తిరిగి పాపని పాకిస్తాన్ లో ఉన్న ఇంటికి హీరో చేరుస్తాడో… అలాంటిదే ఈ సినిమా..
అక్కడ చిన్న పాపని పాకిస్తాన్ చేరిస్తే ఇక్కడ చిన్న ఒంటె పిల్లని పేద రైతు రాజస్థాన్ ఎలా చేరుస్తాడనేది బక్రీద్ సినిమా కథ.. ఇందులో చెప్పుకోవడానికి కథ ఏమీ ఉండకపోవచ్చు.. ఒక చిన్న లైన్ తో సినిమాని ఎలా నడిపిస్తాడనేది సినిమా చూడాల్సిందే..
Ads
ఇందులో పెద్దగా ఏమీ ట్విస్టులు ఉండవు.. కానీ చూస్తున్నంత సేపు మనసు హాయిగా ఉంటుంది.. పల్లెటూరిలో పెరిగిన జనానికి అయితే ఊళ్ళో చిన్నప్పుడు తమ పొలాల్లో తిరిగిన ఎద్దులు, ఆవులు, మేకలు గుర్తొస్తాయి.. బుజ్జి దూడలతో ఆడుకున్న దృశ్యాలు మది తలపులోకి వస్తాయి..
ఇలా సినిమా తీయాలని ఆలోచన రావడం కొంత విచిత్రమే.. ఈ రోబో కాలంలో ఇలాంటి సినిమాని జనాలు ఆదరించడం నిజంగా అద్భుతమే.. మంచి ఫీల్ ఉన్న సినిమా.. పేద రైతుగా విక్రాంత్ నటన.. సినిమాకి హైలెట్.. ఒక చక్కటి సినిమా..
సినిమా చూస్తున్నంత సేపు మంచి అనుభూతి కలుగుతుంది.. ఒక చిన్న ఒంటె.. ఒక పేద రైతు, అతని భార్య…. ఆ పేద రైతుకి ఒక అన్నయ్య.. ఒక చిన్నారి పాప.. ఒక మనసున్న లారీ డ్రైవర్.. ఒక అమెరికన్.. ఒక పోలీస్ ఆఫీసర్.. ఇలా ఒక్కో పాత్ర వచ్చి పోతుంటాయి..
ఈ పాత్రల చుట్టూ సినిమా నడుపుతాడు దర్శకుడు.. బహుశా డైరెక్టర్ జగదీశన్ సుబు.. కచ్చితంగా జంతు ప్రేమికుడు అయి ఉంటాడు.. లేకపోతే ఒంటె పిల్ల మీద సినిమా తీసే సాహసం చేయడు..
వ్యవసాయం చేయడానికి అప్పు కోసం ఒక ముస్లిం వ్యక్తి దగ్గరకు వెళ్లిన పేద రైతుకు ఒంటె పిల్ల అనుకోకుండా దొరకడం, దాన్ని ఇంటికి తెచ్చి పెంచడం, ఇంట్లో ఉన్న ఆవు, ఎద్దులతో పాటు దాన్ని సాకడం అంతా చాలా బావుంటుంది..
ఒంటె పిల్లతో ఆ ఇంట్లో వాళ్లంతా అనుబంధం పెంచుకోవడం.. అంతా చూస్తున్నంతసేపు మనకి ఏవేవో గుర్తొస్తాయి.. ఆ ఒంటెని ఎందుకు రాజస్థాన్ తరలించాల్సి వచ్చింది.. తరలించే క్రమంలో రైతు రత్నం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడు అనేది సినిమా..
తరలిస్తున్న క్రమంలో జంతు పరిరక్షణ వాళ్ళు.. దాన్ని బక్రీద్ రోజు మాంసం కోసం చంపడానికి తీసుకెళ్తున్నాడనుకుని కొట్టడం, అలాగే ఒంటెని తరలించడానికి సాయం చేసే రాజస్థాన్ లారీ డ్రైవర్.. పోలీసుల చేతిలో దెబ్బలు తినే సన్నివేశాలు బాధ కలిగిస్తాయి.. అదంతా సినిమాలో చూస్తేనే ఫీల్ ఉంటుంది..
సినిమా మొత్తానికి రైతు రత్నంగా విక్రాంత్ నటన హైలెట్.. అమాయకత్వంతో కూడిన అద్భుత నటన అతనిలో కనిపిస్తుంది.. వ్యవసాయం చేయడానికి అప్పు కోసం బాంక్ కు వెళ్తే ఎదురయ్యే ఇబ్బందులు చూసినప్పుడు బాధ కలుగుతుంది..
బాంక్ అప్పు ఇవ్వకపోతే ముస్లిం వ్యక్తి అతనికి అప్పు ఇస్తాడు.. నేను బక్రీద్ కి బిర్యానీ వండితే వంద మంది తింటారు.. కానీ అదే రైతు పొలంలో పంట పండితే వేల మంది తింటారు అని అతను అప్పు ఇచ్చేప్పుడు చెప్పే మాట ఆకట్టుకుంటుంది..
బాగా టెన్షన్ గా ఉన్నప్పుడో.. విసిగిపోయి అలసిపోయినప్పుడో.. ఈ సినిమా చూడండి.. ఆటోమేటిక్ గా రిలీఫ్ వస్తుంది.. సినిమాలో కొన్ని సార్లు నవ్వుతాము.. కొన్నిసార్లు బాధపడతాము. ఇంకొన్నిసార్లు జాలి పడతాం.. మరికొన్నిసార్లు దీనంగా చూస్తాము.. చాలాసార్లు గర్వంగా ఫీల్ అవుతాము.. అశోక వేములపల్లి
(అమెజాన్ లో ఉంది సినిమా)
Share this Article