సోషల్ మీడియా, మీడియా, టీవీలు, పత్రికలతోపాటు ప్రతిచోటా టాం టాం వేస్తున్నారు… ఊరూరా అలజడి… ప్రతి స్థాయి ఉద్యోగీ ఎన్నికల విధులకు హాజరైనట్టుగా తప్పకుండా ఈ పనికి హాజరు కావాలని ఆదేశించారు… బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు హాస్పిటళ్లు… పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డ్యూటీ అందరికీ… ఇద్దరు నర్సులు, ఓ డాక్టర్… ఆధార్ కార్డులు పరిశీలించడం, వివరాలు ట్యాబుల్లోకి ఎక్కించడానికి ఇద్దరు టీచర్లు… ఒక సమగ్ర సర్వే… ఒక పల్స్ పోలియో… ఒక ఎన్నికల డ్యూటీ… సేమ్… ఆ పల్స్ పోలియోలాగే మారుమూలలకూ కోల్డ్ చెయిన్ ఏర్పాట్లు… 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ వేక్సిన్… వోటేసినవాళ్లకు పెట్టినట్టే ఇంకు గుర్తులు పెడుతున్నారు… వేక్సిన్ వేయించుకోకపోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులను చేస్తామనే ప్రకటన వెలువడింది… జనం వరుసలు కట్టారు… సరిగ్గా అయిదు వారాలకు సెకండ్ డోస్ డేట్లు ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది… ఆ రోజు కూడా సేమ్, సెకండ్ డోస్ కూడా సక్సెస్… కరోనా కేసుల సంఖ్యతో ఇప్పుడు సంబంధం లేదు, కానీ జనానికి ఓ భరోసా దొరికింది… భయం తొలగింది… ఇజ్రాయిల్ కాదు… ఇండియాయే… మన జనం కూడా బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల్ని కట్టుకోవడం లేదు… స్వేచ్ఛగా తిరుగుతున్నారు… కోవిడ్ ఇన్ఫెక్షన్లు వస్తున్నా సరే, మరీ ప్రాణాంతకం కావడం లేదు… హాస్పిటల్స్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత, రెమ్డెసివర్ ఇంజక్షన్ల కొరతలపై ఫిర్యాదుల్లేవ్… ఆహా, మళ్లీ పాత రోజులొచ్చేశాయా..? కరోనా ఓ సాధారణ జలుబులాగా మారిపోయిందా..? (కలలు, ఆశలు, ఊహలు కొన్నిసార్లు అజ్ఞానంలాగే అనిపిస్తయ్, తప్పులేదు… ఐనా పర్లేదు…)
దిగ్గున మెలకువ వచ్చింది… ఓహ్, ఇదంతా ఓ కలా..? నిజం కాదా..? ఎంతటి బంగారు కల..? ప్చ్, నిజమైతే ఎంత బాగుండు..? అవునూ, సాధ్యం కాదా..? చేయలేమా..? చేయొచ్చు… ఎందుకు చేయలేం..? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే కాదు, చత్తీస్గఢ్ కూడా 18 ఏళ్లు దాటిన వాళ్లందరికీ ఫ్రీ వేక్సిన్ వేయిస్తామని ముందుకొచ్చినయ్… మరి అత్యంత ప్రగతిశీల రాష్ట్రాలుగా చెప్పుకునేవి ఏమయ్యాయ్..? సారీ… ప్రస్తుతం మోడీని బూతులు తిట్టడంలో బిజీగా ఉన్నయ్… ఇక్కడ డబ్బు సమస్య కాదు… ఆఫ్టరాల్ ఒక రాష్ట్రంలో 18 ఏళ్లు దాటినవారి సంఖ్య కోటి మంది అనుకుందాం… ప్రభుత్వం చెప్పేసింది కదా, వేక్సిన్ మీరే కొనుక్కొండి అని… ఆ కోటి మందికి బల్క్ ఆర్డర్ కాబట్టి, సరిగ్గా రేటు మాట్లాడుకుంటే ఆరేడు వందల కోట్లు…. కోవాగ్జిన్ అయితే ఇంకా తక్కువ… (పైగా కోవాగ్జిన్ సామర్థ్యంలో కూడా బెటర్ వేక్సిన్)….
Ads
నిజానికి వేక్సిన్ తయారీ ఖర్చు చాలా చాలా తక్కువ… కానీ రీసెర్చ్ కోసం పెట్టిన ఖర్చు లేదా రాయల్టీలు ఇవ్వాల్సిన ఖర్చు ప్లస్ లాభాన్ని వీలైనంత కుమ్ముకోవాలనే కంపెనీల ప్రయత్నంతో ఇంతగా రేట్లు పెట్టేస్తున్నారు… పైగా గిరాకీ ఉన్నప్పుడే పిండుకోవాలి కదా… సమస్య ఏమిటంటే..? ప్రస్తుతం వేక్సిన్ నిల్వలు సరిపడా లేవు… కేంద్రం నియంత్రణ తీసేసి, ప్రైవేటు ధరల ఖరారు కంపెనీలకే అప్పగించేసరికి ఒక్కసారిగా షార్టేజీ… పైగా కేంద్రానికి ఒక రేటు, రాష్ట్రాలకు ఒక రేటు… మామూలు మార్కెట్లో మరో రేటు… అంతిమంగా జనం నుంచి ఎన్ని వేల కోట్లు పిండేస్తారో… ఉదాహరణకు కోవిషీల్డ్ చూస్తున్నాం కదా..! మెల్లిమెల్లిగా రెమ్డెసివర్లాగే వేక్సిన్ బ్లాక్ మార్కెట్ కూడా చూడాల్సి ఉంటుందేమో… ఏమో, ఈ రెండు డోసుల కథ ముగిశాక, థర్డ్ వేవ్ పేరు చెప్పి బూస్టర్ డోస్ అంటూ మళ్లీ దండుకుంటారేమో…! ఆల్రెడీ చెబుతున్నారు కదా, నవంబరు-డిసెంబరుల్లో థర్డ్ వేవ్ తప్పదూ అని…
నిజానికి కేంద్రమే ఇప్పుడు 45 ఏళ్ల పైబడిన వాళ్లకు ఉచితంగా వేక్సిన్లు వేయిస్తున్నట్టుగానే… కంపెనీల స్టాకుల మీద నియంత్రణను అలాగే ఉంచుకుని, తనే 18 ఏళ్ల పైబడిన వాళ్లకూ వేయించాలి… ఇక్కడ డబ్బు సమస్యే కాదు… కానీ మోడీ ఉద్దేశపూర్వకంగానే చేతులెత్తేసినట్టుగా జనానికి కనిపిస్తోంది… పోనీ, రాష్ట్రాలయినా ఈ విపత్తు వేళ జనం రక్షణ కోసం మంచి సంకల్పం తీసుకోవాలి కదా… మోడీని ఎప్పుడైనా తిట్టొచ్చు, ఏ కారణంతోనైనా తిట్టొచ్చు… కానీ మోడీకి చేతకాని ఇలాంటి ఒక మంచి పనిని చేసి చూపించి, ఇదిరా తండ్రీ, పాలకుడు జనం పట్ల స్పందించాల్సిన తీరు, సమజైందా అని గడ్డి పెట్టొచ్చు కదా… అవునూ, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే తప్పేమిటి..? నష్టమేంటి..? భలేవారే… అలాంటివి చేస్తే కార్పొరేటు వైద్య మాఫియా ఏమైపోవాలి..? ఫార్మా మాఫియా ఏమైపోవాలి..? అంతేలెండి… ‘‘ఎవరి ప్రాణాలకు వాళ్లదే బాధ్యత, మాస్క్ మహా ఔషధం’’ అని ఓ భీకరమైన, సారీ, ఓ అత్యంత విలువైన ప్రకటన చేసి, చేతులు దులిపేసుకుంటే సరి…!!
Share this Article