.
Subramanyam Dogiparthi……. డబ్బులూ రాలేదు , అవార్డులూ రాలేదు . జంధ్యాల దర్శకత్వం వహించిన సినిమాలలో బాక్సాఫీస్ డిజాస్టర్ ఇదేనేమో ! అయినప్పటికీ ఈ సినిమా గురించి తెలుసుకోవలసిందే .
కుల , మత బేధాలను తొలగించేందుకు , ప్రజల్లో సామరస్యత కలిగించేందుకు సినిమా మాధ్యమం తన వంతు కృషి చేస్తూనే వచ్చింది . ఒకనాటి మాలపిల్ల , జయభేరి , తర్వాత కాలంలో ఒకే కుటుంబం , బొంబాయి వంటి సినిమాలు మచ్చుకు . ఇంకా ఎన్నో ఉన్నాయి .
Ads
1983 లో వచ్చిన ఈ నెలవంక సినిమా తీసేందుకు సాహసించిన జంధ్యాలకి నమస్కరించాలి . దుర్మార్గానికి , మోసానికి , నీచానికి , మంచికి , గుణానికి కులం , మతం ఉండవు . కానీ , కొందరి స్వార్ధం కొరకు , మరి కొందరి దుష్ట మనస్తత్వం వలన కులాలు , మతాలు కొట్టుకుంటూనే ఉంటాయి , చంపుకుంటూనే ఉంటారు .
సుత్తి లేకుండా డైరెక్టుగా మత కల్లోలాలు ఎలా ఉత్పన్నమవుతాయో , మనుషులు ఎలా నష్టపోతారో డైరెక్టుగా , ధైర్యంగా చూపించారు జంధ్యాల . హిందూ ముస్లిం మత సామరస్యత కొరకు నిరంతరం మథనపడి , చివరకు ఆ కారణంగానే అసువులు బాసిన మహాత్మాగాంధీకే ఈ సినిమాను అంకితం చేసారు . టైటిల్స్ రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అనే పాటతోనే వస్తాయి .
మిత్రులు Divakara Babu Madabhushi గారు వ్రాసిన ఎవ్వనిచే జనించు నాటకం ఆధారంగా ఈ నెలవంక సినిమా కధను తయారు చేసుకున్నారు . చక్కని కధాంశం . ఒకే కుటుంబం , బొంబాయి సినిమాల్లాగా హిట్ కావలసింది . బహుశా సినిమాను భయం భయంగా తీసారేమో అని అనిపిస్తుంది .
అన్ని పాటలను ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ వ్రాసారు . వేటూరి , ఆత్రేయ వంటి వారి చేత వ్రాయించి ఉండవలసిందేమో ! రమేష్ నాయుడు సంగీతం కూడా అంతంత మాత్రంగానే ఉంది . ఏది మతం మనకేది హితం అనే పాట ఒక్కటే గుర్తుండేది . రాజేష్ తులసి , కిరణ్, రాజ్యలక్ష్మి మీద పాటలు థియేటర్లో బాగుంటాయి .
సుత్తి జంట రివర్సులో సుత్తిని పండించారు . జంధ్యాల వ్రాసిన గుండెలు మార్చబడును నాటిక నుండి డాక్టర్ని , కోయదొరని , విరేచనం మందుని వాడుకున్నారు సినిమాలో . ఈ నాటికలో డాక్టర్ పాత్రను నేను నటించాను .
గుమ్మడి , జె వి సోమయిజులు ఈ సినిమాకు హీరోలు . ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు . ఒరే ఒరే అని పిలుచుకునే ప్రాణస్నేహితులు . గుమ్మడి జమీందారు అయితే ఆయన గుర్రబ్బండిని తోలే రహీం సోమయాజులు . మత విద్వేషకుల చేతిలో గుమ్మడి చంపబడితే , అతనితో పాటు ప్రాణాలను వదులుతాడు సోమయాజులు .
ఇతర ప్రధాన పాత్రల్లో రాజేష్ , తులసి , కిరణ్ అనే కొత్త లేత వయసు కుర్రాడు , రాజ్యలక్ష్మి , సుత్తి జంట , సాక్షి రంగారావు , పొట్టి ప్రసాద్ , ప్రభృతులు నటించారు . కొత్త వారిని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో చాలామంది ఔత్సాహికులు , జూనియర్ ఆర్టిస్టులను పరిచయం చేసారు జంధ్యాల .
తులసి తల్లిగా సభారంజని అనే స్టేజ్ ఆర్టిస్టుని తీసుకున్నారు . ఖవాలీ పాట ఒకటి ఉంటుంది . ఆ డాన్సర్ ఎవరో కూడా తెలియదు . A movie of slips , mistakes and wrong decisions , but , with a great pious intention .
సినిమా అంతా 43 రోజుల్లో ముక్త్యాల గ్రామంలో , ముక్త్యాల రాజా వారి కోటలో , కృష్ణా నది తీరాన , కోదాడ లోని సెయింట్ జోసెఫ్స్ సి ఆర్ ఆర్ విద్యానిలయంలో , వేదాద్రిలో తీసారు . టైటిల్సులో ముక్త్యాల రాణి శ్రీమతి వాసిరెడ్డి రాజ్యలక్ష్మమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు .
సినిమాలో బాగా హత్తుకుపోయే అంశం రహీం పాత్రలోని సోమయాజులు రామాయణం లోని పాదుకా పట్టాభిషేకం , పిట్ట – శ్రీరాముడి మధ్య సంభాషణలను వివరించటం . హిందూ పురాణాలను , ఇతిహాసాలను అద్భుతంగా ప్రవచించే ముస్లిం సోదరులు నాకు ఎంతో మంది తెలుసు . మా T.J.P.S. కాలేజీలో మౌలాలి అని ఒక హిందీ హెడ్ కం NCC ఆఫీసర్ ఉన్నారు . రాష్ట్రం నలుమూలల నుండి వచ్చి ఆయనని ఉపన్యాసాల కొరకు తీసుకుని వెళ్ళేవారు .
నాకు తెలిసిన మరొక గొప్ప వ్యక్తి మా గుంటూరు లోనే ప్రముఖ సర్జన్ డా ఫయాజ్ అహమ్మద్ . పురాణాలు , ఇతిహాసాలు , వేదవేదాంగాలు అన్నింటినీ ఔపాసన పట్టిన గొప్ప మానవతావాది . పేదల ఎడ కరుణ కలిగిన డాక్టర్ . ఆయన్ని మా నాగార్జున యూనివర్సిటీ విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించింది కూడా .
హిందూ ముస్లింలు ఎవరి పండుగలు వాళ్ళు చేసుకుంటూనే , ఎవరి ఆచారాలు వాళ్ళు పాటిస్తూనే కలిసిమెలిసి అన్నాదమ్ముల్లాగే ఉన్నారు , ఉంటున్నారు , ఉంటారు . మా నాన్నగారికి ఖాసిం సాహెబ్ అని ఒక ప్రాణ మిత్రుడు ఉండేవారు . ఆయనదీ బట్టల కొట్టే . కనీసం రోజులో ఒక్కసారయినా కలవాల్సిందే . కలిసి నడవాల్సిందే . ఇద్దరి కుటుంబ సభ్యులు కూడా ఒకే కుటుంబంలాగా ఉండే వాళ్ళం .
ఈ పోస్ట్ చదివే ప్రతీ మిత్రుడికి నా వినమ్రపూర్వక అభ్యర్ధన ఏమిటంటే దయచేసి ఓపిగ్గా ఈ సినిమాను చూడండి . బోర్ కొట్టినా రెండు దఫాలుగా అయినా చూడండి . యూట్యూబులో ఉంది . ఇతరులను కూడా చూడమని ప్రోత్సహించండి . జంధ్యాల కష్టానికి , సాహసానికి నివాళి ఈ సినిమాను చూడటమే .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article