.
జాలిపడతారో, నవ్విపోతారో, ఎలా స్పందించాలో తెలియక ఎడ్డి మొహాలు వేస్తారో మీ ఇష్టం… ముందుగా టీటీడీ అధికార ప్రకటన ఒకటి చదవండి… ముందే చెబుతున్నా, నవ్వొద్దు.,. ప్లీజ్…
.
Ads
ఉద్యోగులకు హెల్మెట్ల పంపిణీ
టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శనివారం ఉదయం తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో హెల్మెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల నుండి తిరుపతికి వచ్చే టీటీడీ ఉద్యోగులకు ప్రయాణ సమయంలో భద్రత కల్పించడంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించామని అన్నారు. ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ చేసేందుకు గుంటూరుకు చెందిన జలాది రఘురామ్, ఢిల్లీకి చెందిన కేసీఎన్ హెల్మెట్ల తయారీ సంస్థ అధినేత నవీన్ ముందుకు వచ్చారని తెలిపారు.
ఇందులో భాగంగా మొదటి విడతగా సుమారు రూ.5 లక్షలు విలువైన 555 హెల్మెట్లు విరాళంగా ఇచ్చారని చెప్పారు. 15 రోజుల్లో మరో 500 హెల్మెట్లు విరాళంగా ఇస్తారని చెప్పారు. వీటిని పరిశీలించి బాగున్నాయని తెలిపితే మరో ఐదు వేల హెల్మెట్లు అందిస్తారని తెలియజేశారు.
మీకు ఏం అర్థమైంది..? టీటీడీ ఉద్యోగులు క్లిష్టమైన ఘాట్ రోడ్డుపై అష్టకష్టాలు పడుతూ పాపం… ప్రాణాలకు తెగించి మరీ ప్రయాణాలు చేస్తూ పనిచేస్తున్నారని అర్థమైందా..? సరే… టీటీడీ అన్య మత ఉద్యోగులు సహా ఉద్యోగులందరూ చాలా బాగా పనిచేస్తూ భక్తుల ఆశీస్సులకు, ఆ శ్రీవారి కృపకూ పాత్రులు అవుతుంటారు సరే గానీ…
1. టీటీడీ అంత పెద్ద మొత్తంలో జీతాలిస్తోంది కదా, ఒక్కడికీ హెల్మెట్ కొనుక్కునే స్థోమత లేదా ఫాఫం..?
2. అసలు ఇన్నేళ్లూ పై నుంచి కిందకు, కింద నుంచి పైకి హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తుంటే ఒక్కడికీ చాలాన్ వేయలేదా పోలీసులు..? అంటే టీటీడీ ఉద్యోగులు అన్ని చట్టాలకూ అతీతులా..? లేక టీటీడీ ఉద్యోగిని జరిమానాతో శిక్షిస్తే శ్రీవారికి ఇష్టం ఉండదా..? శపిస్తాడా..?
3. అసలు తిరుమలలో ట్రాఫిక్ విభాగం అంటూ ఏమీ లేదా…? లేక ఆ విభాగాన్ని కూడా టీటీడీకి ఔట్ సోర్సింగ్ చేశారా..?
4. పోనీ, వాళ్లు అత్యంత దయనీయ స్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు సరే, టీటీడీ ఆ హెల్మెట్లను కొని ఇవ్వలేదా..? ఈ హెల్మెట్లను కూడా ఎవరో ఒకరు బిచ్చం వేయాల్సిందేనా..? ఇక్కడ విరాళం అనే మాట వాడదలుచుకోలేదు…
5. ముందుగా కొన్ని ఇచ్చారట, అవి పరిశీలించి టీటీడీ వోకే అంటే వేలాదిగా ఇస్తారట… అంటే ఇప్పటివరకూ ఆ ఘాట్ రోడ్డు మీద ఒక్కడూ హెల్మెట్ పెట్టుకోవడం లేదన్నమాట…
6. పైగా ఆ హెల్మెట్లకూ లడ్డూ నెయ్యికి చేసినన్ని పరీక్షలు చేయించి మరీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప మరిన్ని విరాళ హెల్మెట్లకు వోకే చెబుతారట…
7. సరే, ధర్మప్రచారం కోసమే ప్రతి పైసాను వెచ్చించాలి, ప్రతి నిర్ణయం తీసుకోవాలనేది కదా టీటీడీ ప్రథమ విధి… ఈ చర్యలో అదేం ఉంది..? సరె, సర్లె, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏమిటి..? కోట్లకుకోట్ల వృథాలు, అక్రమాల పర్వాల్లో ఇదెంత..?
8. బీఆర్ నాయుడికి ఇవన్నీ అర్థమవుతాయని అత్యాశలు అక్కర్లేదు గానీ… విరాళమే కదాని హెల్మెట్లపై నిలువు నామాలు ముద్రిస్తారేమో, కుదరదు… అన్యమత ఉద్యోగులు అంగీకరించరు, అసలు చింతా మోహన్‌లు, భూమన కరుణాకర్‌రెడ్లు అస్సలు ఒప్పుకోరూ, నాయుడు గారూ మీకు అర్థమవుతోందా..?!
Share this Article