ఔనా..? నిజంగానే మన ప్రభుత్వం నక్సలైట్ల నిర్మూలనకు డ్రోన్ల ద్వారా బాంబులు వేస్తోందా..? ఆదివాసీ ప్రాంతాలపై కార్పెట్ బాంబింగు చేయాలనే ప్రణాళికల్లో ఉందా..? అసలు ఇది నైతికమేనా..? ఏ రాజ్యమైనా తన సొంత ప్రజలపై వైమానిక దాడులు చేస్తుందా..? చట్టం అంగీకరిస్తుందా..? ప్రజలు సహిస్తారా..? అమాయకుల ప్రాణాలకు రక్షణ ఏది మరి..? ఒక వార్త చదివాక అందరిలో తలెత్తే ప్రశ్నలు, సందేహాలు, ఆందోళనలు ఇవి… ఇప్పటికే సాయుధ బలగాలు, మావోయిస్టుల నడుమ ఆదివాసీల బతుకు బర్బాద్ అయిపోతోంది… చివరకు ఇలా కూడా మిగలనివ్వరా..? ఇదీ ప్రధాన ఆందోళన… నిజానికి కేంద్ర బలగాలకు ఆధునిక టెక్నాలజీ వినియోగం ఇంకా సరిగ్గా చేతకావడం లేదు గానీ మావోయిస్టుల ప్లీనరీ సమావేశాలను శాటిలైట్ ఫోటోలతో పసిగట్టి, జాడపట్టి బాంబింగ్ చేసినా పెద్దగా ఆశ్చర్యపడనక్కర్లేదు… అలా జరగకపోతేనే ఆశ్చర్యపడాలి… అదుగో, అంత కసిగా ఉన్నాయి సాయుధబలగాలు… మొన్నటి భారీ ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం వాటిల్లాక నక్సల్స్‌పై ప్రతీకార వాంఛ బాగా పెరిగింది కేంద్ర ప్రభుత్వంలో కూడా…
మాపై డ్రోన్ బాంబులు వేస్తున్నారు, అడవి జంతువులు- పక్షులకు ప్రాణనష్టం, ప్రకృతి వినాశనం, ఒక రాజ్యం తన సొంత ప్రజలపై ఎయిర్ బాంబింగ్ చేయడం ఇదే తొలిసారి అంటూ మావోయిస్టు దండకారణ్య కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట ఓ ప్రెస్‌నోట్, బాంబు విడిభాగాల ఫోటోలు వార్తల్లో కనిపిస్తున్నాయి… సహజంగానే పోలీసులు ఖండించారు, అది వేరే సంగతి… ఇక్కడ వికల్ప్ తమకు అలవాటైన పడికట్టు పదాల ఫ్లోలో ఏదేదో రాసుకుంటూ పోయినట్టున్నాడు గానీ… బాంబులు పేలలేదా..? ఇప్పుడు కనిపించే ఫోటోలు ఆ పేలని బాంబులేనా..? బాంబులు అసలు విడిభాగాలుగా విడిపోవడం ఏమిటి..? సాయుధబలగాలు మరీ అంత నాసిరకం బాంబుల్ని వాడిందా..? ఇంతకీ కేవలం డ్రోన్లేనా..? చాపర్లు కూడా వాడిందా..? లేక డ్రోన్లను మావోయిస్టుల ఉనికి, జాడల అన్వేషణకు ప్రయోగిస్తున్నారా..? హేమో… అంతా అయోమయం… దీన్ని కాసేపు పక్కన పెడితే… వికల్ప్‌కు సరైన అవగాహన లేనట్టుంది… రాజ్యం సొంత ప్రజలపై బాంబులు వేయడం తొలిసారేమీ కాదు… అరవయ్యేళ్లుగా ఇది చర్చల్లో ఉన్న అంశమే… ఓసారి ఇది చదివితే అర్థమవుతుంది…
Ads
1966… మార్చి… అంటే యాభై అయిదేళ్ల క్రితం… అప్పటికి మిజోరం రాష్ట్రం ఏర్పడలేదు… మిజో నేషనల్ ఫ్రంట్ ఏర్పడి తమ హక్కుల కోసం, స్వయంప్రతిపత్తి కోసం సాయుధ పోరాటం స్టార్ట్ చేసింది… అప్పటికి ఆ ప్రాంతం అంతా అస్సాంలో భాగం… మిజో హిల్స్, ప్రత్యేకించి అయిజాల్ సిటీ ఈ మిజో ఉద్యమకారుల అడ్డా… (అయిజాల్ ప్రస్తుత మిజోరం రాజధాని)… మిజో నేషనల్ ఫ్రంట్ ఆపరేషన్ జెరిచో పేరిట తమ జాతీయులు ఉన్న ప్రాంతాల్ని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది… ఇండియాకు వ్యతిరేకంగా… అయిజాల్ ట్రెజరీని స్వాధీనం చేసుకుని, చంఫై, లుంగ్లీ ఆర్మీ స్థావరాలనూ చేజిక్కించుకుంది… అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ… ఆమె టెంపర్మెంట్ తెలిసిందే కదా… ఓరోజు నాలుగు యుద్ధవిమానాలు బయల్దేరి అయిజాల్ సిటీ మీద బాంబులు వేయడం స్టార్ట్ చేశాయి… డ్రోన్లు, చాపర్లు కాదు, యుద్ధవిమానాలు… అనేక మందిపౌరులు సమీపంలోని గుట్టల్లోకి వెళ్లి తలదాచుకున్నారు… తిరుగుబాటుదారులు పొరుగు దేశాల్లోకి తప్పించుకున్నారు…
ఆ తరువాత కొన్నాళ్లకు మిజో ఫ్రంట్ ముక్కలైంది… 1972లో మిజోరంను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించారు… 1987లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు… ఆ వైమానిక దాడి తరువాత ప్రధాన గ్రూపులు భారత ప్రభుత్వంతో శాంతి ఒప్పందాలు చేసుకున్నాయి… ఇది ఎందుకు చెప్పుకోవడం అంటే..? రాజ్యం సొంత ప్రజలపై బాంబులు వేయడం అనేది తొలిసారేమీ కాదు… ఆల్రెడీ భీకరమైన మిజో ఉదాహరణ ఉంది… ఆ దాడుల్లో పౌరులు కూడా మరణించారు… అబ్బే, మేం యుద్ధవిమానాల్లో రేషన్, ఆయుధాలు సరఫరా చేశాం, అంతే అని మొదట్లో కేంద్రం సమర్థించుకుంది కూడా… అవసరమైనప్పుడు కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో చెప్పడానికి స్వర్ణదేవాలయంపై సైనిక చర్య కూడా ఓ ఉదాహరణే… అవునూ, మావోయిస్టు ప్రాంతాలపై మరీ ఆ నాసిరకం బాంబుల్ని ఎందుకు ప్రయోగించినట్టు..? నిజంగా అవి బాంబులేనా..?! ఈ చర్య ద్వారా ఏం చెప్పాలని అనుకుంటున్నట్టు..?!
Share this Article