కైలాసంలో కరోనా జాగ్రత్తలు!
——————–
నిత్యానంద అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు అని సాధారణ నిఘంటు అర్థం. అయితే ఒకదేశాన్నే పుట్టించి, ఆ దేశాన్ని కైలాసంగా మార్చి, దానికి ఆయనే అధ్యక్ష, ప్రధాని, మంత్రి, కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కారణజన్ముడు నిత్యానంద విషయంలో సాధారణ నిఘంటువులకు విలువ ఉండదు. పీఠాధిపతులను ఆయన అనకూడదు అని మీకు అభ్యంతరమయితే వారు/శ్రీవారు/శ్రీచరణులు/స్వామివారు అని మార్చుకుని చదువుకుంటే నాకెలాంటి అభ్యంతరం ఉండబోదు. నిత్యం ఆనందమే తానయినవాడు, నిత్యం ఆనందాన్ని పంచేవాడు, నిత్యం ఆనందం తన కాళ్లను ఆశ్రయించి ఉండువాడు, నిత్యం ఆనంద వాక్కుల వాడు అని కొద్దిగా విభక్తులను మార్చుకుంటే అంతులేని ఆనందార్థాలు వస్తూనే ఉంటాయి. నిజానికి ఆనందానికి పర్యాయపదం నిత్యానంద.
దిశ ఉన్నది దేశం. దేశానికి వ్యాకరణంలో అంతకంటే సీన్ లేదు. నిత్యానంద కైలాసానికి ఈక్వెడార్ దగ్గర ఎక్కడో దిశ అయితే ఉంది. కాబట్టి అది దేశమే. దేశమంటే మట్టి కాదు- నిత్యానంద.
Ads
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదు. కైలాసానికి పోయినా కరోనా పోదు. దాంతో నిత్యానంద దేశం కైలాసం కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రెసిడెన్షియల్ మ్యాండేట్ ను అన్ని దేశాల రాయబార కార్యాలయాలకు పంపింది. అంటే కైలాసానికి వెళ్లేవారిపై ఇక నిషేధాజ్ఞలు ఉంటాయి. కొన్ని పరీక్షలు, కొన్ని రోజులు క్వారెంటైన్ లో ఉంటేనే కైలాసంలోకి అనుమతిస్తారు. భారత్, బ్రెజిల్, యూరోప్ దేశాలకు ఈ వర్తమానాలు వెళ్లాయి. పాస్ పోర్ట్, వీసా, స్టాంపింగ్ లేకుండా భూమండలమంతా వెళ్లగలిగిన కరోనా కైలాసానికి మాత్రం వెళ్లకుండా ఎందుకుంటుంది? అందుకే నిత్యానంద ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నిత్యానందను జాగ్రత్తగా గమనిస్తే గొప్ప వ్యాపార, వాణిజ్య, వ్యక్తిత్వ, వ్యవహార పాఠాలు దొరుకుతాయి.
1. భాష ఏదయినా, విషయమేదయినా తడబాటు లేకుండా మాట్లాడాలి.
2. వైవిధ్యమయిన వేషం మెయింటైన్ చేయాలి.
3 . మనవాతీతుడిని అని ముందు మనమీద మనకొక నమ్మకం కలగాలి.
4. చట్టాలు ఎక్కడ చట్టుబండలవుతాయో ముందుగానే తెలుసుకోవాలి.
5. కైలాసానికి మనం వెళ్లలేకపోతే కైలాసాన్నే మనం సృష్టించాలి.
6 . వివాదాలు చుట్టుముట్టినా, ఉనికే ప్రశ్నార్థకమయినా దిగులు పడకూడదు. శిథిలాలనుండి శిఖరాల మీదికి ఎగబాకే మార్గాలను వెతుకుతూనే ఉండాలి.
7 . మన మాటలు మనకే పిచ్చిగా, అర్థం లేనివిగా అనిపించినా ఎదుటివారికి అవి మహాప్రసాదంగా, గొప్పగా అనిపించవచ్చు. కాబట్టి అర్థరహిత, దురర్థ, విపరీతార్థ, అనర్థ భాష్యాలను వినిపించడానికి మొహమాటపడకూడదు. నవ్విన నాప చేనే పండుతుంది. కుళ్లిన పండే పండుతుంది.
8. పదెకరాలు సొంత ఆస్తి ఉన్నవారెవరయినా ఒక దేశాన్ని కొత్తగా పుట్టించడానికి అర్హులే.
9. దేహం- దేశం అంతా భ్రాంతి అన్నది వేదాంతం. దేహం నిత్యం- దేహి సత్యం- దేశం నిత్యసత్యం అన్నది నిత్యానందం.
డౌట్ ఉంటే కైలాసానికి వెళ్లి రండి!………. By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article