నూటికో కోటికో ఒక్కరు-
ఇలా ప్రాణాలకు తెగించి ప్రాణాలను నిలబెడతారు
——————–
“కారే రాజులు? రాజ్యముల్ కలుగవే? గర్వోన్నతిన్ బొందరే? వా
రేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై
పేరైనం గలదే? శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశఃకాములై
ఈరే కోర్కెలు? వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా!”
పోతన భాగవతంలో వామనావతార ఘట్టంలో పద్యమిది. వచ్చినవాడు పిల్లవాడు కాదు- సాక్షాత్తు విష్ణువు- జాగ్రత్త అని రాక్షసగురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని హెచ్చరిస్తాడు. అప్పుడు బలి అన్న మాట ఇది. ఎందరు రాజులు రాలేదు? ఎన్ని రాజ్యాలు పుట్టలేదు? గర్వంతో ఎందరు రాజులు విర్రవీగలేదు? ఇప్పుడు వాళ్లంతా ఎక్కడున్నారు? సిరి మూటగట్టుకుని పోగలిగారా? ఈ భూమి మీద కనీసం వారి పేరు తలచుకునేవారున్నారా? శిబి చక్రవర్తి లాంటి మహా దాతలు ఏదడిగినా ఇచ్చి శాశ్వతమయిన కీర్తి ప్రతిష్ఠలు పొందలేదా? ఇలాంటి పుణ్యపురుషులను లోకం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది.
Ads
బలిచక్రవర్తి దగ్గర నుండి నేరుగా బాంబే మెట్రో స్టేషన్ దగ్గరికి వద్దాం. ఓ తల్లి ఎనిమిదేళ్ల పిల్లాడితో ప్లాట్ ఫామ్ మీదికి వచ్చింది. అర కిలోమీటర్ దూరంలో ప్లాట్ ఫామ్ మీద ఆగాల్సిన రైలు వస్తోంది. ఈలోపు ప్లాట్ ఫామ్ అంచుదాకా వెళ్లిన పిల్లాడు కాలు జారి, రైలు పట్టాల మీద పడిపోయాడు. తల్లి గుండె తల్లడిల్లింది. రైలు దూసుకొస్తోంది. గట్టిగా కేకలు వేసింది. యాభై అడుగుల దూరంలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగి పాయింట్ మ్యాన్ మయూర్ షెల్కే పిల్లాడు పడడం చూశాడు. తల్లి అరుపులు విన్నాడు. అంతే సర్వేంద్రియాలకు పనిచెప్పి, ఒంట్లో శక్తినంతా ఒక్కటి చేసి మెరుపువేగంతో పిల్లాడివైపు పరుగెత్తాడు. ఒడుపుగా పిల్లాడిని రెండు చేతులతో పట్టుకుని ప్లాట్ ఫామ్ పై విసిరేశాడు. వెనువెంటనే తను కూడా ప్లాట్ ఫామ్ పైకి దూకాడు. ఇదంతా రాస్తే రామాయణం. చెబితే మహా భారతం. చూస్తేనే తెలుస్తుంది మయూర్ సాహసమేమిటో. ఒక్క సెకెను ఆలస్యమయినా పట్టాలమీద పడి ఉన్న పిల్లాడి మీద రైలు వెళ్లేది. అరసెకెను ఆలస్యమయినా రైలుకు ప్లాట్ ఫామ్ కు మధ్య నలిగి మయూర్ ప్రాణం పోయేది.
తన తొడ కోసి పావురానికి ఆహారంగా ఇవ్వబోతే శిబి చక్రవర్తి చరిత్ర లోకానికి తెలిసింది. మయూర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి పిల్లాడి ప్రాణాన్ని కాపాడాడు. ఆ తల్లి మయూర్ ను దీవించింది. రైల్వే శాఖ అభినందించింది. సాటి ఉద్యోగులు కరతాళధ్వనులతో ఆనందించారు. లోకమంతా పులకించింది. కొందరు మయూర్ కు బహుమతులు కూడా ఇస్తున్నారు. శతవిధాలా అతను ప్రశంసలకు, బహుమతులకు అర్హుడే.
సి సి టీ వీ ల్లో ఇదంతా రికార్డయి లోకం చూడగలిగింది. డబ్బు తీసుకుని ఓడిపోవడానికి ఆడేవారు, డబ్బుకోసం రంగులు పూసుకుని తైతక్కలాడే ఆటబొమ్మలు సెలెబ్రిటీలయిన కాలంలో- ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టగల మయూర్ ల వీడియోలు, వార్తలు వైరల్ కావాలి. మయూర్ కాపాడింది ఒక ప్రాణమే కావచ్చు. కానీ మనిషిలో మానవత్వాన్ని కూడా రక్షించాడు. సామాన్యుడి సాహసాన్ని కూడా గెలిపించాడు. ఎదుటి ప్రాణం కాపాడడమే పరమ ధర్మమన్న సకల ధర్మాలకు తలమానికమయిన ధర్మాన్ని కూడా కాపాడాడు. మాటలు రాయలేని ఆ వీడియో చూస్తే- ఇంకా ఎంతో రాయాల్సింది ఉందని మీకే అనిపిస్తుంది- చూడండి.
ఈవార్త ఇక్కడికి అయిపోలేదు. ధైర్య సాహసాల్లోనే కాదు- దాతృత్వంలో కూడా మయూర్ చాలా గొప్పవాడు. రైల్వే మంత్రి గుర్తించి, మయూర్ ను అభినందించాడు కాబట్టి రైల్వే శాఖ వెనువెంటనే అతడికి యాభై వేల రూపాయల అవార్డు ఇచ్చింది. అవార్డు మొత్తంలో సగభాగాన్ని తను కాపాడిన పిల్లాడి తల్లి చేతుల్లో పెట్టాడు మయూర్. నలుగురు కూర్చుని నవ్వే వేళల్లో మయూర్ ధైర్య సాహసాలను గుర్తుకు తెచ్చుకోవాలి. అంతకు మించి తనకన్నా లేనివారికి చేతనయిన సాయం చేసిన మయూర్ కు చేతులు జోడించి నమస్కరించాలి. నూటికో, కోటికో ఒక్కరు ఇలాంటివారు ఉండబట్టే- ఇప్పటికీ వర్షాకాలంలో నాలుగు చినుకులయినా నేల రాలుతున్నాయి.
-పమిడికాల్వ మధుసూదన్
Share this Article