కరప్షన్ అనగానే ఏ రెవెన్యూనో, పోలీస్ డిపార్ట్మెంటో ఫ్రంట్ రోలో కనిపిస్తుంది. లేకపోతే జనంతో ప్రత్యక్ష లావాదేవీలుండే ప్రభుత్వ శాఖలు బోనులో నిలబడుతుంటాయి. అయితే జనంతో సంబంధం లేకుండా పెద్దోళ్ల వ్యవహారాలు చక్కబెట్టేచోట అడిగేవారు లేరని సైలెంట్‌గా నొక్కేస్తుంటారు. తెల్ల ఏనుగులుండే ఓ డిపార్ట్మెంట్లో కోటిరూపాయలకు పైనే ఫ్రాడ్ గేటు దాటకుండా చూద్దామనుకున్నా.. చివరికి పోలీస్‌స్టేషన్‌లో కేసు దాకా వెళ్లింది. పెద్దోళ్లు చేసిన నిర్వాకానికి చిరుద్యోగులను చీటర్లుగా చూపే ప్రయత్నం జరుగుతోంది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ. పేరు వింటేనే అదేదో అండపిండ బ్రహ్మాండంలా ఉంటుంది. బయటి ప్రపంచంతో సంబంధం లేదు. అంతా అఫీషియల్. లక్షో రెండు లక్షలో చిల్లరమల్లర కక్కుర్తి పడే బ్యాచ్ ప్రతీచోటా ఉంటారు. కానీ ఇక్కడ లక్షలతో ఆగలేదు. కోటి దాటింది. దాదాపు 2 కోట్ల దాకా వెళ్లింది. కోటి డెబ్భై ఒక్క లక్షల ప్రభుత్వ సొమ్ముని సైలెంట్‌గా స్వాహా చేశారు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని కొందరు అధికారులు.
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థలో అధికారులు, సిబ్బంది కుమ్మక్కై కోటీ డెబ్భై లక్షలు కాజేసిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేను కూడా నమోదైంది. కంప్యూటర్ విభాగంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకౌంట్స్ డిపార్ట్మెంట్ల సిబ్బంది ఈ స్కామ్‌లో తలో చేయి వేసినట్లు సమాచారం. విషయం బయటికి పొక్కగానే ఉన్నతాధికారులు ఎంక్వయిరీ మొదలుపెట్టారు. కంప్యూటర్, అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ సిబ్బంది సుమారు 70 లక్షలు నొక్కేస్తే.. ఫెసిలిటీస్ సిబ్బంది దొంగల చేతికి తాళాలివ్వటంతో మరో కోటి రూపాయలకు పైగా హాంఫట్ అయ్యాయని సమాచారం.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఫైనాన్స్ అకౌంట్స్ లావాదేవీలన్నీ ఆన్లైన్లో జరుగుతాయి. అయినా అలవోకగా కంప్యూటర్ కళ్లు కప్పేశారు. కోటీ 70 లక్షల స్కామ్ కరోనా మొదలయ్యాక జరిగిందంటున్నారు. మరి అంతకుముందు నుంచీ ఎన్ని కోట్ల నిధులు పక్కదారి పట్టాయోనన్న అనుమానాలున్నాయి. నిష్పాక్షికంగా పూర్తి స్థాయి ఆడిట్ ఎంక్వయిరీ జరిగితే మానవ వనరుల అభివృద్ది సంస్థలో కళ్లు తిరిగే అక్రమాలు బయటపడతాయని భావిస్తున్నారు.
Ads
ప్రస్తుతం ఈ కోటీ 70లక్షల నిధుల దుర్వినియోగానికి సంబంధించి మాత్రం తూతూమంత్రంగానే విచారణ సాగుతున్నట్లు కనిపిస్తోంది. నిధులు దిగమింగిన శాఖాధిపతులను గండం నుంచి బయటపడేసేందుకు.. ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటువేసినట్లు ఇన్ఫర్మేషన్. కుట్రపూరితంగా జరిగిన నిధుల దుర్వినియోగంలో ఐటీ, ఫెసిలిటీస్, అడ్మిన్, అకౌంట్స్ ముఖ్య అధికారుల పాత్ర ఉందని క్యాంపస్ కోడైకూస్తున్నా.. కంప్లయింట్లో ఎక్కడా వారి ప్రస్తావనే లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మానవవనరుల అభివృద్ధి సంస్థలో మొత్తం 9 విభాగాలున్నాయి. రెండు శాఖల్లో అక్రమాలపై ప్రాథమిక దర్యాప్తులోనే కోటీ డెబ్భై లక్షల నిధుల దుర్వినియోగం బయటపడితే ఇక మిగిలిన విభాగాలన్నింటి మీద లోతుగా విచారణ జరిపితే ఇంకెన్ని లోగుట్టులు బయటపడతాయో మరి? ఉన్నతస్థాయి అధికార యంత్రాంగానికి శిక్షణ బాధ్యతలు కూడా చూసే మానవ వనరుల అభివృద్ధి సంస్థలో చీడపురుగుల్ని ఏరిపారేయకపోతే.. వెంటనే ప్రక్షాళనకు నడుం బిగించకపోతే సమాజానికి తప్పుడు సంకేతాలిచ్చినట్లు అవుతుంది…
Share this Article