ఆర్నెల్ల క్రితం వరకూ వణికించీ… హమ్మయ్య ఇగైపోయిందనుకున్న సమయంలో… దూసుకొచ్చిన కరోనా సెకండ్ వేవ్.. ఒకవైపు పెరుగుతున్న కేసుల సంఖ్య.. అంతకుమించి కలవరపెడుతున్న మరణాలు.. శవాల దిబ్బలుగా మారుతున్న దహనవాటికలు.. శ్మశాన వాటికల్లో నిరీక్షణలు.. అంతలోనే మూడో మ్యూటెంటంటూ వార్తలు.. ఇంకోవైపు, జనసామాన్యమంతా తినితొంగునే సమయాన ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ.. పట్టపగలేమో హోటళ్లు, స్టాల్స్, మాల్స్ తో హా కరోనా మనల్నేం చేస్తుంది లే అన్నట్లుగా.. ప్రభుత్వ ఆదాయం కోసమో, ప్రజల అవసరాల కోసమో తెలియందికాదుగానీ.. పట్టణాల్లో కనిపించే విచ్చలవిడితనం.. ఇంకోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను మించి గ్రామగ్రామాన స్వచ్ఛంద లాక్ డౌన్ తీర్మానాలు చేస్తూ అప్రమత్తమవుతున్న స్థానికసంస్థల పాలకవర్గాలు.. ఇంకోవైపు కిట్లూ లేక, టెస్ట్లూ లేక, టెస్టుల్లో క్లారిటీ లేక, క్యూలైన్లల్లో నిల్చోలేక.. ఆక్సిజన్ సిలిండర్లూ దొరక్క.. ఇలా భిన్నమైన పరిస్థితులను పౌరసమాజం కళ్లముందుంచి కన్ఫ్యూజ్ చేస్తోంది కరోనా! మరీ కాలాన మహమ్మారినెదుర్కొనే ప్రధానౌషధం .. మనో ధైర్యమేనా..? అందుకు ప్రోబయోటికైన మన ఇళ్లల్లో తోడు వేసుకునే పెరుగూ మరింత తోడ్పాటునందిస్తుందా..? ఇదేమాట.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్గి.. నాలుగు సార్లు నోబెల్ కు నామినేటైన ఓ తెలుగుతేజమైన.. మైక్రో బయాలజిస్ట్.. సెంటిస్టే చెప్పినప్పుడు ఎందుకు నమ్మకూడదు..? ఆయన మాటల్లో స్ఫూర్తితో కోవిడ్ పాజిటివ్ అనే వైరస్ ను.. అంతకన్నా పాజిటివ్ మోడ్ లో ఎందుకు జయించకూడదూ..?
అసలు భయాన్ని జయిస్తే కరోనాను జయించినట్టేనా…? కరోనాకు మనోధైర్యమే మందా..? మనమిళ్లల్లో తోడు వేసుకుని వాడే పెరుగు.. కరోనాను తరిమితన్నే.. ఓ ప్రోబయోటికా..? అవునన్నది కొందరు నిపుణుల వాదన. వారు చెబుతున్న కొన్ని విషయాలు విని.. వారిచ్చిన సూచనలు పాటిస్తే… ముఖ్యంగా మనోధైర్యంగా ఉంటే… పాజిటివ్ ను ముమ్మాటికీ మరింత పాజిటివ్ మోడ్ లో జయించొచ్చనే స్పిరిట్ మాత్రం మనకు కనిపిస్తుంది. దగ్గు, జలుబు, లేదా, జ్వరం వంటివి రాగానే పరీక్ష చేసి వెంటనే కరోనా పాజిటివ్ అని తేల్చేయడమే సైకాలజికల్ గా మనుషులను దెబ్బ తీస్తోందంటున్నారు ప్రముఖ మైక్రోబయాలజిస్ట్, వైరాలజిస్ట్, సైంటిస్ట్ డాక్టర్. మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. అది కరోనా వైరస్ వల్లే వచ్చిందా… లేక ఇంకేదైనా వైరస్ వల్ల వచ్చిందా అన్నది రూఢీ చేసుకోకుండానే జనాన్ని భయంలోకి నెట్టివేసే ప్రక్రియగా చెబుతారాయన. భయం వల్ల రోగనిరోధకశక్తి తగ్గిపోయి కూడా మనుషుల ప్రాణాలు పోతున్నాయని.. ధైర్యంగా ఉన్నప్పుడు శరీరంలో ఇమ్యూన్ సిస్టం కూడా అదే స్థాయిలో పనిచేస్తుందంటారాయన.
వైరస్ కి ట్రీట్మెంట్ లేదని చెబుతున్న డాక్టర్ ఎం. ఎస్. రెడ్డి… ఎందుకంటే వైరస్ కి అసలు లైఫే లేదంటారు. కేవలం అదొక ప్రోటీన్ పదార్థం మాత్రమే. దానికెలాగైతే లైఫ్ లేదంటున్నామో.. చావూ లేనిదది. దానిలోపల ఉండే జన్యుపదార్థాలైన ఆర్ఎన్ఏ జస్ట్ ఓ పరాన్నజీవని…అది హ్యూమన్ సెల్స్ లోకి వెళ్లినప్పుడు మాత్రమే విభజన జరిగి… పరిపరివిధాల పరివర్తనం చెందుతుందంటారు. సో డాక్టర్ ఎం. ఎస్. రెడ్డి లాంటివాళ్లతో పాటు… కొందరు నిపుణులు చెబుతున్నట్టుగా మనోధైర్యంతో పాటు.. పౌష్ఠికాహారంపై దృష్టి పెడితే కరోనాను సులభంగా జయించొచ్చన్న ఓ నమ్మకం మాత్రం కల్గకమానదు. కోవిడ్ 19 జబ్బు వల్ల భారతదేశంలో మరణాల సంఖ్య పెద్దగా లేదని… 130 కోట్ల ప్రజల్లో మృతుల సంఖ్య కేవలం రెండులక్షలేనని.. అదే అమెరికా వంటి దేశాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయన్నది డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి ఓ టీవి ఇంటర్వ్యూలోనూ చెప్పుకొచ్చారు. హ్యూమన్ బాడీలోని జీవకోశంలో చాలా సూక్ష్మజీవులుంటాయని… టెన్ ట్రిలియన్ సెల్స్ లో వంద ట్రిలియన్ సూక్ష్మజీవులు జీవకోశంలో ఉంటాయని.. వాటివల్ల రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుందంటున్నారు. కానీ భయం వల్ల అవి తగ్గిపోయి… రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోయే ప్రమాదముందంటున్నారు. ప్రతీ ఇంట్లో తోడు వేసుకునే పెరుగు ఓ ప్రోబయోటికని.. దాన్ని 12 గంటల పాటు అలాగే ఉంచి మూడుసార్లు కనుక రోజూ తాగితే… కరోనా శాతాన్ని తగ్గించవచ్చన్నది డాక్టర్ ఎం.ఎస్ రెడ్డి బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అదే బెస్ట్ ట్రీట్మెంటంటున్నారు.
Ads
వైట్ నేషన్ కంట్రీసైన అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ప్రోబయాటిక్సైనటువంటి పెరుగు వంటి పదార్థాలను ఎక్కువ తీసుకోకపోవడమే ఇలాంటి కరోనా వైరస్ అటాక్ కు ప్రధాన కారణమట కూడా. కరోనా కేసులు, మరణాలు, శ్మశానాల్లో పరిస్థితులు వంటి వార్తలు చూసి… ఒక రకమైన భీతి ప్రజల్లో ఆవహిస్తోందని.. ఇంట్లో చిన్నగా దగ్గినా, జ్వరం వచ్చినా, తుమ్మినా ఆసుపత్రికి వెళ్లమంటూ భయపడిపోయేవారి సంఖ్య పెరిగిపోయిందంటున్నారు. కేవలం దగ్గు, జ్వరం, జలుబు ఉన్నంత మాత్రాన కరోనా వచ్చినట్టు భయపడాల్సిన పని ఏమాత్రం లేదని… రుచి, వాసన కూడా కోల్పోయినప్పుడు మాత్రమే అనుమానించాల్సిన అవసరముందన్నది డాక్టర్ ఎం. ఎస్. రెడ్డి చెప్పే మాట. వ్యాక్సిన్ ఎంత ముఖ్యమో… అంతకంటే ఇమ్యూనిటీ ముఖ్యమన్నది కూడా ఆయన మాటల్లో ప్రస్ఫుటంగా ధ్వనిస్తోంది.
వైద్యులు, వైరాలజిస్టులు, ఆయుర్వేద నిపుణులు… ఇలా కరోనాపై ఎందరో ఎన్నో రకాల తమకు తోచిన రీతిలో ప్రచారం చేస్తున్న క్రమంలో… నాల్గుసార్లు నోబెల్ బహుమతి నామినీ అయిన డాక్టర్ ఎం. ఎస్. రెడ్డి వంటి వారి మాటలు ఈ కరోనా కాలంలో ఎంతో విలువైనవే. బిలియనీర్ సైంటిస్ట్ గా.. చీజ్ రెడ్డిగా.. చీజ్ కింగ్ గా కూడా ప్రసిద్ది చెందిన డాక్టర్ ఎం. ఎస్. రెడ్డి… లాక్టిక్ సంస్కృతులు, ప్రోబయోటిక్స్ పై 80 శాస్త్రీయ పత్రాలను ప్రచురించి.. 150 కి పైగా అమెరికా, ఇతర అంతర్జాతీయ పేటెంట్లను కలిగి ఉన్నారంటే ఆయన పరిశోధనలు ఏ స్థాయిలో సాగాయో ప్రత్యేకంగా చర్చించాల్సినవసరం లేదు. ముఖ్యంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రోబయోటిక్స్ ను ఉపయోగించి.. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసేలాభారతీయ ఆయుర్వేద వ్యవస్థను అప్ గ్రేడ్ చేయాలన్న కాంక్ష కూడా ఈ నెల్లూరు జిల్లావాసి.. అచ్చ తెలుగువాడైన మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలో కనిపించే ప్రధానాకాంక్ష.
అమెరికన్ డెయిరీ అండ్ ఫుడ్ కన్సల్టింగ్ లాబోరేటరీస్ (ADFAC) ఫౌండరైన రెడ్డి గురించి మరో ఆసక్తికరమైన విషయమూ సందర్భం కాకపోయినా ఇప్పుడోసారి కల్పించుకుని చెప్పుకోవాల్సి ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ను లేబోరేటరీలో అభివృద్ధి చేసిన బ్యాక్టీరియాతో శుభ్రపర్చే ఓ ప్రాజెక్ట్ కు ఈయన నేతృత్వం వహించాల్సి ఉండగా… ఎందుకనో అది పూర్తికాకుండానే ఆగిపోయిందట. అయితే కరోనా కాలాన… కేవలం చావు వార్తలు, పబ్లిక్ ను ప్యానిక్ చేసే విశ్లేషణలను మాత్రమే పంచే మీడియా… ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ గోల్డ్ మెడల్ వంటి పురస్కారంతో పాటు.. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకున్న డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి లాంటివాళ్ల విశ్లేషణలతో కరోనా పాజిటివ్ నుంచి ప్రజల్లో మనోధైర్యాన్ని కల్పించే పాజిటివ్ థింకింగ్ వైపు నడిపించాల్సి ఉంది…… by… రమణ కొంటికర్ల
Share this Article