సార్… మీ కార్టూన్ ఏమాత్రం బోధపడటం లేదు… ఇలాంటి కార్టూన్లు గీసినప్పుడు, పాఠకుడు జుత్తు పీక్కునే అవసరం లేకుండా… ఆ కార్టూన్ అర్థ వివరణ, పరమార్థ వివరణ కూడా పనిలోపనిగా ప్రచురిస్తే మేలేమో ఆలోచించగలరు… ఎస్, గర్విద్దాం… అర్ధశతాబ్దం తరువాత ఓ తెలుగువాడు మన దేశ అపెక్స్ కోర్టుకు చీఫ్ అవుతున్నందుకు అందరమూ ఆనందిద్దాం… కానీ అభినందన మరీ విపరీత వ్యక్తి పూజ స్థాయికి అవసరమా యువరానర్..? సగటు తెలుగు హీరో అభిమాని స్థాయిలో మన పాత్రికేయం కూడా కటౌట్లు కట్టి, నిలువెత్తు గజమాలలు వేసి, పాలాభిషేకాలు చేసి, తెరపై కాగితపుముక్కలు చల్లాలా..? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాధ్యత ఉత్కృష్టమైనదే… కానీ అదేమీ రాజ్యాధికారం కాదు, ఆలెక్కన రాజ్యాధికారమూ విపరీత ప్రస్తుతికి అర్హమూ కాదు…
బాస్ ఆలోచనలకు తగినట్టు కార్టూనిస్ట్ శ్రీధర్ ఏ రేంజ్ కార్టూనైనా గీస్తాడు, తన ఉద్యోగధర్మం, తన ఇష్టం… కానీ పాఠకుడు ఎలా ఫీలవుతున్నాడనేది కూడా ప్రధానమే కదా… అదంతా ఆలోచిస్తే అది ఈనాడు ఎందుకవుతుంది అంటారా..? సరే… ఒక నమస్తే తెలంగాణ గతంలో ఎవరికీ ఇవ్వనంత కవరేజీ కుమ్మేసింది ఇవ్వాళ… ఫస్ట్ పేజీలో అత్యంత ప్రాధాన్యవార్త ప్లస్ రెండు ప్రత్యేక పేజీలు… ఇంకో సగం పేజీ వార్తలు… ఏమిటీ వైపరీత్యం అని విస్మయపడుతూ, ఈనాడు తిరగేస్తే ఈ కార్టూన్ పదిరెట్లు దిమ్మెక్కిపోయేలా చేసింది… సుప్రీం కోర్టు చీఫ్ కొలువు అంత మహిమాన్వితమా..? అలాగైతే మొత్తం జాతీయ మీడియా ప్రత్యేక సంచికలతో అదరగొట్టాలి కదా… పోనీ, మన తెలుగువాడు కాబట్టి కాస్త ఎక్కువ భజించినా పర్లేదు, మనమే కదా ఓన్ చేసుకోవాల్సింది, సో, కాస్త ఎక్కువ ప్రాధాన్యం సమంజసమే అనుకుందాం… కానీ మరీ ఈ రేంజా..?!
Ads
ఇంతకీ న్యాయదేవత కొత్త జస్టిస్ గారికి ఏం అప్పగిస్తోంది… ఏకంగా తన న్యాయత్రాసును ఇచ్చేస్తోంది… సో, ఇక న్యాయ దేవతకు ఆ త్రాసు గట్రా ఏమీ అవసరం లేదనేనా రామోజీరావు గారి భావన..? గతంలో సుప్రీంకు ఏ చీఫూ పనిచేయలేదా..? ఇప్పుడు మాత్రమే ఏకంగా న్యాయదేవత తన బాధ్యతల్ని అప్పగించేసే వారసత్వం వచ్చిందని సంతోషపడుతోందా..? అందుకేనా ఓ ధర్మసుత్తిని కూడా బహూకరించి విజయీభవ అని ఆశీర్వదిస్తోందా..? ఈ స్తుతి సరే, ఈ విజయీభవ అనే ఆశీర్వచనం దేనికి..? ఏ పోరాటంలో విజయం అభిలషిస్తున్నది ఈనాడు..? దేనిపై యుద్ధానికి వెళ్లాలని దీవిస్తోంది..? ఇన్నేళ్లూ ఆ పోస్టులో ఉన్నవాళ్లు ఎవరూ ఆ యుద్ధం చేయలేదా..? న్యాయదేవతకు ఎవరి మీదా ఆ నమ్మకం కలగలేదా..? ఏమిటీ స్తుతి..? అందరమూ అనుకుంటాం గానీ, ఆంధ్రజ్యోతి వాడే కాస్త నయం… మరీ డప్పు పట్టుకుని బజారుకొచ్చి వాయించలేదు… అలాగని ఈ వార్తకు ప్రాధాన్యమూ తగ్గించలేదు… బ్యాలెన్స్డ్… సదరు ప్రధాన న్యాయమూర్తిని వెనకేసుకురావడంలో ఆంధ్రజ్యోతికి మించినదేముంది..? సదరు పత్రికకు పెద్ద సారు ఎంతటి ఆరాధనీయులో జగన్విదితమే… సారీ, జగద్విదితమే కదా… ఐనాసరే, ఈ ఈనాడు కార్టూన్ స్థాయి స్తుతికి పూనుకోలేదు… మరి సాక్షి..? లోలోపల తీవ్ర అసంతృప్తి… అందుకే లోపల పేజీల్లో ఓ వార్త వేసేసి.., రాశాంలే, వార్త వేశాంలే అనిపించింది… సో, అంశం ఏదైనా సరే… మన పత్రికల ఓవరాక్షన్కైనా, అండర్ ప్లే చేసినా ప్రతిదానికీ ఓ లెక్క ఉంటుంది…!! బై ది వే… సుప్రీం కొత్త బాస్ కు “ముచ్చట” మన పూర్వక అభినందనలు…
Share this Article