Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘ఇంకేదో కావాలనే’ మోజు, ఆకర్షణల ముందు పాతివ్రత్యాలు బలాదూర్…

May 22, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… శశిథరూర్ , శశిథరూర్ వంటి ‘పార్టీ’వ్రత్యం లేని ప్రజాప్రతినిధులు తప్పకుండా చూడవలసిన సినిమా . భాషా సమస్య కూడా లేదు . తమిళంలో , కన్నడంలో కూడా ఉంది . హిందీలో కూడా ఉందేమో ! ఈ పార్టీవ్రత్యం లేని ప్రజాప్రతినిధులను ఎందుకు ప్రస్తావించానో తెలుసుకోవాలంటే ఈ సినిమా కధ చదవాలి మీరు . అయితే చదవండి .

అనగనగా ఓ ఊళ్ళో ఓ బావ (శోభన్ బాబు) ఉంటాడు . ఆయనకు ఇద్దరు మరదళ్ళు . పెద్ద మరదలు రాధిక , చిన్న మరదలు సుహాసిని . రాధికను శోభన్ బాబు బాగా ఇష్టపడతాడు . రాధిక ఎంత సేపటికీ దర్జాల మీద , డబ్బు మీద మోజు . అవన్నీ పుష్కలంగా ఉన్న ఓ చిన్నబాబుని (మురళీమోహన్) ఇష్టపడుతుంది .

Ads

చిన్నబాబుకు కూడా రాధిక అంటే ఇష్టం . చిన్న మరదలేమో బావ శోభన్ బాబుని ప్రేమిస్తుంది . మరదళ్ళ తండ్రి సీనియారిటీ ప్రకారం పెద్ద మరదలితో బావ పెళ్లి చేస్తాడు . బావతో ఇష్టం లేని కాపురం చేసి ఓ బిడ్డను కూడా కంటుంది రాధిక . అయినా చిన్నబాబు ఆస్తి , హంగామా మీద మోజు చావదు .

చిన్నబాబుకు రాధిక మీద ప్రేమ చావదు . బావని , బిడ్డను వదిలేసి చిన్నబాబుతో పట్నానికి లేచిపోతుంది . గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి బావ , మరదలి పెళ్ళిని రద్దు చేసి , ఆమెకు శాశ్వత గ్రామ బహిష్కరణ చేస్తారు . తండ్రి పిండం కూడా పెట్టేసి , అల్లుడికి చిన్న కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తాడు .

పట్నానికి లేచిపోయిన రాధిక చిన్నబాబుతో కాపురం చేయలేక సతమతమవుతుంది . చిన్నబాబు రాధికను గ్రామానికి పంపేస్తానని చెప్పి ఆత్మహత్య చేసుకుంటాడు . గ్రామంలోనికి ప్రవేశం లేని రాధిక ఊరి బయటున్న చిన్నబాబు చిన్న ఇంట్లో ఉంటుంది . ఎవరి ఆదరణ లేని రాధిక ఎటూ , ఎవరికీ కాక చనిపోతుంది .

చనిపోయే ముందు బావను తన అంత్యక్రియలు చేయమని ప్రాధేయపడుతుంది . ఆమె చనిపోయిన తర్వాత గ్రామంలో ఎవరూ అంత్యక్రియలకు సహకరించరు . బావ ఒక్కడే చేతిలో మోసుకుంటూ తీసుకుని వెళ్లి కొరివి పెట్టి , చిన్న మరదలు , బిడ్డతో గ్రామ కట్టుబాటు ప్రకారం ఊరు విడిచి వెళ్ళిపోతాడు . ఇదీ కధ .

ఎవరికి, ఎంత, ఎలా అర్థం అయితే అలా చేసుకోవచ్చు . ఈ సినిమాలో మాస్టారి పాత్ర వేసిన అల్లు రామలింగయ్య రాధికకు , మురళీమోహనుకు తలంటి పోసే సీన్లో చెప్పే గొప్ప మాటలను ప్రస్తావించాలి నేనిక్కడ .

రావణుడు అపహరించిపోతే రాముడు వచ్చి రక్షిస్తాడని సీతమ్మ తల్లి రాముడిని తలుచుకుంటూనే కూర్చుంది . భర్త కుష్టు రోగంతో ఉన్నా , వేశ్యను కూడా ఒప్పించిన సుమతి గురించి చెపుతాడు మాస్టారు . అలాంటి పతివ్రతల దేశం అని చెపుతాడు .

కలికాలంలో ఉన్నాం . ఆ నీతి కధలు ఇప్పుడు రుచించవు . కనీసం విడాకులు తీసుకుని అయినా అఘోరించవచ్చు . సమాజానికి ఏదో ఒక ఆర్డర్ ఉండాలి . ఆ ఆర్డర్ లేకపోతే భార్యలకు , భర్తలకు , ఎవరికీ రక్షణ ఉండదు .

తమిళంలో సక్సెస్ అయిన Engeyo Ketta Karal సినిమాకు రీమేక్ మన బావామరదళ్ళు సినిమా . తమిళంలో రజనీకాంత్ , రాధ , అంబిక నటించారు . కన్నడంలో Mididi Hrudayagalu గా రీమేక్ అయింది . అక్కడ అంబరీష్ , శ్రుతి , నిరోషలు నటించారు .

కోదండరామిరెడ్డి మార్క్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది సినిమాలో . టైటిల్సునే లక్ష్మణరేఖ కధ బొమ్మలతో వేసారు . లక్ష్మణరేఖ దాటిన సీతమ్మ కష్టాలు తెలియని భారతీయుడు ఎవరుంటారు !? చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా బాగుంటాయి .

ఓసోసి లక్కపిడతా , అందగత్తె అందదాయె , వెండి చందమామలు డ్యూయెట్లు అందంగా ఉంటాయి . ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు , నీలాలు కారితే నే చూడలేను పాట ఆర్ద్రంగా , శ్రావ్యంగా ఉంటుంది . గ్రామ నేపధ్యం కాబట్టి ఓ భారీ గ్రూప్ డాన్స్ ,

దానికో సామూహిక నృత్యం , పాటా ఉండాలిగా . కోకలకెదిగి పోయారమ్మా అంటూ జానపద శైలిలో సాగుతుంది పాట . చిత్రీకరణ బాగుంటుంది . వేటూరి వారు బాగా రొమాంటిగ్గానే వ్రాసారు . కోదండరామిరెడ్డి కూడా రాఘవేంద్రరావు లాగానే పాటల్ని అందంగా చిత్రీకరిస్తాడు కదా !

ప్రధాన పాత్రల్లో రావు గోపాలరావు , అల్లు , అన్నపూర్ణ , గుమ్మడి , నూతన్ ప్రసాద్ , శ్రీలక్ష్మి , ప్రభృతులు నటించారు . బుల్లి మీనా నటించింది . సత్యమూర్తి డైలాగ్సుని చాలా పదునుగా వ్రాసారు . మాస్టారిగా కొన్ని సీన్లలో అల్లు రామలింగయ్య నటన గొప్పగా ఉంటుంది .

ఒక్క నూతన్ ప్రసాద్ బేవార్సు పాత్రను మినహాయించి సినిమాలో పాత్రలన్నీ సాధు పాత్రలే . అందరూ మంచివారే . కాకపోతే రెండు పాత్రలు బలహీన మనస్తత్వం కల పాత్రలు . గాలికి పోయే విస్తరాకులు .

శోభన్ బాబు చాలా బాగా నటించారు . కొన్ని సీన్లలో సోగ్గాడు కనిపిస్తాడు . రాధిక , సుహాసిని , రావు గోపాలరావుల నటనని మెచ్చుకోవలసిందే . ముఖ్యంగా రావు గోపాలరావుది . క్లైమాక్స్ సీన్ మహిళలకు బ్రహ్మాండంగా నచ్చేస్తుంది . ఫుల్ సెంటిమెంట్ , ఎమోషన్ ఉన్న సినిమా . మహిళాలోకం బాగా ఆడించింది .

18 సెంటర్లలో వంద రోజులు ఆడిందని యూట్యూబులో ఒక వీడియో చెప్పింది . అది నిజమా కాదా అనేది సినిమా పండితులు శోభన్ బాబు అభిమానులు చెప్పాలి . ఏదేమయినా సినిమా బాగుంటుంది . ఫస్ట్ హాఫ్ స్లోగా నడిచినా సెకండ్ హాఫ్ స్పీడుగా సాగుతుంది .

సినిమా భారీగా నడుస్తుంది . ఫేమిలీ వేల్యూస్ , సామాజిక కట్టుబాట్లు , మంచీచెడూ ఆలోచన , వగైరా విషయాలను ఇష్టపడే వారికి నచ్చుతుంది . 1984 లో విడుదలయిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . శోభన్ బాబు అభిమానులు , శశిథరూర్ వంటి ప్రజాప్రతినిధులు తప్పక చూడవలసిన సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలియదు… నంబాల మరణంతో నా మనస్సు ఎందుకు చివుక్కుమంది..!
  • డ్రాగన్ రాజు కావచ్చు…. కానీ జామపండు రారాజు… ఆరోగ్య చక్రవర్తి…
  • వై నాట్..? జూనియర్ ఎన్టీఆర్ భిన్న పాత్రల్ని ఎందుకు చేయకూడదు…?!
  • ‘ఇంకేదో కావాలనే’ మోజు, ఆకర్షణల ముందు పాతివ్రత్యాలు బలాదూర్…
  • ఒక తమిళ కణ్ణదాసన్…. ఒక తెలుగు వేటూరి… వేరే పోల్చలేను సారీ…
  • ఇడ్లీ నూడుల్స్ కాదు… అసలు ఇడ్లీ రకమే కాదు…. పక్కా ఇడియప్పం…
  • ఎక్కడిదో ఈ దుఃఖ మేఘం, ఆగకుండా వెక్కి వెక్కి కురుస్తోంది… కానీ..?
  • పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?
  • పెను విధ్వంసం సృష్టించగల ఓ భారీ విపత్తు వేగంగా సమీపిస్తోంది..!!
  • ఆ కేన్సర్ స్పెషలిస్టు… రిటైరయ్యాక సిద్ధవైద్యంలోకి..! ఎందుకు, ఎవరు..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions