Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలియదు… నంబాల మరణంతో నా మనస్సు ఎందుకు చివుక్కుమంది..!

May 22, 2025 by M S R

.

బొబ్బిలి పులి సినిమా క్లైమాక్స్ లో కోర్టు సీను ఎంత బాగా పండిందో తెలిసిందే.. ఆ సీనులో కోర్టు బోనులో దోషిగా హీరో పాత్రధారి ఎన్టీఆర్, జడ్జి పాత్రధారి మధ్య సంవాదం ఇలా ఉంటుంది…

ఎన్టీఆర్ : మేజర్ గా యుద్ధంలో నేను 400 మందిని చంపితే అందరూ పొగిడారు. మహా వీర చక్ర అవార్డు ఇచ్చారు.. అదే ఇప్పుడు దేశంలో ఉన్న శత్రువులను చంపితే… దేశ ద్రోహి అంటున్నారు.. ఉరి శిక్ష వేయాలని అంటున్నారు.
జడ్జ్ : అప్పుడు మీరు చంపిన వాళ్ళు మన శత్రుదేశ సైనికులు.
ఎన్టీఆర్ : ఏం, తమ దేశాన్ని కాపాడుకోడానికి వచ్చిన వీరులు అని అనుకోవచ్చు కదా..
జడ్జ్ : అనుకోవచ్చు…

Ads

ఈ సీను ఎందుకు చెప్పాను అంటే…
మనం బతికే మట్టిని బట్టీ… మనం ఇష్టపడే భావజాలాన్ని బట్టీ మన అభిప్రాయాలు, స్పందనలు, ప్రతిస్పందనలు, భావాలు, భావావేశాలు, వాదాలు, సంవాదాలు, వాగ్వాదాలు మారిపోతూ ఉంటాయి. ఏది సరైంది అన్నది ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. ఎవరి కోణంలో వాళ్ళ స్పందన, అభిప్రాయమే సరైంది.

కొన్ని సార్లు మనకే తెలియకుండానే మనలో దాగున్న ఓ తెలియని భావం హఠాత్తుగా బయటపడి మనల్నే ఆశ్చర్యపరుస్తుంది.. నాకు ఎదురైన కొన్ని పరస్పర విరుద్ద అనుభవాలు చెబుతా…

– 2017 లో మేము శ్రీలంక పర్యటనకు వెళ్ళాం… అక్కడ కొలంబో చుట్టు పక్కల కొన్ని ప్రదేశాలు చూసిన తరువాత… శ్రీలంక ఉత్తర సరిహద్దును అనుకుని ట్రింకోమలి ప్రాంతంలో హిందూ మహాసముద్రం ఒడ్డున ఉన్న శాంకరీ దేవి ఆలయం సందర్శించాలి అనుకున్నాం.

అష్టాదశ శక్తి పీఠాల్లో 17 శక్తి పీఠాలు భారత దేశంలో ఉంటే ఒక శక్తి పీఠం శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. భారత్ లో ఉన్నవి కొన్ని చూశాం.. మిగిలినవి కూడా తరువాత చూడొచ్చు. శ్రీలంక మళ్ళీ వస్తామో రామో… ఈసారే చూసేయాలి అనుకున్నాం.

ట్రింకోమలి ఒకప్పుడు ఎల్టీటీఈ పూర్తి ఆధిపత్యం చలాయించిన ప్రాంతం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలీదు .. అందుకే మా టూరిస్ట్ గైడ్ ( ఆయన శ్రీలంక వ్యక్తి… సింహళీయుడు ) పిలిచి మాట్లాడాను.

” ట్రింకోమలి ఇప్పుడు వెళ్లొచ్చా… ఇబ్బంది ఏమీ లేదా” అని అడిగాను..
ఆ గైడ్ వెంటనే…
” ఎంచక్కా వెళ్లొచ్చు… ఇప్పుడు అక్కడ ఉగ్రవాదులు లేరు కదా.. అందర్నీ చంపేశారు… అంతా ప్రశాంతంగా ఉంది ‘ అని అన్నాడు.

అంతే… నా మనసు చివుక్కు మంది. ఏదో తెలియని బాధ గుండెను పిండేసింది.
ఎల్టీటీఈ వాళ్లను ఉగ్రవాదులని అన్నాడే అని గిలగిలలాడింది. ఎందుకు ఈయన్ని అడిగానే అని బాధ పడ్డా.. నిజానికి నేను ఎల్టీటీఈ సానుభూతివరుడిని ఏమాత్రం కాను. పైగా మన దేశంలోకి ప్రవేశించి మరీ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసిన ఎల్టీటీఈ మీద ఆగ్రహం కూడా ఉంది.

ఎల్టీటీఈ పట్ల కఠినంగా ఉండాలి అనే జయలలిత విధానాన్ని సమర్థిస్తాను కూడా.. అదే సమయంలో ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ అంటే పెద్ద పులి అనే ఒక హీరోవర్షిప్ చిన్నప్పటి నుంచి కూడా లోలోపల ఉందనేది కాదనలేను.

ఆ శ్రీలంక టూరిస్ట్ గైడ్
వాళ్ళను ఉగ్రవాదులు… వాళ్లను తుడిచిపెట్టేశాం అనేసరికి ఏదో తెలియని బాధ మనసును మెలిపెట్టింది.
కాసేపు అయ్యాక నన్ను నేను స్థిమితపరచుకున్నా.. పంజాబ్ లో ఉండే ఖలిస్తాన్ వాళ్ళు మనకు ఉగ్రవాదులు అయినప్పుడు..
కశ్మీర్ లో ఉండే లష్కరే తోయిబా వాళ్ళు మనకు ఉగ్రవాదులు అయినప్పుడు…
ఎల్టీటీఈ వాళ్ళు శ్రీలంక వాళ్ళ కు ఉగ్రవాదులే అవుతారు కదా అని నాకు నేనే సర్ది చెప్పుకున్నా. కానీ ఆ శ్రీలంక గైడ్ అన్న మాటలు గుర్తుకు వస్తే ఇప్పటికీ కాస్త బాధగానే ఉంటుంది. ఎందుకో తెలియదు..

 

– 2024 డిసెంబర్లో జమ్ము – కశ్మీర్ వెళ్ళాను. దాల్ సరస్సులో బోట్ షికారు చేస్తూ ఆ బోటు నడుపుతున్న ఒక 70 ఏళ్ళు పైబడిన పెద్దాయనతో మాటలు కలిపాను.. ఆర్టికల్ 370 రద్దు తరువాత పరిస్థితి ఎలా ఉంది… టూరిజం ఎలా ఉంది తదితర విషయాలు అడిగా. ఆయన కూడా బాగా చెప్పాడు…

కశ్మీర్ ప్రశాంతంగా ఉంటేనే… టూరిస్టులు వస్తేనే మాకు బతుకు దెరువు దొరుకుతుంది అని చాలా విషయాలు చెప్పాడు.. ఓకే అనుకుంటూ… పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా.. సరిహద్దుకు అటువైపు ఉన్న కశ్మీర్ లో మీకు బంధువులు ఉన్నారా… మీరు అప్పుడప్పుడు అయినా కలుస్తూ ఉంటారా అని అడిగాను.

ఆ పెద్దాయన వెంటనే..’ ఓ అజాద్ కశ్మీరా…! మా బంధువులు అక్కడా ఉన్నారు.. వాళ్లను కలసి చాలా ఏళ్ళు అయింది ‘ అన్నాడు. అంతే… ఆజాద్ కశ్మీర్ అనే మాట ఆయన అనగానే మనసు చివుక్కుమంది.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అని కదా మనం అంటాం… పాకిస్తాన్ వాళ్ళు మన కశ్మీర్ ను ఇండియా ఆక్రమిత కశ్మీర్ అంటారు. అది సహజం.

కానీ భారత దేశంలో ఉంటూ ఈయన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ను ఆజాద్ కశ్మీర్ .. అంటే స్వాతంత్ర్య కశ్మీర్ అనేశాడు ఏమిటీ అనుకున్నా… అంటే వీళ్ళు తమను తాము భారతీయులుగా భావించడం లేదా… కశ్మీర్ ను భారత్ లో అంతర్భాగంగా ఇప్పటికీ గుర్తించడం లేదా… కశ్మీర్ ను భారత్ ఆక్రమించింది అనే అనుకుంటున్నారా… సరిహద్దుకు అటువైపు ఉన్న కశ్మీర్ స్వాతంత్ర్య దేశంగా భావిస్తున్నారా… ఎప్పటికయినా తాము కూడా ఆ కశ్మీర్ తో విలీనమై స్వాతంత్ర్య దేశంగా ఆవిర్భవించాలన్నదే లక్ష్యమా… ఇలా ఎన్నో ఆలోచనలు మనసులో ఒకసారిగా వచ్చిపడ్డాయి..

శ్రీలంకలో ఆ టూరిస్ట్ గైడ్ తన దేశ కోణంలో… తాను బతుకుతున్న మట్టి మీద అభిమానంతో ఎల్టీటీఈ వాళ్లను ఉగ్రవాదులు అన్నాడు.. ఆయన కోణంలో అది సరైందే. కానీ ఇక్కడ కశ్మీర్ లో ఈయన భారత దేశంలో బతుకుతూ… భారత ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటీ అని చిన్న కోపం వచ్చింది కూడా..

మరి భారత ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలు కశ్మీర్ లో గుమ్మరించడం ఎందుకు… టూరిజం తప్ప మరో బతుకు దెరువు లేని వీళ్ల కు… మిగిలిన దేశ ప్రజల పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇక్కడ ప్రజలకు సంక్షేమ పథకాలు, రోడ్లు, రైళ్లు, విమానాలు, విద్య, వైద్య, సమాచార, ఇతర మౌలిక వసతుల కోసం ఖర్చు చేయడం ఎందుకు….

సరిహద్దుల్లో మన సైనికులు ప్రాణాలొడ్డి మరీ పహారా కాయడం ఎందుకు…. ఇలా ఎన్నో అనుకున్నా.. ఆ పెద్దాయన అక్కడ స్థానికంగా వాడుక భాషలో అని ఉంటాడు… అంతకుమించి ఏమీ లేదు అని నాకు నేను నచ్చజెప్పుకున్నా… చిన్నపుడు మన సోషల్ స్టడీస్ పుస్తకాల్లో కూడా ఆజాద్ కశ్మీర్ అనే రాసిన విషయం గుర్తుకు వచ్చింది.. తరువాత తప్పు తెలుసుకుని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అని మార్చారు.. కానీ దాల్ సరస్సు వద్ద ఆ పెద్దాయన మాట ఏమాత్రం  నచ్చలేదు..

అయినా ఓ కశ్మీరీగా, అదీ 70 ఏళ్ల కు పైగా వయసు అంటే… దేశ విభజన అనంతరం తొలినాళ్లలో మనసులో పడిన ముద్ర అలానే ఉంటుంది కదా అని అనుకున్నా. అయినా భారత్ లో ఉండే కశ్మీరీలు స్థానికంగా తమ వాడుక భాషలో అయినా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ను ఆజాద్ కశ్మీర్ అని ఎలా అంటారు అనే కోపం మనసులో రగులుతూనే ఉంది…

– మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ రావును పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. మా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ స్థాయికి చేరిన ఆయన తాను ఎంచుకున్న బాటలోనే, ఆ అడవుల్లోనే అంతమయ్యారు.

ఆ సమాచారం తెలియగానే అసంకల్పితంగానే మనసు బాధ పడింది. అవునా… నిజమేనా అని మనసు ఏదోలా అయింది. అంతలోనే అదేంటి అలా ఫీల్ అవుతున్నా అని నాకు నేనే అనుకున్నా. ఎందుకంటే మావోయిస్టు పార్టీ సిద్ధాంతానికి, అంతకు మించి ఆ పార్టీ ఆచరణ మార్గానికి నేను బద్ద వ్యతిరేకిని.

మావోయిస్టుల నిబద్దత పట్ల మాత్రం గౌరవం ఉంది. అంత మాత్రాన వారిని ఏ కోశానా సమర్థించే ప్రసక్తే లేదు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి రావాలి. ప్రజాస్వామ్యబద్ధంగానే తమ లక్ష్యాలు సాధించాలి.. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న విధానాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థే అత్యుత్తమమైంది.. అంతే గానీ ఆచరణ సాధ్యం కాని ఊహలోక స్వర్గంలో విహరించే .. అంతకు మించి అధికారం వస్తే నియంతృత్వానికి దారితీసే మావోయిస్టు సిద్ధాంతానికి బద్ద వ్యతిరేకిని నేను.

మావోయిస్టు లు జన జీవన స్రవంతిలోకి రావడం….లేదా అడవుల్లోనే అంతం కావడం అనే రెండే మార్గాలు ఉన్నాయన్నది నా గట్టి నమ్మకం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల విధి నిర్వహణలో ” ఎన్కౌంటర్లూ” ఒక భాగమే అని భావిస్తా. అటువంటి నేను నంబాల కేశవ రావు ఎన్కౌంటర్ సమాచారం తెలియగానే బాధ పడ్డాను.

మరి మా ప్రాంతం వ్యక్తి అనా… !? నమ్మిన సిద్దాంతం కోసం చివరి వరకూ కట్టుబడి నేలకొరిగినవాడు అనా…!?
అంటే ఇదీ అని చెప్పలేను.. కానీ కాస్త బాధ వేసిందన్నది మాత్రం నిజం.
ఒకప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్ స్థాపనలో కీలకంగా వ్యవహరించి తరువాత పూర్తిగా రాజకీయ నేతగా మారిన ఒకాయన మావోయిస్టు నేత ఆజాద్ పోలీసుల “ఎన్కౌంటర్’ లో మరణించాడని టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ నాతో చెప్పిన మాటలు మరోసారి గుర్తుకు వచ్చాయి…

” మీరు మావోయిస్టులను, వారి సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తే వ్యతిరేకించండి… వారి నిబద్దతను మాత్రం శంకించకండి.. అడవుల్లో ఎన్కౌంటర్ అయిన ఒక్క మావోయిస్టుకు కూడా కాస్త బొజ్జ కూడా ఉండదు. అన్నీ డొక్కు కడుపులే ఉంటాయి. వాళ్లేమీ సుఖాల కోసం అడవుల్లోకి వెళ్ల లేదు.. అది మాత్రం గుర్తించండి చాలు ‘ అని అన్నారు.

ఆ తరువాత టీవీ చానల్స్ చూపించిన, మర్నాడు పేపర్లో వచ్చిన ఆజాద్ మృత దేహం ఫోటో చూశా.. ఆయనకు ఏమాత్రం బొజ్జ లేనే లేదు. అప్పటి నుంచి ఎన్కౌంటర్ అయిన ప్రతి మావోయిస్టుకు బొజ్జ ఉందా లేదా అని చూడటం ఒక అలవాటుగా మారింది. ఒక్కరికీ కూడా లేనే లేదు.

( కొవిడ్ అనంతర తీవ్ర అనారోగ్య సమస్యలతో మరణించిన అక్కిరాజు హరగోపాల్ ( ఆర్కే ) మృత దేహం మాత్రం బాగా ఉబ్బి ఉంది. అది పోస్టు కొవిడ్ సైడ్ ఎఫెక్టుల వల్లే ). తాజాగా ఎన్ కౌంటర్ అయిన మావోయిస్టు సుప్రీం కమాండర్ నంబాల కేశవ రావుకూ కాస్త బొజ్జ గానీ ఒంటి మీద కాస్తయినా కొవ్వు గానీ లేనే లేవు.

మావోయిస్టు పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే నేను… నంబాల కేశవ రావు ఎన్కౌంటర్ సమాచారంతో అసంకల్పితంగానే బాధ పడ్డాను.. మనసు చివుక్కుమంది.. అదేమీ తెచ్చి పెట్టుకున్నది కాదు.. మనకు తెలియకుండా మనసు పొరల్లో దాగుండే చిన్న తడి చివ్వున చిమ్ముతుంది. ఎందుకంటే… కొన్ని సార్లు మనసు మన మాట వినదు.. ! అంతే..! [[ – వడ్డాది శ్రీనివాస్ ఫేస్‌బుక్ వాల్ నుంచి స్వీకరణ  ]]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రమ్యకృష్ణ నిజమే చెప్పింది…. మళ్లీ లైంగిక దోపిడీ వార్తల్లోకి వచ్చింది…
  • ఆ అద్భుత ఆధ్యాత్మిక యాత్ర మళ్లీ ఆరంభం అవుతోంది..!
  • తెలియదు… నంబాల మరణంతో నా మనస్సు ఎందుకు చివుక్కుమంది..!
  • డ్రాగన్ రాజు కావచ్చు…. కానీ జామపండు రారాజు… ఆరోగ్య చక్రవర్తి…
  • వై నాట్..? జూనియర్ ఎన్టీఆర్ భిన్న పాత్రల్ని ఎందుకు చేయకూడదు…?!
  • ‘ఇంకేదో కావాలనే’ మోజు, ఆకర్షణల ముందు పాతివ్రత్యాలు బలాదూర్…
  • ఒక తమిళ కణ్ణదాసన్…. ఒక తెలుగు వేటూరి… వేరే పోల్చలేను సారీ…
  • ఇడ్లీ నూడుల్స్ కాదు… అసలు ఇడ్లీ రకమే కాదు…. పక్కా ఇడియప్పం…
  • ఎక్కడిదో ఈ దుఃఖ మేఘం, ఆగకుండా వెక్కి వెక్కి కురుస్తోంది… కానీ..?
  • పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions